Call charges
-
షాకింగ్ : నిమిషానికి ఆరు పైసలా?!
సాక్షి, ముంబై: అష్టకష్టాలతో దివాలా దిశగా పయనిస్తున్న టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా సంచలన ప్రతిపాదనలు చేసింది. ఆర్థికంగా భారీ నష్టాలకు తోడు ఏజీఆర్ బకాయిల చెల్లింపు వివాదంతో మరింత కుదేలైన సంస్థ మొబైల్ డేటా, కాల్ చార్జీలపై కొన్ని సవరణలు చేయాలని కోరుతోంది. డేటా చార్జీలను కనీసం 7 రెట్లు , కాల్ చార్జీలను 8 రెట్లు పెంచాలని కోరుతోంది. ఈ మేరకు టెలీకమ్యూనికేషన్స్ విభాగానికి ఒక లేఖ రాసింది. దీంతో వొడాఫోన్ ఐడియా వినియోగదారులు షాక్ తిన్నారు. మొబైల్ డేటా చార్జీని ఒక జీబీకి రూ. 35 వుండాలని,( ప్రస్తుతం జీబీకి రూ. 4-5) అవుట్ గోయింగ్ కాలింగ్ చార్జి నిమిషానికి 6 పైసలుగా( మంత్లీ చార్జీ కాక) నిర్ణయించాలని డాట్‌కు రాసిన లేఖలో వొడాఫోన్ ఐడియా కోరింది. దీంతోపాటు కనీస నెలవారీ కనెక్షన్ ఛార్జీ రూ. 50లుగా ఉంచాలని ప్రతిపాదించింది. ఏజీఆర్ బకాయిలు చెల్లించేందుకు సహాయపడటానికి ఏప్రిల్ 1 నుంచి ప్రతిపాదిత రేట్లను అమలు చేయాలని కోరుతోంది. మార్కెట్ వాటా తగ్గడం మరియు ప్రభుత్వానికి ఎజిఆర్ బకాయిలు చెల్లించడం వల్ల కంపెనీ గత కొన్ని వారాలలో భారీ నష్టాలతో సహా ఆర్థిక ఇబ్బందులను వెల్లడించింది. కాగా ఏజీఆర్ బకాయిలకు సంబంధించి వోడాఫోన్ ఐడియా ప్రభుత్వం చెల్లించాల్సింది. మొత్తం రూ. 53,000 కోట్లు. ఈ బకాయిల్లో కంపెనీ ఇప్పటికే రూ 3500 కోట్లు చెల్లించగా, స్వయం మదింపు ఆధారంగా రూ 23,000 కోట్లు ఇంకా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ 7000 కోట్లు అసలు మొత్తం. మరోవైపు బకాయిల చెల్లింపునకు మూడేళ్ల మారటోరియం గడవు ఇవ్వాలని, బకాయిలు చెల్లించడానికి 18 సంవత్సరాల సమయం కోరినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటికే వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్, జియో కూడా టారిఫ్‌లను పెంచిన సంగతి తెలిసిందే. చదవండి : చార్జీల వడ్డన: జియోకు భారీ షాక్ -
త్వరలోనే రిలయన్స్ జియో చార్జీల పెంపు
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ సారథ్యంలోని టెలికం సంస్థ ‘రిలయన్స్ జియో’ త్వరలోనే చార్జీలను పెంచనున్నట్లు మంగళవారం ప్రకటించింది. వచ్చే కొద్ది వారాల్లోనే మొబైల్ ఫోన్ కాల్స్, డేటా చార్జీలను పెంచనున్నామని ప్రకటించిన కంపెనీ.. ఎంత మేర టారిఫ్ పెరగనుందనే అంశంపై నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది. మిగిలిన టెలికం దిగ్గజాలైన వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ సోమవారమే పెంపు ప్రకటన చేయగా.. ఒక రోజు తరువాత జియో కూడా తన నిర్ణయాన్ని ప్రకటించింది. దేశీ టెలికం రంగాన్ని బలోపేతం చేసి వినియోగదారులకు ప్రయోజనాన్ని అందించడంలో భాగంగా టారిఫ్‌ను పెంచనున్నామని, జియో వివరణ ఇచ్చింది. దీని వల్ల డేటా వినియోగంపైన, డిజిటల్ అనుసరణపైన ప్రతికూల ప్రభావం ఉండబోదని వ్యాఖ్యానించింది. జోరుగా కొత్త యూజర్లు... సెప్టెంబర్‌లో కొత్తగా 69.83 లక్షల యూజర్లను జత చేసుకోవడంతో కంపెనీ మొత్తం చందాదారుల సంఖ్య 35.52 కోట్లకు చేరింది. ఎయిర్టెల్ 23.8 లక్షల యూజర్లను కోల్పోయింది. సబ్స్క్రైబర్ల సంఖ్య 32.55 కోట్లుగా ఉంది. వోడాఫోన్ ఐడియా 25.7 లక్షల చందాదారులను కోల్పోయింది. ఈ సంస్థ యూజర్ బేస్ 37.24 కోట్లకు తగ్గింది. -
మొ‘బిల్’ మోతే..!
న్యూఢిల్లీ: భారీ నష్టాలు, పేరుకుపోయిన రుణాలు... వాటికి తోడు సుప్రీంకోర్టు తాజా తీర్పుతో కేంద్రానికి వేల కోట్లు చెల్లించాల్సి రావటం... ఈ సంక్షోభం నుంచి కొంతైనా గట్టెక్కాలంటే వినియోగదారులపై భారం మోపాల్సిందేనని టెలికం కంపెనీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా కాల్ చార్జీలను పెంచబోతున్నాయి. డిసెంబర్ 1 నుంచి కాల్ చార్జీలను పెంచనున్నట్లు టెలికం దిగ్గజాలు వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ ప్రకటించాయి. అయితే, చార్జీల పెంపు ఎంత మేర ఉంటుందనేది మాత్రం నిర్దిష్టంగా వెల్లడించలేదు. ‘కస్టమర్లకు అంతర్జాతీయ స్థాయి డిజిటల్ సేవలు అందించడాన్ని కొనసాగించే క్రమంలో.. డిసెంబర్ 1 నుంచి సముచిత స్థాయిలో టారిఫ్‌లు పెంచబోతున్నాం’ అని వొడాఫోన్ ఐడియా సోమవారం ప్రకటించింది. ఆ తరువాత కొద్ది సేపటికే భారతీ ఎయిర్టెల్ కూడా తమ రేట్ల పెంపు ప్రతిపాదనలు వెల్లడించింది. ‘అతి వేగంగా మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టు టెలికం రంగంలో భారీ పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. డిజిటల్ ఇండియా కల సాకారం కావాలంటే టెలికం పరిశ్రమ లాభదాయకంగా ఉండటం ముఖ్యం. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ నుంచి చార్జీలను తగు రీతిలో పెంచనున్నాం‘ అని ఎయిర్టెల్ పేర్కొంది. రిలయన్స్ జియో రాకతో టెల్కోల మధ్య అత్యంత చౌక చార్జీల పోరాటాలు ఆరంభమైన సంగతి తెలిసిందే. దీనికి తెరదించేలా అందరికీ కనీస చార్జీలను నిర్దేశించాలని కేంద్రం యోచిస్తున్న పరిస్థితుల్లో వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా నెలవారీ మొబైల్ సేవల ప్లాన్లు డేటా లేకుండా కనిష్టంగా రూ.24 నుంచి, డేటాతో కలిసి ఉన్నట్లయితే రూ.33 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఏజీఆర్‌తో నెత్తిన పిడుగు...! అసలే భారీ రుణాలు, నష్టాల్లో కూరుకుపోయి ఉన్న టెలికం పరిశ్రమపై ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పుతో సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) పిడుగు పడటం తెలిసిందే. ఈ తీర్పుతో కేంద్రానికి లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల కింద ఏకంగా రూ.1.4 లక్షల కోట్ల దాకా టెలికం సంస్థలు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తంలో ఛార్జీలతో పాటు వాటిపై వడ్డీలు, పెనాల్టీలు, పెనాల్టీలపై వడ్డీలు కూడా కలిసి ఉన్నాయి. తీర్పు నేపథ్యంలో... మూడు నెలల్లో బకాయిలు చెల్లించాల్సిందేనంటూ టెలికం విభాగం (డాట్) ఆయా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కంపెనీలు తమ రెండో త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఆ మొత్తానికి కేటాయింపులు జరిపాయి. ఫలితంగా వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ రెండూ కలిసి ఏకంగా సుమారు రూ.74,000 కోట్ల నష్టాలు ప్రకటించాయి. దివాలా తీసిన అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్ కూడా కేటాయింపులతో కలిసి రూ.30,142 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంటే ఈ మూడు సంస్థల మొత్తమే రూ.లక్ష కోట్లు దాటేసింది. ఇందులో ఒక్క ఐడియా వాటాయే రూ.50,921 కోట్లు. దేశీయంగా ఓ కార్పొరేట్ కంపెనీ ఈ స్థాయి నష్టాలు ప్రకటించడం ఇదే రికార్డు. అసలేంటీ ఏఈఆర్ గొడవ? ఇది దాదాపు 16 ఏళ్లుగా సాగుతున్న వివాదం. టెలికం సేవల కోసం లైసెన్సులు పొందిన టెల్కోలు తమకు వచ్చే రెవెన్యూలో నిర్దిష్ట శాతాన్ని లైసెన్సు ఫీజు కింద, స్పెక్ట్రం యూసేజి చార్జీల కింద చెల్లించాల్సి ఉంటుంది. అయితే ‘రెవెన్యూ’ను లెక్కించే విషయంలో మాత్రం టెల్కోలు, కేంద్ర టెలికాం విభాగం మధ్య వివాదం సాగుతోంది. టెలికంయేతర కార్యకలాపాల ద్వారా వచ్చే నిధులు కూడా టెల్కోలకు రెవెన్యూయేనని కేంద్రం వాదన. దానికి తగ్గట్లుగా సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) ప్రాతిపదికన టెల్కోలు.. లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు కట్టాలని నిర్దేశించింది. కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ టెల్కోలు న్యాయపోరాటానికి దిగాయి. తాజాగా వాటికి ఎదురుదెబ్బ తగిలింది. ఏజీఆర్ లెక్కింపుపై కేంద్రం ఫార్ములాను సమరి్థస్తూ అక్టోబర్ 24న సుప్రీం కోర్టు ఉత్తర్వులిచ్చింది. బకాయిల్ని పెనాల్టీలను వడ్డీతో సహా మూడు నెలల్లోగా కట్టేయాలంటూ ఆదేశించింది. దీంతో టెలికం కంపెనీలు రూ.1.4 లక్షల కోట్లు చెల్లించాల్సి రావచ్చని అంచనా. టెల్కోలపై బాకీల భారం అటు వాటికి రుణాలిచి్చన బ్యాంకులనూ ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు, పరిస్థితులను గాడినపెట్టేందుకు తగు చర్యల్ని సూచిం చేందుకు కేంద్రం అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ఈ గట్టున జియో... ఆ గట్టున మిగతావి!! పోటాపోటీగా చార్జీలు తగ్గించాల్సి రావడం, కార్యకలాపాల విస్తరణకు భారీగా రుణాలు తీసుకోవడం వల్ల టెలికం సంస్థలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. జూన్ ఆఖరు నాటి గణాంకాల ప్రకారం వొడాఫోన్ ఐడియా రుణభారం రూ.99,000 కోట్లపైనే ఉంది. ఇక ఎయిర్‌టెల్‌కు రూ.1.16 లక్షలపైన రుణాలున్నాయి. ఈ నేపథ్యంలో టెలికం రంగానికి సహాయక ప్యాకేజీ ఇవ్వాలంటూ పాత తరం టెల్కోలు కేంద్రాన్ని కోరుతున్నాయి. అయితే, ప్యాకేజీల్లాంటివేమీ అవసరం లేదని ముకేశ్ అంబానీ సంస్థ జియో వాదిస్తోంది. ఏజీఆర్ విషయంలో కూడా రిలయన్స్ జియో చెల్లించాల్సిన మొత్తం రూ.41 కోట్లు మాత్రమేనని విశ్లేషణలు వస్తున్నాయి. ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జీల (ఐయూసీ) విషయంలో కూడా వీటిని తొలగించాలని జియో వాదిస్తుండగా... ఎయిర్టెల్, ఐడియా మాత్రం ఉంచాలని కోరుతున్నాయి. అంటే... ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు కాల్ చేసినపుడు... కాల్ అందుకున్న నెట్‌వర్క్‌కు, కాల్ చేసిన నెట్వర్క్ నిమిషానికి 6 పైసలు చెల్లించాలి. దీనివల్ల జియో నికరంగా ఇతర టెల్కోలకు కొంత మొత్తం చెల్లించాల్సి వస్తోంది. దీంతో వీటిని తొలగించాలని మొదటి నుంచీ వాదిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి తొలగించడానికి కూడా గతంలో కేంద్రం సమ్మతించింది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో వీటిని తొలగించకూడదని ఐడియా, ఎయిర్టెల్ మరింత గట్టిగా గళమెత్తేసరికి... త్వరలో కొత్త విధానం తెస్తామని ట్రాయ్ ప్రకటించింది. మూడేళ్లు మారటోరియం కావాలి: సీవోఏఐ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో భారీగా బకాయిలు కట్టాల్సి రానున్న టెలికం కంపెనీలు.. కొంత వెసులుబాటు కల్పించాలంటూ కేంద్రాన్ని పదే పదే అభ్యర్థిస్తున్నాయి. చెల్లింపులపై మూడేళ్ల మారటోరియం ఇవ్వాలని, మొత్తం బాకీలన్నీ కట్టేందుకు గడువు మరింత పొడిగించాలని, వడ్డీ రేటు తక్కువ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ చెప్పారు. తీవ్ర సంక్షోభంలో కొట్టుకుంటున్న టెలికం ఆపరేటర్లకు కాస్త ’ప్రాణవాయువు’ అందించాలని అభ్యర్థించారు. అలాగే, టెలికం కంపెనీల రుణాల పునర్వ్యవస్థీకరణ అంశంపై కూడా కేంద్రం దృష్టి సారించాలని కోరారాయన. 4జీ టెలికం సేవలకు సంబంధించి టెల్కోలు తీసుకున్న లైసెన్సుల గడువు మరో 11 ఏళ్ల పాటు ఉన్నందున.. బకాయిలను ఇప్పటికిప్పుడు కాకుండా.. పదేళ్లలో నెమ్మదిగా చెల్లించేందుకు ఆపరేటర్లకు వెసులుబాటు కల్పించాలని కోరారు. భవిష్యత్‌లో మారబోయే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏజీఆర్‌ను పునర్నిర్వచించాలని కూడా సూచించారు. మారటోరియం అంటే... సాధారణంగా రుణం తీసుకున్న మరుసటి నెల నుంచే ఈఎంఐలు మొదలవుతాయి. అయితే కొన్నాళ్లపాటు కట్టకుండా వెసులుబాటు కల్పించడాన్ని మారటోరియంగా వ్యవహరిస్తారు. అయితే, ఈ మారటోరియం కాలానికి కూడా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. చదువుకోవటానికి రుణం తీసుకున్నవారు... చదువు పూర్తయ్యాక ఈఎంఐలు చెల్లించటం మొదలుపెడతారు కనక... విద్యా రుణాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంటుంది. -
కాల్ చార్జీలు భారీగా తగ్గింపు.. ఖైదీలు హర్షం
హైదరాబాద్: రాష్ట్ర జైళ్లలో ఉండే ఖైదీలకు ఫోన్ కాల్ చార్జీల ధరలను భారీగా తగ్గించారు. ఆ మేరకు తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు 6 రూపాయలకే 5 నిమిషాలపాటు మాట్లాడే అవకాశం కల్పించారు. గతంలో జైలు నుంచి ఖైదీలు ఒక ఫోన్ మాట్లాడాలంటే 20 రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. ఏకంగా కాల్ చార్జీలు 14 రూపాయలు తగ్గించడంతో ఖైదీలు సంతోషం వ్యక్తం చేశారు. పోలీసులు 2014 నుంచి ఖైదీలకు ఫోను మాట్లాడే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. -
రోమింగ్ చార్జీలు తగ్గాయ్..
కాల్ చార్జీలు 40 శాతం వరకూ - ఎస్ఎంఎస్ చార్జీలు 75% వరకూ - నేటి నుంచి వర్తింపు న్యూఢిల్లీ: రోమింగ్ చార్జీలు దిగివస్తున్నాయి. ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ వంటి దిగ్గజ టెలికాం కంపెనీలు రోమింగ్ చార్జీలను 75 శాతం వరకూ తగ్గించాయి. ఈ తగ్గింపు నేటి (మే1-శుక్రవారం) నుంచి అమలవుతుంది. రోమింగ్‌లో ఉన్నప్పుడు కాల్స్ చార్జీలు 40 శాతం వరకూ, ఎస్ఎంఎస్ చార్జీలు 75 శాతం వరకూ తగ్గాయి. గత నెల 9న టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) నేషనల్ రోమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ టారిఫ్‌ల పరిమితులను తగ్గించింది. దీంతో టెలికం కంపెనీలు తాజా నిర్ణయం తీసుకున్నాయి. ఎయిర్టెల్: ఇన్కమింగ్ కాల్ రేట్లు 40 శాతం వరకూ, అవుట్ గోయింగ్ (ఎస్టీడీ) కాల్ రేట్లు 23 శాతం వరకూ. అవుట్ గోయింట్ లోకల్ కాల్ రేట్లు 20 శాతం వరకూ, లోకల్ ఎస్ఎంఎస్ రేట్లు 75 శాతం వరకూ, ఎస్టీడీ ఎస్ఎంఎస్ రేట్లు 74 శాతం వరకూ తగ్గించింది. ఐడియా సెల్యులర్: ఇన్కమింగ్ కాల్స్‌ను 40 శాతం తగ్గించింది. అవుట్ గోయింగ్ లోకల్ కాల్ రేట్లను 20 శాతానికి, అవుట్ గోయింగ్ ఎస్టీడీ కాల్ రేట్లను 23 శాతం చొప్పున తగ్గించింది. ఆర్‌కామ్: ఇన్కమింగ్ కాల్స్ చార్జీలను 40 శాతం తగ్గించామని వివరించింది. అవుట్ గోయింగ్ కాల్స్ (లోకల్, ఎస్టీడీల) చార్జీలను 23 శాతం వరకూ తగ్గించామని పేర్కొంది. -
కాల్ చార్జీలు పెరుగుతాయ్!
స్పెక్ట్రం పెట్టుబడులు రాబట్టుకునేందుకు టెల్కోల వ్యూహం రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా న్యూఢిల్లీ: వేలంలో స్పెక్ట్రం కోసం వెచ్చించిన భారీ మొత్తాలను రాబట్టుకునేందుకు దేశీ టెలికం కంపెనీలు కాల్ చార్జీలను క్రమక్రమంగా పెంచే అవకాశాలున్నాయి. స్పెక్ట్రం అధిక ఖరీదు వల్ల పెరిగిపోయే రుణభారం, వడ్డీ వ్యయాలను తగ్గించుకునేందుకు, విస్తరణ ప్రణాళికలు దెబ్బతినకుండా చూసుకునేందుకు టెల్కోలు ఈ చర్యలు తీసుకోవచ్చని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేసింది. అయితే పెంపుదల క్రమక్రమంగానే ఉండనున్న నేపథ్యంలో టెలికం సంస్థల రుణభారం మరికొంత కాలం పాటు అధిక స్థాయిలోనే ఉండగలదని పేర్కొంది. 3జీ డేటా సేవలకు పెరుగుతున్న డిమాండ్‌తో ఈ విభాగం నుంచి టెల్కోలకు గణనీయంగా ఆదాయం రాగలదని, స్పెక్ట్రంపై పెట్టిన పెట్టుబడిని రాబట్టుకునేందుకు ఉపయోగపడగలదని మూడీస్ తెలిపింది. మార్చి 25తో ముగిసిన టెలికం స్పెక్ట్రం వేలం ద్వారా ప్రభుత్వానికి మొత్తం రూ. 1,09,874.91 కోట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఐడియా సెల్యులార్ అత్యధికంగా రూ. 30,307 కోట్లు, తర్వాత ఎయిర్టెల్ రూ. 29,130 కోట్లు, వొడాఫోన్ రూ. 29,960 కోట్లు, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రూ. 10,077 కోట్లు, రిలయన్స్ కమ్యూనికేషన్ రూ. 4,299 కోట్లు, టాటా టెలీసర్వీసెస్ రూ. 7,851 కోట్లు, ఎయిర్‌సెల్ రూ. 2,250 కోట్లు వెచ్చించాయి. ప్రభుత్వం నిర్ణయించిన బేస్ ధర కన్నా ఆపరేటర్లు సుమారు 35 శాతం అధికంగా బిడ్ చేసినట్లు మూడీస్ వివరించింది. దీని వల్ల భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ సహా ఆపరేటర్ల రుణభారం మరింతగా పెరిగిపోతుందని పేర్కొంది. అలాగే వచ్చే 12-24 నెలల వ్యవధిలో వాటి విస్తరణ ప్రణాళికలపైనా ప్రతికూల ప్రభావం పడగలదని, ఫలితంగా 3జీ/4జీ నెట్వ ర్క్‌ల విస్తరణ మందగించవచ్చని మూడీస్ వివరించింది. కాబట్టి చాలా మటుకు సంస్థలు వాయిదాల పద్ధతిలోనే చెల్లింపులు జరిపే అవకాశం ఉందని అభిప్రాయపడింది. గ్యాస్ ఆధారిత ఎరువుల ప్లాంట్లతో బ్యాంకులకు మేలు.. గ్యాస్ ఆధారిత ప్లాంట్ల పునరుద్ధరణ ప్రణాళికల కారణంగా వాటికి రుణాలు ఇచ్చిన బ్యాంకులకు ప్రయోజనం చేకూరగలదని మూడీస్ పేర్కొంది. స్పెక్ట్రం లభ్యత తక్కువ ..: ట్రాయ్యూరప్ దేశాలతో పోలిస్తే భారత్‌లో స్పెక్ట్రం లభ్యత చాలా తక్కువని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ రాహుల్ ఖుల్లార్ తెలిపారు. విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ లేదా కర్ణాటకలకన్నా తక్కువే ఉండే కొన్ని యూరప్ దేశాలు.. ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇక్కడ స్పెక్ట్రం లభ్యత 40 శాతం కన్నా తక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. ఇరవై ఏళ్ల క్రితం ఎంత స్పెక్ట్రం అందుబాటులో ఉండేదో ఇప్పుడూ కూడా అంతే ఉందన్నారు.అధిక స్పెక్ట్రం లేకపోతే నాణ్యమైన సేవలు అందించడం కూడా సాధ్యపడదన్నారు.