కాల్ చార్జీలు పెరుగుతాయ్!
స్పెక్ట్రం పెట్టుబడులు
రాబట్టుకునేందుకు టెల్కోల వ్యూహం
రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా
న్యూఢిల్లీ: వేలంలో స్పెక్ట్రం కోసం వెచ్చించిన భారీ మొత్తాలను రాబట్టుకునేందుకు దేశీ టెలికం కంపెనీలు కాల్ చార్జీలను క్రమక్రమంగా పెంచే అవకాశాలున్నాయి. స్పెక్ట్రం అధిక ఖరీదు వల్ల పెరిగిపోయే రుణభారం, వడ్డీ వ్యయాలను తగ్గించుకునేందుకు, విస్తరణ ప్రణాళికలు దెబ్బతినకుండా చూసుకునేందుకు టెల్కోలు ఈ చర్యలు తీసుకోవచ్చని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేసింది. అయితే పెంపుదల క్రమక్రమంగానే ఉండనున్న నేపథ్యంలో టెలికం సంస్థల రుణభారం మరికొంత కాలం పాటు అధిక స్థాయిలోనే ఉండగలదని పేర్కొంది.
3జీ డేటా సేవలకు పెరుగుతున్న డిమాండ్‌తో ఈ విభాగం నుంచి టెల్కోలకు గణనీయంగా ఆదాయం రాగలదని, స్పెక్ట్రంపై పెట్టిన పెట్టుబడిని రాబట్టుకునేందుకు ఉపయోగపడగలదని మూడీస్ తెలిపింది. మార్చి 25తో ముగిసిన టెలికం స్పెక్ట్రం వేలం ద్వారా ప్రభుత్వానికి మొత్తం రూ. 1,09,874.91 కోట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఐడియా సెల్యులార్ అత్యధికంగా రూ. 30,307 కోట్లు, తర్వాత ఎయిర్‌టెల్ రూ. 29,130 కోట్లు, వొడాఫోన్ రూ. 29,960 కోట్లు, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రూ. 10,077 కోట్లు, రిలయన్స్ కమ్యూనికేషన్ రూ. 4,299 కోట్లు, టాటా టెలీసర్వీసెస్ రూ. 7,851 కోట్లు, ఎయిర్‌సెల్ రూ. 2,250 కోట్లు వెచ్చించాయి.
ప్రభుత్వం నిర్ణయించిన బేస్ ధర కన్నా ఆపరేటర్లు సుమారు 35 శాతం అధికంగా బిడ్ చేసినట్లు మూడీస్ వివరించింది. దీని వల్ల భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ సహా ఆపరేటర్ల రుణభారం మరింతగా పెరిగిపోతుందని పేర్కొంది. అలాగే వచ్చే 12-24 నెలల వ్యవధిలో వాటి విస్తరణ ప్రణాళికలపైనా ప్రతికూల ప్రభావం పడగలదని, ఫలితంగా 3జీ/4జీ నెట్‌వ ర్క్‌ల విస్తరణ మందగించవచ్చని మూడీస్ వివరించింది. కాబట్టి చాలా మటుకు సంస్థలు వాయిదాల పద్ధతిలోనే చెల్లింపులు జరిపే అవకాశం ఉందని అభిప్రాయపడింది.
గ్యాస్ ఆధారిత ఎరువుల ప్లాంట్లతో బ్యాంకులకు మేలు..
గ్యాస్ ఆధారిత ప్లాంట్ల పునరుద్ధరణ ప్రణాళికల కారణంగా వాటికి రుణాలు ఇచ్చిన బ్యాంకులకు ప్రయోజనం చేకూరగలదని మూడీస్ పేర్కొంది. స్పెక్ట్రం లభ్యత తక్కువ ..: ట్రాయ్‌యూరప్ దేశాలతో పోలిస్తే భారత్‌లో స్పెక్ట్రం లభ్యత చాలా తక్కువని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ రాహుల్ ఖుల్లార్ తెలిపారు. విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ లేదా కర్ణాటకలకన్నా తక్కువే ఉండే కొన్ని యూరప్ దేశాలు.. ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇక్కడ స్పెక్ట్రం లభ్యత 40 శాతం కన్నా తక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. ఇరవై ఏళ్ల క్రితం ఎంత స్పెక్ట్రం అందుబాటులో ఉండేదో ఇప్పుడూ కూడా అంతే ఉందన్నారు.అధిక స్పెక్ట్రం లేకపోతే నాణ్యమైన సేవలు అందించడం కూడా సాధ్యపడదన్నారు.