Rating agency Moodys
-
12 శాతానికి భారత ఆర్థిక వృద్ధి రేటు!
న్యూఢిల్లీ: భారత జీడీపీ 2021లో 12 శాతం మేర వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేసింది. సమీప కాలంలో పరిస్థితులు భారత్‌కు ఎంతో సానుకూలంగా ఉన్నట్టు ఈ సంస్థ పేర్కొంది. 2020 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశ జీడీపీ మైనస్ 7.5 శాతానికి పడిపోయిన తర్వాత.. డిసెంబర్ త్రైమాసికంలో 0.4 శాతం వృద్ధిలోకి చేరుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ క్వార్టర్ వృద్ధి రేటు అంచనాలకు మించి ఉన్నట్టు మూడీస్ పేర్కొంది. ‘‘ప్రైవేటు వినియోగం, నివాసేతర పెట్టుబడులు వచ్చే కొన్ని త్రైమాసికాల్లో చెప్పుకోతగ్గ స్థాయిలో పుంజుకుంటాయి. ఇది 2021లో దేశీయ డిమాండ్ పుంజుకునేందుకు సాయపడుతుంది’’ అని మూడీస్ తన తాజా నివేదికలో వివరించింది. క్రితం సంవత్సరంలో జీడీపీ కనిష్టాలకు పడిపోయినందున.. అక్కడి నుంచి చూసుకుంటే 2021 సంవత్సరంలో భారత వాస్తవ జీడీపీ వృద్ధి 12 శాతంగా ఉంటుందని తెలిపింది. కరోనాకు ముందున్న వృద్ధితో (2020 మార్చి త్రైమాసికం) పోలిస్తే ఇది 4.4 శాతం ఎక్కువ. ద్రవ్య, పరపతి విధానాలు వృద్ధికి అనుకూలంగానే ఉంటాయన్న అభిప్రాయాన్ని మూడీస్ వ్యక్తం చేసింది. ఈ ఏడాది అదనపు రేట్ల కోతలను అంచనా వేయడం లేదని పేర్కొంది. దేశీయ వినియోగాన్ని చూసి అవసరమైతే ద్వితీయ అర్ధ సంవత్సరంలో కొంత ద్రవ్యపరమైన మద్దతు అవసరం కావచ్చని అంచనా వేసింది. అయితే, 2021లో రికవరీ కరోనా కేసుల మలివిడత తీవ్రతపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా రెండో విడత కేసుల తీవ్రత కొన్ని రాష్ట్రాల పరిధిలోనే ఎక్కువగా ఉన్నందున కట్టడికి అవకాశం ఉంటుందని పేర్కొంది. 11 శాతం వృద్ధి అవసరం: నీతి ఆయోగ్ భారత్ రానున్న ఆర్థిక సంవత్సరంలో (2021–22) 10.5–11 శాతం స్థాయిలో వాస్తవ వృద్ధి రేటును చేరుకోవాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. మరోసారి వచ్చే మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ సన్నద్ధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. నేషనల్ సీఎస్ఆర్ నెట్వర్క్ వర్చువల్‌గా నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాజీవ్‌కుమార్ మాట్లాడారు. -
సాయం అందినా తీరు మారదు!
న్యూఢిల్లీ: కేంద్రం నుంచి అదనపు మూలధనం అందినా కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడకపోవచ్చని, ఒత్తిళ్లు కొనసాగవచ్చని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. ఆయా బ్యాంకులు నిబంధనలకు అనుగుణంగా మూలధన నిష్పత్తుల స్థాయిని పాటించేందుకు మాత్రమే ప్రభుత్వం నుంచి అందే నిధులు సరిపోతాయని వివరించింది. ‘బ్యాంకుల మూలధన నిల్వల పరిస్థితిని మెరుగుపర్చే ఉద్దేశంతో ప్రభుత్వం రీక్యాపిటలైజేషన్ ప్రణాళిక కింద భారీగా సమకూర్చే నిధులు.. ఆయా బ్యాంకుల తక్షణ క్యాపిటల్ నిష్పత్తి అవసరాలకు మాత్రమే సరిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే, ప్రభుత్వం ముందుగా అంచనా వేసిన దానికి ప్రస్తుతానికి మూలధన లోటు భారీగా పెరిగింది‘ అని భారత్‌లోని ప్రభుత్వ రంగ బ్యాంకులపై రూపొందించిన నివేదికలో మూడీస్ వివరించింది. మొండిబాకీలు, భారీ నష్టాలతో కుదేలవుతున్న పీఎస్‌బీలను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 2.1 లక్షల కోట్ల రీక్యాపిటలైజేషన్ ప్రణాళికను అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గతేడాది రూ. 90,000 కోట్లు సమకూర్చగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రూ. 65,000 కోట్లు అందించనుంది. గత నెల (జూలైలో) అయిదు బ్యాంకులకు రూ. 11,300 కోట్లు సమకూర్చింది. ఈ నేపథ్యంలో మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. బాసెల్ త్రీ నిబంధనల కింద 2019 మార్చి నాటికి కనీసం 8 శాతం మూలధన నిష్పత్తి సాధించేందుకు మాత్రమే ప్రస్తుతం బ్యాంకులకు కేంద్రం అందిస్తున్న నిధులు సరిపోవచ్చని తమ విశ్లేషణలో తెలుస్తోందని మూడీస్ వైస్ ప్రెసిడెంట్ అల్కా అన్బరసు చెప్పారు. రుణ వృద్ధి 5–6 శాతమే ఉండాలి.. నియంత్రణ సంస్థ నిర్దేశిత స్థాయిల్లో మూలధన నిల్వలను పాటించాలంటే.. బ్యాంకులు రుణ వృద్ధిని ఒక మోస్తరుగా 5–6 శాతం స్థాయిలోనే కొనసాగించాల్సి ఉంటుందని అల్కా తెలిపారు. ఒకవేళ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా రుణ వృద్ధిని మెరుగుపర్చాలనుకుంటే బ్యాంకులకు మరింతగా మూలధనం సమకూర్చడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం లేదని ఆమె వివరించారు. కేంద్రం నుంచి అందే అదనపు మూలధనంతో బ్యాంకులు తమ ప్రొవిజనింగ్ కవరేజీని పటిష్టపర్చుకోగలిగినా.. ఒకవేళ ఏదైనా మొండి పద్దును విక్రయించేటప్పుడు భారీగా బకాయిలకు కోతపడిందంటే ఈ నిధులు సరిపోకపోవచ్చని మూడీస్ తెలిపింది. ప్రొవిజనింగ్ పెంచాల్సి వస్తే.. మూలధన అవసరాలు కూడా గణనీయంగా పెరుగుతాయని వివరించింది. కేంద్రం మద్దతుతో ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ మూలధనాన్ని, ప్రొవిజనింగ్‌కు కావాల్సిన నిల్వలను పెంచుకోగలిగినా.. సరైన సంస్కరణలను అమలు చేయకపోతే ఈ ప్రయోజనాలన్నీ తాత్కాలిక మైనవిగానే ఉంటాయని పేర్కొంది. -
కాల్ చార్జీలు పెరుగుతాయ్!
స్పెక్ట్రం పెట్టుబడులు రాబట్టుకునేందుకు టెల్కోల వ్యూహం రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా న్యూఢిల్లీ: వేలంలో స్పెక్ట్రం కోసం వెచ్చించిన భారీ మొత్తాలను రాబట్టుకునేందుకు దేశీ టెలికం కంపెనీలు కాల్ చార్జీలను క్రమక్రమంగా పెంచే అవకాశాలున్నాయి. స్పెక్ట్రం అధిక ఖరీదు వల్ల పెరిగిపోయే రుణభారం, వడ్డీ వ్యయాలను తగ్గించుకునేందుకు, విస్తరణ ప్రణాళికలు దెబ్బతినకుండా చూసుకునేందుకు టెల్కోలు ఈ చర్యలు తీసుకోవచ్చని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేసింది. అయితే పెంపుదల క్రమక్రమంగానే ఉండనున్న నేపథ్యంలో టెలికం సంస్థల రుణభారం మరికొంత కాలం పాటు అధిక స్థాయిలోనే ఉండగలదని పేర్కొంది. 3జీ డేటా సేవలకు పెరుగుతున్న డిమాండ్‌తో ఈ విభాగం నుంచి టెల్కోలకు గణనీయంగా ఆదాయం రాగలదని, స్పెక్ట్రంపై పెట్టిన పెట్టుబడిని రాబట్టుకునేందుకు ఉపయోగపడగలదని మూడీస్ తెలిపింది. మార్చి 25తో ముగిసిన టెలికం స్పెక్ట్రం వేలం ద్వారా ప్రభుత్వానికి మొత్తం రూ. 1,09,874.91 కోట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఐడియా సెల్యులార్ అత్యధికంగా రూ. 30,307 కోట్లు, తర్వాత ఎయిర్టెల్ రూ. 29,130 కోట్లు, వొడాఫోన్ రూ. 29,960 కోట్లు, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రూ. 10,077 కోట్లు, రిలయన్స్ కమ్యూనికేషన్ రూ. 4,299 కోట్లు, టాటా టెలీసర్వీసెస్ రూ. 7,851 కోట్లు, ఎయిర్‌సెల్ రూ. 2,250 కోట్లు వెచ్చించాయి. ప్రభుత్వం నిర్ణయించిన బేస్ ధర కన్నా ఆపరేటర్లు సుమారు 35 శాతం అధికంగా బిడ్ చేసినట్లు మూడీస్ వివరించింది. దీని వల్ల భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ సహా ఆపరేటర్ల రుణభారం మరింతగా పెరిగిపోతుందని పేర్కొంది. అలాగే వచ్చే 12-24 నెలల వ్యవధిలో వాటి విస్తరణ ప్రణాళికలపైనా ప్రతికూల ప్రభావం పడగలదని, ఫలితంగా 3జీ/4జీ నెట్వ ర్క్‌ల విస్తరణ మందగించవచ్చని మూడీస్ వివరించింది. కాబట్టి చాలా మటుకు సంస్థలు వాయిదాల పద్ధతిలోనే చెల్లింపులు జరిపే అవకాశం ఉందని అభిప్రాయపడింది. గ్యాస్ ఆధారిత ఎరువుల ప్లాంట్లతో బ్యాంకులకు మేలు.. గ్యాస్ ఆధారిత ప్లాంట్ల పునరుద్ధరణ ప్రణాళికల కారణంగా వాటికి రుణాలు ఇచ్చిన బ్యాంకులకు ప్రయోజనం చేకూరగలదని మూడీస్ పేర్కొంది. స్పెక్ట్రం లభ్యత తక్కువ ..: ట్రాయ్యూరప్ దేశాలతో పోలిస్తే భారత్‌లో స్పెక్ట్రం లభ్యత చాలా తక్కువని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ రాహుల్ ఖుల్లార్ తెలిపారు. విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ లేదా కర్ణాటకలకన్నా తక్కువే ఉండే కొన్ని యూరప్ దేశాలు.. ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇక్కడ స్పెక్ట్రం లభ్యత 40 శాతం కన్నా తక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. ఇరవై ఏళ్ల క్రితం ఎంత స్పెక్ట్రం అందుబాటులో ఉండేదో ఇప్పుడూ కూడా అంతే ఉందన్నారు.అధిక స్పెక్ట్రం లేకపోతే నాణ్యమైన సేవలు అందించడం కూడా సాధ్యపడదన్నారు.