జియోకి వ్యతిరేకంగా ఏకమైన టెల్కోలు
న్యూడిల్లీ: టెలికాం కంపెనీల మధ్య వార్ మరోసారి తెరపైకి వచ్చింది. ఉచిత ఆఫర్లతో దూసుకువచ్చిన రిలయన్స జియోపై టెలికాం దిగ్గజం కంపెనీలు పలు ఆరోపణలు గుప్పించాయి. జియోకి వ్యతిరేకంగా ఏకమైన దిగ్గజ కంపెనీలు దోపిడీధరలతో జియో కస్టమర్లను మోసం చేస్తోందని ధ్వజమెత్తాయి. ఈ మేరకు ఇంటర్మీడియాలిటీ గ్రూప్ (ఐఎంజీ) ముందు తమ వాదనను వినిపించాయి. శుక్రవారం ఫైనాన్స్, టెలికాం మంత్రిత్వ శాఖల అధికారుల బృందంతో మాట్లాడిన కంపెనీలు, జియో వాస్తవికతను తప్పుగా చూపించిందన్నారు.
దేశంలోని ప్రధాన టెలికాం సంస్థలు భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ సంస్థలు రిలయన్స్ జియో అధికారులకు అవాస్తవాలు చెప్పిందని ఆరోపించాయి. తక్కువ ధరకే డేటా సేవలను ఆఫర్ చేసి మార్కెట్ షేరును గెలుచుకోవాలని చూస్తోందంటూ ప్రత్యర్థి జియోపై మండిపడ్డాయి. ముఖ్యంగా దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ భారతి ఎయిర్ టెల్ జియో "దోపిడీ ధర" విధానాన్ని స్వీకరించిందని ఆరోపించింది. తద్వారా పరిశ్రమల ఆదాయం, నికర ఆదాయం, క్యాపిటల్స్‌ను తిరిగి రాబట్టడంలో తీవ్రంగా నష్టపోయిందని ఎయిర్టెల్ పేర్కింది. దీన్ని నిరోధించాలని ఐఎంజీని కోరింది. అంతేకాదు, టెలికాం నియంత్రణాధికారి ట్రాయ్ కోర్టులో అంతిమ నిర్ణయం తీసుకునే వరకు ఇంటర్కనెక్షన్ యూసేజ్ ధరలను నియంత్రిచాలని కోరాయి. లేదంటే తమకు "కోలుకోలేని ఆర్థిక నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేశాయి.
మరోవైపు జీఎస్‌టీ పన్ను విధానంపై కూడా కంపెనీలు స్పందించాయి. ఇతర ప్రధాన రంగాల లాగానే, 18 శాతానికి బదులుగా, ప్రస్తుతం ఉన్న 5 శాతాన్ని కొనసాగించాలని వోడాఫోన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోరారు. టెలికాం సేవంలపై 5శాతం జీఎస్‌టీ పన్ను ఉండాలన్న వాదనను ఐడియా కూడా సమర్ధించింది. తద్వారా లైసెన్సింగ్ ఫీజు తగ్గుతుందని పేర్కింది. యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్ లెవీని రద్దు చేయడం ద్వారా లైసెన్స్ ఫీజును 3 శాతానికి తగ్గించాలని ఎయిర్ టెల్ సూచించింది.