న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌లో మొత్తం 1.76 శాతం వాటాను సింగపూర్ టెలీకమ్యూనికేషన్స్(సింగ్‌టెల్) విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా షేరుకి రూ. 686 ధరలో పాస్టెల్ లిమిటెడ్(సింగ్‌టెల్ సంస్థ) 1.63 శాతం వాటాను విక్రయించింది. ఎన్‌ఎస్‌ఈ బల్క్ డీల్ గణాంకాల ప్రకారం దాదాపు రూ. 6,602 కోట్ల విలువైన ఈ వాటా(9.62 కోట్లకుపైగా షేర్లు)ను ఎయిర్‌టెల్ ప్రమోటర్ భారతీ టెలికం కొనుగోలు చేసింది.
ఈ బాటలో సింగ్‌టెల్ మరో సంస్థ విరిడియన్ సైతం 0.13 శాతం వాటా(కోటి షేర్లు)ను ఇదే ధరలో విక్రయించినట్లు తెలుస్తోంది. సాధారణ వాటాదారులు 70 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ లావాదేవీ తదుపరి భారతీ ఎయిర్‌టెల్‌లో పబ్లిక్ వాటా 44.74 శాతం నుంచి 44.87 శాతానికి పెరిగినట్లు తెలియజేశాయి. జూన్ చివరికల్లా ఎయిర్‌టెల్‌లో భారతీ టెలికం 35.85 శాతం వాటా కలిగి ఉంది. కాగా.. భారతీ టెలికంలో సింగ్‌టెల్‌కు 50.56 శాతం, సునీల్ మిట్టల్ కుటుంబానికి 49.44 శాతం చొప్పున వాటా ఉంది.
ఈ వార్తల నేపథ్యంలో ఎయిర్‌టెల్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.4 శాతం బలపడి రూ. 379 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment