జియో దెబ్బకొట్టినా.. దూకుడుగా ఎయిర్ టెల్
జియో దెబ్బకొట్టినా.. దూకుడుగా ఎయిర్ టెల్
Published Wed, May 10 2017 4:30 PM | Last Updated on Thu, Mar 28 2019 6:23 PM
టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ షేర్లు నేటి ట్రేడింగ్ లో మెరుపులు మెరిపించాయి. దూకుడుగా దూసుకుపోతూ 10 శాతం ర్యాలీ జరిపి, ఇంట్రాడేలో 380 రూపాయల గరిష్ట స్థాయిని తాకాయి. ఓ వైపు భారతీ ఎయిర్ టెల్ లాభాలకు రిలయన్స్ జియో భారీగా దెబ్బకొట్టినా బుధవారం మార్కెట్లో మాత్రం కంపెనీ షేర్లపై ఆ ప్రభావమే కనిపించలేదు. మంగళవారం ఫలితాలు ప్రకటించిన ఈ కంపెనీ లాభాల్లో పడిపోయినప్పటికీ, తన ఆఫ్రికన్ వ్యాపారాలు లాభాల్లో మరలినట్టు రిపోర్టు చేసింది. 2010లో ప్రారంభించిన ఈ ఆఫ్రికన్ వ్యాపారాలు మొదటిసారి లాభాల బాట పట్టడం కంపెనీ షేర్లకు భారీగా బూస్ట్ నిచ్చినట్టు అనాలిస్టులు చెప్పారు. జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన ఎయిర్ టెల్ తన లాభాలను 72 శాతం కోల్పోయినట్టు పేర్కొంది.
లాభాల్లో భారీ క్షీణత ఉన్నప్పటికీ, కంపెనీ ఆఫ్రికన్ వ్యాపారాలు మాత్రం లాభాల బాట పట్టాయి. కొత్తగా వచ్చిన రిలయన్స్ జియో ఆకర్షణీయమైన ఆఫర్ల కారణంగా నికర లాభం వరుసగా రెండో క్వార్టర్‌లోనూ క్షీణించిందని కంపెనీ ఎండీ, సీఈఓ(భారత్, దక్షిణాసియా) గోపాల్ విఠల్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్‌లో కంపెనీ నికర లాభం 55 శాతం తగ్గిందన్నారు. మూలధన పెట్టుబడులను రూ.6,057 కోట్ల నుంచి రూ.3,808 కోట్లకు తగ్గించుకున్నప్పటికీ, నికర లాభంలో క్షీణత తప్పలేదని చెప్పారు. రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ల కారణంగా ఇన్‌కమింగ్ కాల్స్ సునామీలా వెల్లువెత్తాయని చెప్పారు. అయితే స్థిరమైన కరెన్సీ విలువల్లో ఏడాది ఏడాదికి ఆఫ్రికన్ రెవెన్యూలు 2.6 శాతం పెరిగాయి. డేటా రెవెన్యూలు కూడా 14.5 శాతం పెరిగి 157 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. మొత్తం డేటా రెవెన్యూల్లో ఆఫ్రికన్ రెవెన్యూలు 17.7 శాతం ఉన్నట్టు భారతీ ఎయిర్ టెల్ ప్రకటించింది.
Advertisement
Advertisement