భారతీ టెలికంలో 7.39% వాటా సింగ్ టెల్ చేతికి
డీల్ విలువ రూ.4,400 కోట్లు
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్ హోల్డింగ్ కంపెనీ అయిన భారతీ టెలికంలో 7.39 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు సింగపూర్ టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్(సింగ్‌టెల్) తెలిపింది. ఈ వాటాను 65.95 కోట్ల డాలర్లకు (రూ.4,400 కోట్లు) కొనుగోలు చేస్తామని పేర్కొంది. అలాగే థాయ్‌లాండ్ టెలికం కంపెనీ ఇన్‌టచ్ హోల్డింగ్స్ పీసీఎల్‌లో 21 శాతం వాటాను కొనుగోలు చేయనున్నామని వెల్లడించింది. ఈ రెండు వాటాల కొనుగోలు కోసం మొత్తం 180 కోట్ల డాలర్లు వెచ్చించనున్నామని, అంతా నగదులోనే చెల్లింపులు జరుపుతామని పేర్కొంది.
భారతీ ఎయిర్‌టెల్‌లో భారతీ టెలికం కంపెనీకి 45.09 శాతం వాటా ఉంది. భారతీ టెలికం కంపెనీలో మిట్టల్ కుటుంబానికి 51 శాతం, సింగ్‌టెల్‌కు 39 శాతం, తమసెక్‌కు 7.39 శాతం చొప్పున వాటాలున్నాయి. ఇప్పుడు ఈ 7.39 శాతం తమసెక్ వాటా సింగ్‌టెల్ పరం కానుంది. ఈ వాటా కొనుగోలుకు వాటాదారులతో సహా, పలు ప్రభుత్వ సంస్థల ఆమోదం పొందాల్సి ఉందని, ఈ ఏడాది డిసెంబర్ కల్లా ఈ డీల్ పూర్తవగలదని సింగ్‌టెల్ పేర్కొంది.