Singtel
-
ఎయిర్టెల్ షేర్ల విక్రయం
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్లో మొత్తం 1.76 శాతం వాటాను సింగపూర్ టెలీకమ్యూనికేషన్స్(సింగ్టెల్) విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా షేరుకి రూ. 686 ధరలో పాస్టెల్ లిమిటెడ్(సింగ్టెల్ సంస్థ) 1.63 శాతం వాటాను విక్రయించింది. ఎన్ఎస్ఈ బల్క్ డీల్ గణాంకాల ప్రకారం దాదాపు రూ. 6,602 కోట్ల విలువైన ఈ వాటా(9.62 కోట్లకుపైగా షేర్లు)ను ఎయిర్టెల్ ప్రమోటర్ భారతీ టెలికం కొనుగోలు చేసింది. ఈ బాటలో సింగ్టెల్ మరో సంస్థ విరిడియన్ సైతం 0.13 శాతం వాటా(కోటి షేర్లు)ను ఇదే ధరలో విక్రయించినట్లు తెలుస్తోంది. సాధారణ వాటాదారులు 70 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ లావాదేవీ తదుపరి భారతీ ఎయిర్టెల్లో పబ్లిక్ వాటా 44.74 శాతం నుంచి 44.87 శాతానికి పెరిగినట్లు తెలియజేశాయి. జూన్ చివరికల్లా ఎయిర్టెల్లో భారతీ టెలికం 35.85 శాతం వాటా కలిగి ఉంది. కాగా.. భారతీ టెలికంలో సింగ్టెల్కు 50.56 శాతం, సునీల్ మిట్టల్ కుటుంబానికి 49.44 శాతం చొప్పున వాటా ఉంది. ఈ వార్తల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు ఎన్ఎస్ఈలో 1.4 శాతం బలపడి రూ. 379 వద్ద ముగిసింది. -
భారతీ టెలికంకు సింగ్టెల్ వాటా
న్యూఢిల్లీ: ప్రమోటర్ భారతీ టెలికం.. కంపెనీలో సింగ్టెల్కు గల 3.33 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తాజాగా పేర్కొంది. మాతృ సంస్థ భారతీ టెలికం ఈ వాటాను 90 రోజుల్లోగా సొంతం చేసుకోనున్నట్లు తాజాగా తెలియజేసింది. ఇందుకు 2.25 బిలియన్ సింగపూర్ డాలర్ల(రూ. 12,895 కోట్లు) వెచ్చించనున్నట్లు వెల్లడించింది. కాగా.. భారతీ టెలికంలో భారతీ గ్రూప్ చైర్మన్ సునీల్ మిట్టల్ కుటుంబంతోపాటు, సింగ్టెల్ సైతం ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లావాదేవీ తదుపరి భారతీ ఎయిర్టెల్లో సింగ్టెల్ గ్రూప్ వాటా 29.7 శాతానికి చేరనుంది. రెండు సంస్థల మధ్య ఈ లావాదేవీ పూర్తయ్యాక ఎయిర్టెల్లో భారతీ టెలికం ప్రధాన వాటాదారుగా కొనసాగనున్నట్లు సునీల్ మిట్టల్ పేర్కొన్నారు. -
భారతీ టెలికంలో 7.39% వాటా సింగ్ టెల్ చేతికి
డీల్ విలువ రూ.4,400 కోట్లు న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ హోల్డింగ్ కంపెనీ అయిన భారతీ టెలికంలో 7.39 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు సింగపూర్ టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్(సింగ్టెల్) తెలిపింది. ఈ వాటాను 65.95 కోట్ల డాలర్లకు (రూ.4,400 కోట్లు) కొనుగోలు చేస్తామని పేర్కొంది. అలాగే థాయ్లాండ్ టెలికం కంపెనీ ఇన్టచ్ హోల్డింగ్స్ పీసీఎల్లో 21 శాతం వాటాను కొనుగోలు చేయనున్నామని వెల్లడించింది. ఈ రెండు వాటాల కొనుగోలు కోసం మొత్తం 180 కోట్ల డాలర్లు వెచ్చించనున్నామని, అంతా నగదులోనే చెల్లింపులు జరుపుతామని పేర్కొంది. భారతీ ఎయిర్టెల్లో భారతీ టెలికం కంపెనీకి 45.09 శాతం వాటా ఉంది. భారతీ టెలికం కంపెనీలో మిట్టల్ కుటుంబానికి 51 శాతం, సింగ్టెల్కు 39 శాతం, తమసెక్కు 7.39 శాతం చొప్పున వాటాలున్నాయి. ఇప్పుడు ఈ 7.39 శాతం తమసెక్ వాటా సింగ్టెల్ పరం కానుంది. ఈ వాటా కొనుగోలుకు వాటాదారులతో సహా, పలు ప్రభుత్వ సంస్థల ఆమోదం పొందాల్సి ఉందని, ఈ ఏడాది డిసెంబర్ కల్లా ఈ డీల్ పూర్తవగలదని సింగ్టెల్ పేర్కొంది. -
భారతి టెలికాంలో సింగపూర్ టెలీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: సింగపూర్ టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్ సింగ్టెల్ రెండు దేశాల టెలికాం దిగ్గజాలపై కన్నేసింది. ఈ నేపథ్యంలోనే సింగ్ టెల్ థాయ్ టెలికాం సంస్థ ఇన్ టచ్ హోల్డింగ్స్ , ఇండియాకు చెందిన భారతి టెలికం లిమిటెడ్ కంపెనీల్లో సుమారు రెండు బిలియన్ల డాలర్లతో వాటాలను కొనుగోలు చేయనుంది. భారత్, థాయ్ లాండ్ టెలికాం మార్కెట్ పై భారీగానే ఆశలు పెట్టుకున్న సంస్థ ఈ మేరకు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమౌతోంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పాగా వేయాలనే దాని వ్యూహంలో భాగంగా మొత్తం 1.8 మిలియన్ డాలర్స్ తో డీల్ కుదుర్చుకుంది. ఇన్ టచ్ లో 21 శాతం, భారతి ఎయిర్టెల్ సొంతమైన భారతి టెలీలో 7.39 శాతం వాటాలను కొనుగోలు చేయనున్నట్టు సింగపూర్ స్టాక్ మార్కెట్ ఫైలింగ్ లో సింగ్ టెల్ పేర్కొంది. సింగె టెల్ కొనుగోలు చేస్తున్న భారతి టెలీవాటాల విలువ రూ. 4,400 కోట్లకు పైమాటే. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ ప్రక్రియ పూర్తికానుందని తెలిపింది. అంతర్గత నగదు, స్వల్పకాలిక రుణాల ద్వారా ఈ వాటాలను హస్తగతం చేసుకోనున్నట్లు సింగ్ టెల్ తెలిపింది. ఈ రెండు లావాదేవీల ద్వారా రెండు కంపెనీల్లోతమ పెట్టుబడుల వృద్ధికి, తద్వారా ఆర్థిక వృద్ధికి భారీ అవకాశాలున్న రెండుదేశాల్లోతమ కార్యకలాపాల వృద్ధి సాధ్యపడుతుందని భావిస్తున్నామని సింగ్టెల్ గ్రూప్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చువా సాక్ చెప్పారు. ఈ రెండుదేశాల్లోని యువత జనాభా వివరాలను ఉదాహరించిన ఆమె తమ టెలికాం వ్యాపారానికి సానుకూలమైన అంశమని పేర్కొన్నారు. ఇది వెల్ ప్యాకేజ్డ్ డీల్ అని నోమురా బ్యాంక్ వ్యాఖ్యానించింది. సింగ్టెల్ ఆదాయాలకు బూస్ట్ ఇస్తుందని, కానీ థాయ్ మరియు భారత మార్కెట్లలో ఎల్లప్పుడూ నిశ్చితంగా ఉండవనేది గమనించాలని తెలిపింది. మరోవైపు సింగ్ టెల్ భారతి టెలీలో 7.39 శాతం వాటాను కొనుగోలు చేసిందన్న వార్తలతో మార్కెట్లో షేరుకు డిమాండ్ పెరిగింది. 2 శాతానికి పైగా లాభపడింది. అయితే ఈ వ్యవహారంపై తమకు ఎలాంటి సమాచారం లేదని థాయిలాండ్ స్టాక్ ఎక్సేంజీ తెలపగా , దీనిపై వ్యాఖ్యానించడానికి భారతి ఎయిర్ టెల్ నిరాకరించడం విశేషం.