‘ఎయిర్‌టెల్’ ఆండ్రాయిడ్ సెట్ టాప్ బాక్స్
ధర రూ. 4,999
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ గ్రూప్‌లో భాగమైన ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ తాజాగా ఆండ్రాయిడ్ ఆధారిత సెట్ టాప్ బాక్స్‌ను (ఎస్‌టీబీ) ప్రవేశపెట్టింది. దీంతో సాధారణ శాటిలైట్ టీవీ చానల్స్‌తో పాటు టీవీలోనే ఆన్‌లైన్ కంటెంట్ కూడా వీక్షించేందుకు వీలుంటుంది. కొత్త కస్టమర్స్ దీనికోసం రూ.4,999 చెల్లించాల్సి ఉంటుందని భారతీ ఎయిర్‌టెల్ సీఈవో (డీటీహెచ్) సునీల్ తల్దార్ తెలిపారు. ఎయిర్‌టెల్ డీటీహెచ్‌పై ఏడాదిపాటు 500 చానల్స్ సబ్‌స్క్రిప్షన్‌తో కొత్త కస్టమర్లు ఈ ఎస్‌టీబీని రూ.7,999కి కొనుగోలు చేయొచ్చని ఆయన వివరించారు.
టీవీలో ఇంటర్నెట్ సదుపాయం కోసం వినియోగదారులు సాధారణ టీవీ రేటుకి మించి రూ.10,000–15,000 అధికంగా చెల్లించాల్సి వస్తోందని.. అయితే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మాధ్యమాల మధ్య సరిహద్దు చెరిగిపోతున్న నేపథ్యంలో ఒకే డివైజ్‌పై రెండింటి ప్రయోజనాలు అందించాలన్న లక్ష్యంతో దీన్ని రూపొందించినట్లు చెప్పారు. ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ టీవీ ఎస్‌టీబీలో మూవీ అప్లికేషన్ నెట్‌ఫ్లిక్స్ ప్రీలోడెడ్ ఉంటుంది.
యూట్యూబ్ వీడియోలను ఇందులో చూసుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఇతరత్రా యాప్స్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఎస్‌టీబీని కొనుగోలు చేసే తమ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు మరింత అధికంగా డేటా కూడా ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తోంది. ఇంటర్నెట్ టీవీ ఎస్‌టీబీకి కనీసం 4 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ ఉండే బ్రాడ్‌బ్యాండ్ లేదా 4జీ హాట్‌స్పాట్ అవసరమవుతుంది.