న్యూఢిల్లీ: మొబైల్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో భారీగా తగ్గింది. టారిఫ్‌ల యుద్ధం తీవ్రంగా ఉండటం, అంతర్జాతీయ టెర్మినేషన్ చార్జీల్లో కోత కారణంగా గత క్యూ4లో నికర లాభం 78 శాతం తగ్గినట్లు భారతీ ఎయిర్‌టెల్ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.373 కోట్లుగా (ఒక్కో షేర్‌కు 93 పైసలు) ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.83 కోట్లకు (ఒక్కో షేర్‌కు 21 పైసలు) తగ్గిందని భారతీ ఎయిర్‌టెల్ ఎండీ, సీఈఓ (ఇండియా, సౌత్ ఏషియా) గోపాల్ విట్టల్ తెలిపారు.
మొత్తం ఆదాయం రూ.21,935 కోట్ల నుంచి 11 శాతం తగ్గి రూ.19,634 కోట్లకు చేరింది. భారత ఆదాయం 8 శాతం తగ్గి రూ.14,796 కోట్లకు చేరిందని, ఆఫ్రికా ఆదాయం మాత్రం 11 శాతం ఎగసిందని గోపాల్ తెలియజేశారు. మొబైల్ డేటా ట్రాఫిక్ 505 శాతం వృద్ధితో 1,616 బిలియన్ మెగాబైట్లకు పెరిగింది. నికర రుణ భారం రూ.91,714 కోట్ల నుంచి రూ.95,228 కోట్లకు పెరిగింది.
రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ (ఆర్‌ఓసీఈ) 6.5 శాతం నుంచి 4.7 శాతానికి తగ్గిందని, ఇబిటా తక్కువగా ఉండటం, స్పెక్ట్రమ్ వ్యయాలు పెరగడం, భారత్‌లో పెట్టుబడులు కొనసాగడం, తదితర అంశాలు దీనికి కారణాలని గోపాల్ విట్టల్ వివరించారు. గత ఆర్థిక సంవత్సరానికి తుది డివిడెండ్‌గా రూ.2.5ను ఇవ్వనున్నామని, గతంలో ప్రకటించిన మధ్యంతర డివిడెండ్ రూ.2.84 కలుపుకుంటే, మొత్తం డివిడెండ్ గత ఆర్థిక సంవత్సరానికి రూ.5.34గా ఉంటుందని తెలియజేశారు.
రూ. 24,000 కోట్ల పెట్టుబడులు...
ఇంత తక్కువ నికర లాభం సాధించడం 14 ఏళ్లలో కంపెనీకి ఇదే తొలిసారి. 2004, ఏప్రిల్–జూన్ క్వార్టర్ తర్వాత అతి తక్కువ లాభం వచ్చిన క్వార్టర్ ఇదే. నికర లాభం తగ్గడం ఇది వరుసగా ఎనిమిదో క్వార్టర్. కొత్తగా కార్యకలాపాలు ప్రారంభించిన రిలయన్స్ జియో ఉచితవాయిస్ కాల్స్‌ను, కారు చౌకగా డేటా ఆఫర్లను ఇస్తుండటంతో ఈ కంపెనీ లాభాలు హరించుకుపోయాయి. కృత్రిమంగా తగ్గిస్తున్న ధరలతో టెలికం పరిశ్రమపై వ్యయాల భారం కొనసాగుతోందని గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంటర్నేషనల్ టెర్మినేషన్ చార్జీల తగ్గింపు వల్ల పరిశ్రమ ఆదాయం భారీగా తగ్గిందన్నారు. నేరుగా రిలయన్స్ జియోను ప్రస్తావించకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.3,800 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 71% తగ్గి రూ.1,099 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 12% తగ్గి రూ.83,688 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.24,000 కోట్ల పెట్టుబడులు పెట్టామని, ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే స్థాయిలో పెట్టుబడులు పెడతామని పేర్కొన్నారు.
కొనసాగిన అగ్రస్థానం...
టెలికం పరిశ్రమలో గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌లో అగ్రస్థానాన్ని కొనసాగించామని గోపాల్ పేర్కొన్నారు. గత క్యూ4లో కోటిన్నర మంది కొత్తగా ఎయిర్‌టెల్ వినియోగదారులయ్యారని, డేటా సామర్థ్యం పెంపునకు సంబంధించి వ్యూహాత్మక పెట్టుబడులు, ఎయిర్‌టెల్ టీవీ ద్వారా వినూత్నమైన డిజిటల్ కంటెంట్‌ను అందివ్వడం, వినియోగదారుల అభిరుచులకనుగుణంగా ఆఫర్లనందించడం, తదితర కారణాల వల్ల ఈ స్థాయిలో కొత్త వినియోగదారులు లభించారని వివరించారు. ప్రస్తుతం తమకు 16 దేశాల్లో 41.38 కోట్ల మంది వినియోగదారులున్నారని, వినియోగదారుల సంఖ్య 12 శాతం వృద్ధి చెందిందని వివరించారు.
మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వచ్చాయి. ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో బీఎస్‌ఈలో భారతీ ఎయిర్‌టెల్ షేర్ 0.6 శాతం లాభంతో రూ.406 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment