ఎయిర్‌టెల్‌ లాభం 72% డౌన్‌ | Reliance Jio effect: Bharti Airtel Q4 net profit plunges 72% to Rs 373 cr | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌ లాభం 72% డౌన్‌

Published Wed, May 10 2017 1:14 AM | Last Updated on Tue, Sep 5 2017 10:46 AM

ఎయిర్‌టెల్‌ లాభం 72% డౌన్‌

ఎయిర్‌టెల్‌ లాభం 72% డౌన్‌

తీవ్ర స్థాయిలో     రిలయన్స్‌ జియో ప్రభావం
వరుసగా రెండో క్వార్టర్‌లోనూ క్షీణించిన నికర లాభం
12 శాతం తగ్గిన మొత్తం ఆదాయం; రూ.21,935 కోట్లు
ఒక్కో షేర్‌కు రూ.1 డివిడెండ్‌


న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌ ఆర్థిక ఫలితాలపై రిలయన్స్‌ జియో ప్రభావం తీవ్రంగానే ఉంది. గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి  క్వార్టర్‌లో ఎయిర్‌టెల్‌ నికర లాభం ఏకంగా 72 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2015–16) క్యూ4లో రూ.1,319 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.373 కోట్లకు తగ్గిందని ఎయిర్‌టెల్‌ తెలిపింది.

 రిలయన్స్‌ జియో పోటీ తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపించిందని కంపెనీ ఎండీ, సీఈఓ(భారత్, దక్షిణాసియా) గోపాల్‌ విఠల్‌ చెప్పారు.  మొత్తం ఆదాయం రూ.24,960 కోట్ల నుంచి 12 శాతం తగ్గి రూ.21,935 కోట్లకు చేరిందని వివరించారు. గత ఆర్థిక సంవత్సరానికి గాను ఇక ఒక్కో షేర్‌కు రూ.1 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు.

జియో ఇన్‌కమింగ్‌ కాల్స్‌ సునామీ...
కొత్తగా వచ్చిన రిలయన్స్‌ జియో ఆకర్షణీయమైన ఆఫర్ల కారణంగా నికర లాభం వరుసగా రెండో క్వార్టర్‌లోనూ క్షీణించిందని విఠల్‌ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్‌లో కంపెనీ నికర లాభం 55 శాతం తగ్గిందన్నారు. మూలధన పెట్టుబడులను రూ.6,057 కోట్ల నుంచి రూ.3,808 కోట్లకు తగ్గించుకున్నప్పటికీ, నికర లాభంలో క్షీణత  తప్పలేదని చెప్పారు. రిలయన్స్‌ జియో ఉచిత ఆఫర్ల కారణంగా ఇన్‌కమింగ్‌ కాల్స్‌ సునామీలా వెల్లువెత్తాయని చెప్పారు.

 తమ నెట్‌వర్క్‌లో ఈ ఇన్‌కమింగ్‌ ట్రాఫిక్‌ను తట్టుకోవడానికి చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్టుబడులు పెట్టాల్సి వచ్చిందన్నారు. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో ఆదాయం 7 శాతం తగ్గిందని, ఇబిటా మార్జిన్లు 2.9 శాతం మేర తగ్గిపోయాయని పేర్కొన్నారు. గత కొన్ని ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయ వృద్ధి రెండంకెల్లో ఉండేదని, గత ఆర్థిక సంవత్సరంలో కేవలం 3.6 శాతం వృద్ధినే సాధించామని పేర్కొన్నారు.

 ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2015–16లో రూ.6,077 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 38 శాతం తగ్గి రూ.3,800  కోట్లకు చేరింది. ఆదాయం 1 శాతం వృద్ధితో రూ.95,468 కోట్లకు పెరిగింది. కాగా మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో బీఎస్‌ఈలో భారతీ ఎయిర్‌టెల్‌ షేర్‌ 1.7 శాతం క్షీణించి రూ.345 వద్ద ముగిసింది.  

జియోతో టెలికం వ్యవస్థ చిన్నాభిన్నం!
ముకేష్‌ అంబానీ ప్రమోట్‌ చేస్తున్న రిలయన్స్‌ జియో గత ఏడాది సెప్టెంబర్‌లో ఉచిత వాయిస్, డేటా ప్లాన్‌లను ఆఫర్‌ చేసింది. మార్చిలో వాణిజ్యపరంగా కార్యకలాపాలు ప్రారంభించిన జియో మరింత దూకుడుగా తన ఆఫర్లను అందిస్తోంది. రిలయన్స్‌ జియో దూకుడు కారణంగా టెలికం కంపెనీలే కాకుండా మొత్తం టెలికం పరిశ్రమ ఆర్థిక పరిస్థితులను అస్తవ్యస్తం చేసిందని నిపుణులంటున్నారు. టెలికం పరిశ్రమ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో మొదటిసారిగా క్షీణించింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు టెలికం పరిశ్రమ బకాయిలు రూ.4.60 లక్షల కోట్లుగా ఉంటాయని అంచనా.

ఫలితాలు కొన్ని ముఖ్యాంశాలు...
ఈ ఏడాది మార్చి 31 నాటికి భారత్, దక్షిణాసియా, ఆఫ్రికాలో మొత్తం ఎయిర్‌టెల్‌ వినియోగదారుల సంఖ్య 35.6 కోట్లుగా ఉంది.

మొత్తం ఆదాయంలో 77 శాతం ఉండే భారత్‌ మార్కెట్‌లో ఈ కంపెనీకి 27.4 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.

నిర్వహణ లాభాన్ని సూచించే ఇబిటా 13 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.9,188 కోట్లుగా ఉన్న ఇబిటా గత ఆర్థిక సంవత్సరం(2016–17) క్యూ4లో రూ.7,993 కోట్లకు తగ్గింది.

డేటా ఏఆర్‌పీయూ(యావరేజ్‌ రెవెన్యూ పర్‌ యూజర్‌) 17 శాతం క్షీణించి రూ.162కు, వాయిస్‌ ఏఆర్‌పీయూ కూడా 17 శాతం తగ్గి రూ.114కు చేరాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement