
అత్యంత వేగవంతమైన 5జీ సర్వీసులను ప్రవేశపెట్టేందుకు దేశవిదేశాల్లోని టెక్నాలజీ సంస్థలు, టెల్కోలు వేంగా ముందుకెళుతున్నాయి. తాజాగా దేశీ టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌తో స్వీడన్ టెలికం పరికరాల దిగ్గజం ఎరిక్సన్ 5జీ టెక్నాలజీపై ఒప్పందం చేసుకుంది. మరో టెలికం పరికరాల సంస్థ నోకియా ఇదివరకే దేశీయంగా 5జీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌తోను, భారతి ఎయిర్‌టెల్‌తోను జట్టుకట్టింది.
ఇప్పటికే బెంగళూరులో 5జీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ల్యాబ్ ఏర్పాటు చేసిన నోకియా.. కొత్త తరం సాంకేతికతను మరింతగా వినియోగంలోకి తెచ్చే అంశాలపై దృష్టి పెడుతోంది. 5జీకి సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాలను 2019లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ లోగానే వెరిజోన్, కొరియా టెలికం, చైనా టెలికం, ఎన్‌టీటీ డొకొమో, వొడాఫోన్, ఎరిక్సన్, శాంసంగ్, స్ప్రింట్ మొదలైన దిగ్గజ టెల్కోలు ఈ నెట్‌వర్క్‌కు మళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. దక్షిణ కొరియాలోని ప్యోంగ్‌చాంగ్‌లో వచ్చే ఏడాది జరగబోయే వింటర్ ఒలింపిక్స్‌లో 5జీ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు అక్కడి మొబైల్ ఆపరేటర్ కేటీ సన్నాహాలు చేస్తోంది.
చైనాలోని టెల్కోలు 2020 నాటికల్లా 5జీ సాంకేతికతకు సంబంధించి వాణిజ్య సేవలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. 2025 నాటికల్లా ప్రపంచంలోనే అతి పెద్ద 5జీ మార్కెట్‌గా నిలిపేందుకు కసరత్తు చేస్తున్నాయి. అటు దక్షిణ కొరియా, చైనా, జపాన్, బ్రిటన్, అమెరికా కూడా 2020 కల్లా 5జీని ప్రవేశపెట్టే అవకాశముంది. పొరుగున ఉన్న పాకిస్తాన్ కూడా త్వరలోనే 5జీ నెట్‌వర్క్‌ను ప్రవేశపెట్టబోతున్నామంటూ కొనాళ్ల క్రితమే ప్రకటించింది.
రూ. 500 కోట్ల కేంద్ర నిధి...
కేంద్ర ప్రభుత్వం 5జీ అభివృద్ధి కోసం రూ.500 కోట్ల నిధిని ఏర్పాటు చేయనుంది. 2020కల్లా 5జీ నెట్‌వర్క్‌ను ప్రవేశపెట్టే దిశగా తగిన మార్గదర్శక ప్రణాళికను రూపకల్పన చేసేందుకు టెలికం విభాగం కార్యదర్శి సారథ్యంలో అత్యున్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. నియంత్రణ సంస్థ ట్రాయ్ కూడా 5జీ స్పెక్ట్రం వేలం ప్రక్రియపై దృష్టి పెడుతోంది.
పదేళ్లకోసారి కొత్త మార్పులు..
దాదాపు ప్రతి పదేళ్లకు టెలికం రంగంలో కొత్త మార్పులు వస్తూనే ఉన్నాయి. 1981లో తొలిసారిగా 1జీ సాంకేతికత తెరపైకి రాగా .. 1990లలో టెక్స్‌ట్ మెసేజీలకు కూడా ఉపయోగపడే 2జీ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. ఇక యూజర్లు తమ ఫోన్లలోనే ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసుకునే వీలు కల్పించే సదుపాయాన్ని 3జీ టెక్నాలజీ తొలిసారి 2001లో అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యకలాపాల్ని మరింత మెరుగుపర్చి.. వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్స్‌ను ప్రస్తుత 4జీ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చింది. తాజాగా రాబోయే 5జీ టెక్నాలజీ ఈ వేగాన్ని మరింతగా పెంచనుంది.
సవాళ్లు కూడా ఉన్నాయ్...
4జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ స్మార్ట్‌ఫోన్‌లో మధ్య మధ్యలో అవాంతరాలు లేకుండా కాల్ గానీ ఇంటర్నెట్ బ్రౌజింగ్ గానీ సాధ్యపడటం లేదు. ఇక వాహనాల్లో తిరుగుతున్నప్పుడు.. గ్రామీణ ప్రాంతాల్లోను ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటోంది. 4జీ ప్రవేశపెట్టినప్పటికీ.. అందుకు సరిపడేంతగా బేస్ స్టేషన్‌లు, టవర్లు లాంటి మౌలిక సదుపాయాలు లేకపోవడమే ఇందుకు కారణం. ఇలాంటి పరిస్థితుల్లో 5జీ టెక్నాలజీ కోసం మరింత కసరత్తు చేయాల్సి ఉంటుంది.
మెరుపు వేగం....
ప్రస్తుత విధానంలో సెకనుకు ఒక గిగాబిట్ (జీబీ) డేటా ట్రాన్స్‌ఫర్‌కి వీలుండగా.. 5జీలో ఇది ఏకంగా పది గిగాబిట్స్ స్థాయిలో ఉంటుంది. హై డెఫినిషన్ సినిమాలను కూడా సెకన్ల వ్యవధిలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 5జీలో రెండు గంటల నిడివి ఉండే సినిమాను 3 సెకన్ల వ్యవధిలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. భారీ స్థాయిలో కనెక్షన్‌లను కూడా ఈ నెట్‌వర్క్ సపోర్ట్ చేయగలదు.
4జీ ప్రస్తుతం ప్రధానంగా యూజర్ల మధ్య కమ్యూనికేషన్‌కి ఎక్కువగా ఉపయోగపడుతుండగా.. 5జీ దీనికి తోడుగా ఐవోటీ అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది. అంటే కార్ల నుంచి ఫ్రిజ్‌లు, టీవీలు మొదలైన వాటి దాకా చాలా మటుకు ఉత్పత్తులను ఇంటర్నెట్ ద్వారా ఆపరేట్ చేసుకునే వీలుంటుంది. అలాగే, స్మార్ట్ లైటింగ్, స్మార్ట్ పార్కింగ్ వంటి వాటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో టెలి–హెల్త్, టెలి–ఎడ్యుకేషన్ సేవలు అందించడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది. రీసెర్చ్ సంస్థ గార్ట్‌నర్ అంచనాలమేరకు 2020కి 20.8 బిలియన్ కనెక్టెడ్ డివైజ్‌లుంటాయి. ప్రస్తుత నెట్‌వర్క్‌లు ఇంత భారీ స్థాయి కనెక్టివిటీని సపోర్ట్ చేయలేవు.
వివిధ రంగాలకు ఊతం..
5జీ టెక్నాలజీతో పలు రంగాలకు ఊతం లభించనుంది. ఐటీ, ఆటోమోటివ్, వినోదం, వ్యవసాయం, తయారీ వంటి అనేక రంగాల వృద్ధికి తోడ్పడగలదనే అంచనాలున్నాయి. 5జీ వినియోగంలోకి వచ్చే కొద్దీ భద్రతాపరమైన, వ్యాపారాలపరమైన కీలక అప్లికేషన్స్ అన్నీ కూడా వైర్‌లైస్ నెట్‌వర్క్‌లపైనే నడుస్తాయని నోకియా చెబుతోంది.
5జీ సాంకేతికతతో 2035 నాటికి ప్రపంచ దేశాల ఆదాయాలు 3.5 లక్షల కోట్ల డాలర్ల మేర పెరుగుతుందని, 2.2 కోట్ల పైగా ఉద్యోగాల కల్పనకు ఇది ఉపయోగపడుతుందని క్వాల్‌కామ్ సీఈవో స్టీవ్ మాలెన్‌కాఫ్ పేర్కొన్నారు. ఎరిక్సన్ అంచనాల ప్రకారం 2026 నాటికి దేశీ టెలికం ఆపరేటర్లకు 5జీ టెక్నాలజీతో 27.3 బిలియన్ డాలర్ల మేర ఆదాయ అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సంప్రదాయ సర్వీసులతో వస్తున్న ఆదాయానికి ఇది అదనం.
– (సాక్షి, బిజినెస్ విభాగం)
Comments
Please login to add a commentAdd a comment