న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్ (క్యూ1)లో నికర లాభం దాదాపు ఆరు రెట్లు ఎగసి రూ. 1,607 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 283 కోట్లు ఆర్జించింది. టారిఫ్‌ల పెంపు ప్రధానంగా ప్రభావం చూపింది.
మొత్తం ఆదాయం సైతం 22 శాతం వృద్ధితో రూ. 32,085 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో రూ. 26,854 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. దేశీ ఆదాయం 24 శాతం బలపడి రూ. 23,319 కోట్లకు చేరగా.. మొబైల్ సర్వీసుల నుంచి 27 శాతం అధికంగా రూ. 18,220 కోట్లు లభించింది. హోమ్ సర్వీసుల(ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్) ఆదాయం 42 శాతం పురోగమించి రూ. 927 కోట్లకు చేరగా.. బిజినెస్ విభాగం నుంచి రూ. 4,366 కోట్లు సమకూరింది. ఇది 15% అధికం. ఆఫ్రికా ఆదాయం 15% ఎగసి 127 కోట్ల డాలర్ల(రూ. 10,098 కోట్లు)కు చేరింది.
4జీ స్పీడ్: ప్రస్తుత సమీక్షా కాలంలో ఎయిర్‌టెల్ మొత్తం కస్టమర్ల సంఖ్య 4.7 శాతం పుంజుకుని 49.69 కోట్లను తాకింది. దేశీయంగా ఈ సంఖ్య 36.24 కోట్లు. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) పరిశ్రమలోనే మెరుగ్గా రూ. 183కు చేరింది. గత క్యూ1లో నమోదైన రూ. 146తో పోలిస్తే ఇది 25 శాతంపైగా వృద్ధి.
ఫలితాల నేపథ్యంలో ఎయిర్‌టెల్ షేరు నామమాత్ర లాభంతో రూ. 705 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment