ఎయిర్ టెల్ చెప్పేదంతా అబద్ధం: జియో
ఎయిర్ టెల్ చెప్పేదంతా అబద్ధం: జియో
Published Tue, Mar 21 2017 11:05 AM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM
టెలికాం కంపెనీల మధ్య వార్ ఇప్పట్లో సమసిపోయేటట్లు కనిపించడం లేదు. టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ పై రిలయన్స్ జియో మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. దేశంలోనే తమదే ఫాస్టెస్ట్ నెట్ వర్క్ అని చెప్పుకుంటూ ఎయిర్ టెల్ తప్పుదోవపట్టిస్తుందని ఆరోపించింది. బ్రాండ్ బ్యాండ్ స్పీడ్ టెస్టర్ ఊక్లాతో కుట్రలు పన్నుతూ ఎయిర్ టెల్ తప్పుడు ప్రకటనలు చేస్తుందని తెలిపింది. ఈ విషయంపై అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఏఎస్సీఐ) వద్ద రిలయన్స్ జియో ఫిర్యాదుచేసింది. ఫాస్టెస్ట్ నెట్ వర్క్ తమదేనంటూ ఎయిర్ టెల్ చెప్పేదంతా అబద్ధమని, తప్పుడుదోవ పట్టిస్తుందని జియో ఆ ఫిర్యాదులో పేర్కొంది.
అయితే ఇండియాలో ఫాస్టెస్ట్ మొబైల్ నెట్ వర్క్ గా తమకు ఊక్లా రేటింగ్ ఇచ్చిందని ఎయిర్ టెల్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. తమ ప్రకటనలో కూడా అన్ని క్లియర్ గా పేర్కొన్నామని చెప్పారు. ఊక్లా తన పాపులర్ స్పీడ్ టెస్ట్ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా మొబైల్ కస్టమర్లు వాడే మోడరన్ డివైజస్ లోకి లాగిన్ అయి, లక్షల కొలదీ ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ లను నిర్వహిస్తుందని ఎయిర్ టెల్ అధికార ప్రతినిధి తెలిపారు. అన్ని మొబైల్ టెస్ట్ లు దీనిలో కలిసి ఉంటాయన్నారు. అయితే ఊక్లా డబ్బుల తీసుకుని ఇలాంటి అవార్డులు ఇస్తుందని ముఖేష్ అంబానీ సంస్థ జియో ఆరోపిస్తోంది. ఊక్లాకు లీగల్ నోటీసు పంపుతామని తెలిపింది. ఊక్లా బ్రాండ్ బ్యాండ్ టెస్టింగ్, వెబ్ ఆధారిత నెట్ వర్క్ డయాగ్నోస్టిక్ అప్లికేషన్స్ లో గ్లోబల్ లీడర్.
Advertisement