న్యూఢిల్లీ: నంబర్ 1 మొబైల్ సర్వీస్ ప్రొవైడర్‌గా ఉండాలని లక్ష్యం నిర్దేశించుకోలేదని భారతీ ఎయిర్‌టెల్ తెలిపింది. మార్కెట్‌లో చివరికి మూడు పెద్ద ప్రైవేట్ కంపెనీలే నిలుస్తాయని పేర్కొంది. టాప్ టెలికం సంస్థగా ఉన్న ఎయిర్‌టెల్.. వొడాఫోన్–ఐడియా విలీనం తర్వాత రెండో స్థానానికి పరిమితం కావాల్సి వస్తుంది. అప్పుడు వొడాఫోన్–ఐడియా విలీన కంపెనీ అగ్రస్థానంలో ఉంటుంది. దీనికంతటికీ రిలయన్స్ జియోను కారణంగా చెప్పుకోవచ్చు.
భారతీ ఎయిర్‌టెల్ ఎండీ, సీఈవో (ఇండియా, దక్షిణాసియా) గోపాల్ విట్టల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టెలికంలో తీవ్రమైన పోటీ వల్ల ఒక యూజర్ నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్‌పీయూ) తగ్గిపోయిందని తెలిపారు. అయితే పరిస్థితులు త్వరలో కొలిక్కి వస్తాయన్నారు. ‘‘ఒక చక్రాన్ని తీసుకుంటే అందులో మేం కింది భాగంలో ఉన్నాం. ఇక ఇంతకన్నా దిగువకు వెళ్లలేం. ఇక్కడి నుంచి ధరలు, ఏఆర్‌పీయూ పైకి కదలడం మొదలవుతుంది’’ అని పేర్కొన్నారు.
‘‘అగ్రస్థానంలో ఉండటం మా లక్ష్యం కాదు. కస్టమర్లకు ఉత్తమ సేవలు అందించడం గురించే ఆలోచిస్తాం. చివరకు మూడు పెద్ద కంపెనీలు మాత్రమే ఉంటాయి. ఇందులో ఒకరు కొద్దిగా ఎక్కువగా మార్కెట్ వాటాను కలిగి ఉండొచ్చు. మరొకరు కొంచెం తక్కువ వాటా కలిగి ఉంటారు. అలాగే మార్కెట్ వాటా ఎప్పటికీ స్థిరంగా ఉంటుందని చెప్పలేం’’ అని వివరించారు. భారత్‌లో ఒకానొక సమయంలో 12 ప్రైవేట్ టెలికం కంపెనీలు ఉండేవి. ప్రస్తుతం వీటి సంఖ్య మూడుకు తగ్గింది. ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్ సహా ప్రైవేట్ రంగానికి చెందిన ఎయిర్‌టెల్, వోడాఫోన్–ఐడియా, రిలయన్స్ జియో కంపెనీలు మాత్రమే ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment