న్యూఢిల్లీ: ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై రిలయన్స్ జియో చార్జీలు అమలు చేస్తున్న నేపథ్యంలో మిగతా టెలికం సంస్థలు కూడా చార్జీల పెంపు రాగాన్ని అందుకుంటున్నాయి. ప్రస్తుతం వసూలు చేస్తున్న రేట్లతో నిలదొక్కుకోవడం కష్టమేనంటూ తాజాగా భారతీ ఎయిర్‌టెల్ వ్యాఖ్యానించింది. టారిఫ్‌లు పెరగాల్సిన అవసరం ఉందని ఎయిర్‌టెల్ ఎండీ, సీఈవో (భారత్, దక్షిణాసియా విభాగం) గోపాల్ విఠల్ పేర్కొన్నారు. ‘ఈ టారిఫ్‌లతో నిలదొక్కుకోవడం కష్టమని మా నమ్మకం. టారిఫ్‌లు పెరగాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం.
మేం ఎప్పుడూ ఇదే మాట మీద ఉన్నాం‘ అని ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో (ఐఎంసీ) పాల్గొన్న సందర్భంగా చెప్పారు. మరోవైపు, ఇంటర్‌కనెక్షన్ యూసేజ్ చార్జీలంటూ (ఐయూసీ) యూజర్లపై జియో నిమిషానికి 6 పైసల చార్జీలు వసూలు చేస్తుండటాన్ని ఆయన ఖండించారు. ‘టారిఫ్‌కి ఐయూసీకి సంబంధం లేదు. టెలికం కంపెనీల స్థాయిలో జరిగే లావాదేవీ అది‘ అని విఠల్ పేర్కొన్నారు. మరోవైపు, తదుపరి 5జీ స్పెక్ట్రం వేలానికి ప్రతిపాదించిన ధర చాలా అధికమని, దీనివల్ల 5జీ సేవలు ఖరీదైన వ్యవహారంగా మారతాయని చెప్పారు. టెలికం రంగంలోకి పెట్టుబడులు వస్తేనే డిజిటల్ ఇండియా కల సాకారం కాగలదని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉంటేనే ఇన్వెస్టర్లు ముందుకొస్తారని విఠల్ చెప్పారు.
ట్రాయ్‌పై జియో విమర్శలు..
ఐయూసీ చార్జీల విధింపు గడువు పెంపు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌పై రిలయన్స్ జియో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఇది తిరోగమన చర్యగా అభివర్ణించింది. ఎయిర్‌టెల్ లాంటి పాత ఆపరేటర్లకు ఇది అనూహ్య లాభాలు తెచ్చిపెడుతుందని పేర్కొంది. ఐయూసీని పూర్తిగా ఎత్తేయడానికి బదులు.. గడువును పొడిగించడం వల్ల సమర్ధంగా వ్యవహరిస్తున్న టెలికం ఆపరేటర్లను శిక్షించినట్లవుతుందని, వినియోగదారుల ప్రయోజనాలనూ దెబ్బతీసినట్లవుతుందని వ్యాఖ్యానించింది.
ఇతర నెట్‌వర్క్‌ల యూజర్ల నుంచి వచ్చే కాల్స్‌ను స్వీకరించినందుకు గాను.. టెల్కోలు పరస్పరం విధించుకునే చార్జీలను ఐయూసీగా వ్యవహరిస్తారు. ఐయూసీని 2020 జనవరి 1 నుంచి పూర్తిగా ఎత్తివేయాలని గతంలో ప్రతిపాదించినప్పటికీ.. దీన్ని పొడిగించే అవకాశాలపై ట్రాయ్ చర్చాపత్రాన్ని విడుదల చేయడం వివాదాస్పదమైంది. దీంతో ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై నిమిషానికి 6 పైసల ఐయూసీ చార్జీలను జియో విధించింది.
ఇతర టెల్కోలు దాచిపెడుతున్నాయ్..
ఇతర టెల్కోలు కూడా ఐయూసీ చార్జీలను విధిస్తున్నప్పటికీ.. యూజర్లకు ఆ విషయం చెప్పకుండా దాచిపెడుతున్నాయని ఆరోపించింది. పోటీ సంస్థలు పారదర్శకత పాటించడం లేదని జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment