భారతి ఎయిర్‌టెల్...ఫ్యూచర్స్ సిగ్నల్స్
బుధవారంనాటి మార్కెట్ ర్యాలీలో బ్యాంకింగ్ షేర్లతో పాటు మెటల్, టెలికం రంగాలకు చెందిన షేర్లు కూడా పాలుపంచుకున్నాయి. వీటిలో టెలికం షేరు భారతి ఎయిర్‌టెల్ 2.6 శాతం పెరిగి 52 వారాల గరిష్టస్థాయి రూ. 432 వద్ద ముగిసింది. జూలై నెలలో ఈ షేరు మూడు దఫాలు రూ. 430 స్థాయిని తాకినప్పటికీ, ఆపైన ముగియలేకపోయింది. తాజా ర్యాలీ సందర్భంగా భారతి ఎయిర్‌టెల్ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి 1.46 లక్షల షేర్లు (0.50 శాతం) కట్ అయ్యాయి. దీంతో మొత్తం ఓఐ 2.90 కోట్లకు తగ్గింది.
స్పాట్‌తో పోలిస్తే ఫ్యూచర్ ధర ప్రీమియం సైతం రూ. 1.70 నుంచి రూ. 1కి తగ్గింది. స్వల్పంగా ఓఐ కట్‌కావడం బుల్ ఆన్‌వైండింగ్‌ను సూచిస్తుండగా, ప్రీమియం తగ్గుదలకు డెరివేటివ్ సెటిల్‌మెంట దగ్గరపడుతుండటం కారణం. ఆప్షన్స్ విభాగంలో రూ. 430 స్ట్రయిక్ వద్ద కాల్ కవరింగ్‌తో లక్ష షేర్లు కట్‌కాగా, బిల్డప్ 5.30 లక్షలకు తగ్గింది. రూ. 440 స్ట్రయిక్ వద్ద స్వల్పంగా కాల్‌రైటింగ్ జరగడంతో 11 వేల షేర్లు యాడ్ అయ్యాయి. బిల్డప్ 5.15 లక్షల షేర్లకు చేరింది.
రూ. 420 స్ట్రయిక్ వద్ద భారీ పుట్ రైటింగ్ జరగడంతో 3.72 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. పుట్ బిల్డప్ 7.90 లక్షల షేర్లకు చేరింది. సమీప భవిష్యత్తులో అనూహ్య వార్తలేవైనా వెలువడితే తప్ప, ఈ షేరు తగ్గితే రూ. 420 సమీపంలో మద్దతు పొందవచ్చని, రూ. 430పైన స్థిరపడితే క్రమేపీ రూ. 440 స్థాయిని అధిగమించవచ్చని ఆప్షన్ బిల్డప్ వెల్లడిస్తున్నది.