సాక్షి, ముంబై: కరోనా, లాక్‌డౌన్ సంక్షోభం మధ్య ప్రపంచవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో తన వీడియో కాలింగ్ ప్లాట్‌ఫామ్‌ను జియో మీట్‌ను ప్రవేశపెట్టగా, తాజాగా జియో ప్రత్యర్థి, ప్రముఖ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ కూడా ఈ సేవల్లోకి అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఒక కొత్త వీడియో-కాన్ఫరెన్సింగ్ యాప్ ను ఎయిర్‌టెల్ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. యూనిఫైడ్ వీడియో కాన్ఫరెన్సింగ టూల్‌తో పాటు మరికొన్నింటిని లాంచ్ చేయనున్నట్టు సమాచారం.
తన వీడియో-కాన్ఫరెన్సింగ్ సేవలను ప్రారంభంలో కంపెనీలకు మాత్రమే అందించనుంది. అలాగే మొబైల్, డెస్క్‌టాప్‌లో వీడియో-కాన్ఫరెన్సింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రధానంగా సరికొత్త ఏఈఎస్ 256 ఎన్‌క్రిప్షన్, వివిధ దశల్లో సెక్యూరిటీ రక్షణకు ప్రాధాన్యత ఇవ్వనుందని తెలుస్తోంది. తర్వాత సాధారణ వినియోగదారులకు ఈ యాప్‌ను అందించనుందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. సైబర్ భద్రతపై పెరుగుతున్న ఆందోళనల మధ్య డేటా, భద్రతకు ఎయిర్‌టెల్ ప్రాధాన్యత ఇస్తుందని నివేదిక తెలిపింది. జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, గూగుల్ హ్యాంగ్అవుట్‌ల వంటి ప్రస్తుత సేవలకు భిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తోందట. అయితే ఈ అంచనాలపై ఎయిర్‌టెల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం విభాగం రిలయన్స్ జియో ఇటీవల లాంచ్ చేసిన జియోమీట్‌తోపాటు, మార్కెట్లోని ఇతర సంస్థలకు గట్టిపోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment