
ఎయిర్‌టెల్ చేతికి ఓరాస్‌కామ్ వాటా
భారతీ ఎయిర్‌టెల్ అనుబంధ సంస్థ, నెట్‌వర్క్ ఐ2ఐ, ఈజిప్ట్‌కు చెందిన ఒరాస్‌కామ్‌కు చెందిన ఎంఈఎన్‌ఏలోని పూర్తి వాటాను కొనుగోలు చేయనున్నది.
ఎయిర్‌టెల్ గ్లోబల్ నెట్‌వర్క్ మరింత పటిష్టం
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్ అనుబంధ సంస్థ, నెట్‌వర్క్ ఐ2ఐ, ఈజిప్ట్‌కు చెందిన ఒరాస్‌కామ్‌కు చెందిన ఎంఈఎన్‌ఏలోని పూర్తి వాటాను కొనుగోలు చేయనున్నది. మిడిల్ ఈస్ట్ నార్త్‌ఆఫ్రికా సబ్‌మెరైన్ కేబుల్ సిస్టమ్స్(ఎంఈఎన్‌ఏ–ఎస్‌సీఎస్)లో ఒరాస్‌కామ్‌కు చెందిన పూర్తి వాటాను కొనుగోలు చేయడానికి నెట్‌వర్క్ ఐ2ఐ ఒప్పందం కుదుర్చుకుంది. డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడికాలేదు. ఒరాస్‌కామ్ టెలికం మీడియా అండ్ టెక్నాలజీ హోల్డింగ్ ఎస్‌ఏఈతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని భారతీ ఎయిర్‌టెల్ డైరెక్టర్ అజయ్ చిత్కారా పేర్కొన్నారు.
భారత్, ఆఫ్రికా వంటి వృద్ధి చెందుతున్న దేశాల్లో డేటా వినియోగం జోరుగా పెరుగుతోందని, ఎంఈఎన్‌ఏ వాటా కొనుగోలు చేయడంతో వినియోగదారులకు మరింత మన్నికైన సేవలందించగలమని వివరించారు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ 5 ఖండాల్లో, 50 దేశాల్లో 2,25,000 రూట్ కిమీ. నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. ఎంఈఎన్‌ఏ–ఎస్‌సీఎస్ కొనుగోలుతో ఎయిర్‌టెల్ గ్లోబల్ నెట్‌వర్క్ మరింతగా పటిష్టమవుతుంది.