వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్న కంపెనీలు!
వాస్తవ విరుద్దంగా ప్రకటనలు: ఏఎస్‌సీఐ
న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్ 7 ప్రకటనను ఎప్పుడైనా పరిశీలనగా చూశారా...? నిజానికి ఆ ప్రకటనలో చూపించేది ఐఫోన్ 7 కాదు. ఐఫోన్ 7ప్లస్. అంటే మెరుగైన ఉత్పత్తిని చూపిస్తూ వినియోగదారులను ఆకర్షించేలా ఈ ప్రకటన ఉన్నట్టు అర్థమవుతోంది. ఇలా 143 వాణిజ్య ప్రకటనలు తప్పుదోవ పట్టించేవిగా ప్రకటనల ప్రమాణాల కౌన్సిల్ (ఏఎస్‌సీఐ) ప్రకటించింది. వీటిలో కోకకోలా, భారతీ ఎయిర్‌టెల్ వంటి దిగ్గజ కంపెనీలవి సైతం ఉన్నాయి. మొబిక్విక్, హిందూస్తాన్ యునిలీవర్, నివియా, అముల్, ఓపెరా, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ తదితర సంస్థలకు సంబంధించి 191 ఫిర్యాదులు ఏఎస్‌సీఐ ఆధ్వర్యంలోని ఫిర్యాదుల కౌన్సిల్‌కు ముందుకు వచ్చాయి. వీటిలో 143 ప్రకటనలు నిజంగానే తప్పుదోవ పట్టిస్తున్నవిగా ఏఎస్‌సీఐ తేల్చింది. వీటిలో ఆరోగ్య రంగానికి చెందినవి 102, విద్యా రంగ ప్రకటనలు 20, వ్యక్తిగత సంరక్షణ విభాగంలో 7, ఆహార పానీయాల విభాగంలో 6, ఇతర విభాగాల నుంచి 8 ఉన్నాయి.