భారతీ ఇన్‌ఫ్రాటెల్‌లో 10% వాటా విక్రయం
► కేకేఆర్, సీపీపీఐబీలకు అమ్మేసిన భారతీ ఎయిర్‌టెల్
► ఒప్పందం విలువ రూ.6,194 కోట్లు
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజ కంపెనీ.. భారతీ ఎయిర్‌టెల్ తన మొబైల్ టవర్ల విభాగం భారతీ ఇన్‌ఫ్రాటెల్‌లో 10.3 శాతం వాటాను విక్రయించింది. ఈ వాటాను కేకేఆర్, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్(సీపీపీఐబీ) కన్సార్షియమ్‌కు రూ.6,193.9 కోట్లకు విక్రయించామని భారతీ ఎయిర్‌టెల్ తెలిపింది. 10.3 శాతం వాటాకు సమానమైన 19 కోట్లకు పైగా షేర్లను ఒక్కో షేర్‌ను రూ.325 సగటు ధరకు విక్రయించామని వివరించింది. ఈ వాటా విక్రయం కారణంగా వచ్చిన నిధులను రుణభారం తగ్గించుకోవడానికి వినియోగించాలని ఎయిర్‌టెల్ కంపెనీ భావిస్తోంది. ఈ వాటా విక్రయానంతరం భారతీ ఇన్‌ఫ్రాటెల్‌లో భారతీ ఎయిర్‌టెల్‌కు 61.7 శాతం వాటా, కేకేఆర్, సీపీపీఐబీకు 10.3 శాతం చొప్పున వాటాలుంటాయి.
భారత వృద్ధిపై, భారత ప్రభుత్వ ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమ ప్రయత్నాలపై అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకానికి ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఒక నిదర్శనమని భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్‌భారతీ మిట్టల్ వ్యాఖ్యానించారు. టెలికం మౌలిక రంగం భవిష్యత్తు సానుకూలంగా ఉండనున్నదనడానికి కూడా ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఒక ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. కాగా కేకేఆర్ సంస్థ భారతీ ఇన్‌ఫ్రాటెల్‌లో ఇన్వెస్ట్ చేయడం ఇది రెండోసారి. గతంలో అంటే 2008–15 కాలంలో కేకేఆర్ నిర్వహణలోని కొన్ని ఫండ్స్ భారతీ ఇన్‌ఫ్రాటెల్‌లో కొంత వాటాను కొనుగోలు చేశాయి.
డీల్ నేపథ్యంలో బీఎస్‌ఈలో భారతీ ఇన్‌ఫ్రాటెల్ షేరు ధర మంగళవారం 2 శాతం లాభంతో రూ.319 వద్ద ముగిసింది.