ఆ ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి
• రూ.9,900 కోట్లు రాబట్టాలి...
• టెలికం మంత్రికి జస్టిస్ బీసీ పటేల్ లేఖ
న్యూఢిల్లీ: రిలయన్స్ జియోకు ఇంటర్‌కనెక్షన్ కల్పించకుండా లెసైన్స్ నిబంధనలను ఉల్లంఘించిన భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, జరిమానా కింద రూ.9,900 కోట్లు వసూలు చేయాలని ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీసీ పటేల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు టెలికం శాఖ మంత్రి మనోజ్‌సిన్హాకు లేఖ రాశారు. ఆపరేటర్ల చర్యలు స్పష్టంగా నిబంధనల ఉల్లంఘనేనని జస్టిస్ పటేల్ అన్నారు. ఈ విషయంలో టెలికం శాఖ కఠిన చర్యలు తీసుకునే అవకాశాన్ని అవి తమ చర్యల ద్వారా కల్పించాయని, ఒక్కో ఆపరేటర్‌పై విడివిడిగా రూ.3,300 కోట్ల చొప్పున జరిమానా విధించాలని కోరారు.
ఈ అంశాన్ని పూర్తిగా అధ్యయనం చేసి చూడగా వినియోగదారుడి వ్యతిరేక, పోటీ వ్యతిరేక చర్యలను ఆపరేటర్లు అనుసరించినట్టు తెలుస్తోందని, వీటికి వెంటనే అడ్డుకట్ట వేయాలన్నారు. కస్టమర్ల పోర్టబిలిటీ దరఖాస్తులను సైతం సరైన కారణం లేకుండా తోసిపుచ్చాయన్నారు. ఇందుకు సంబంధించి మీడియా కథనాలను ఆయన ఉదహరించారు. న్యాయ చింతన కలిగిన ఈ దేశ పౌరుడిగా తాను ఈ పరిణామాలను చూస్తూ మౌనంగా ఉండిపోదలచుకోలేదని.. ఈ మూడు టెలికం ఆపరేటర్ల చర్యలు చట్ట వ్యతిరేకమని, లెసైన్స్ నిబంధనలను ఉల్లంఘించాయని జస్టిస్ పటేల్ లేఖలో పేర్కొన్నారు. సత్వరమే కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు జరిమానా విధించాలని టెలికం శాఖను కోరారు.
కాల్ డ్రాప్స్ డేటా బహిర్గతం
రిలయన్స్ జియో కాల్ డ్రాప్స్ డేటాను తన వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచింది. తన నెట్‌వర్క్ నుంచి వెళ్లే కాల్స్‌కు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా తగినన్ని ఇంటర్‌కనెక్షన్ పాయింట్లను ఇవ్వడం లేదంటూ జియో మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఈ అంశంపై ట్రాయ్‌కు కూడా ఫిర్యాదు చేసింది. ఇది నిజమేనని ట్రాయ్ పరిశీలనలోనూ తేలింది. ఈ నేపథ్యంలో జియో సెప్టెంబర్ 22వ తేదికి సంబంధించి కాల్‌డ్రాప్స్ డేటాను వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ ఒక్కరోజే 15 కోట్ల కాల్స్‌కు గాను 12 కోట్ల కాల్స్ ఫెయిల్ అయినట్టు పేర్కొంది. 6.13 కోట్ల కాల్స్ ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌కు వెళ్లే ప్రయత్నంలో 4.8 కోట్ల కాల్స్ (78.4 శాతం) ఫెయిల్ అయ్యాయి. వొడాఫోన్ నెట్‌వర్క్‌కు 4.69 కోట్ల కాల్స్‌కు గాను 3.95 కోట్ల కాల్స్ (84.1 శాతం) ఫెయిల్ అయ్యాయి. ఐడియా నెట్‌వర్క్‌కు వెళ్లే 4.39 కోట్ల కాల్స్‌లో 3.36 కోట్ల కాల్స్ విఫలం అయినట్టు ఈ డేటా ఆధారంగా జియో తెలిపింది.