
స్టాక్ మార్కెట్ బుధవారం ఆరంభ లాభాలన్నింటినీ కోల్పోయి స్వల్పలాభాలతో గట్టెక్కింది. కరోనా వ్యాక్సిన్‌పై ఆశలతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా ఆరంభంలో భారీగా లాభపడింది. మధ్యాహ్నం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తదితర షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఇంట్రాడేలో 777 పాయింట్ల మేర లాభపడిన సెన్సెక్స్ చివరకు 19 పాయింట్ల లాభంతో 36,052 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11 పాయింట్లు పెరిగి 10,618 పాయింట్ల వద్దకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 27 పైసలు పెరిగి 75.15కు చేరడం ఒకింత సానుకూల ప్రభావం చూపినా, కరోనా కేసులు పెరుగుతుండటం.. ప్రతికూల ప్రభావం చూపింది.
► ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.1,978ను తాకిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చివరకు 4 శాతం నష్టంతో రూ.1,846 వద్ద ముగిసింది. ఈ కంపెనీ 43వ ఏజీఎమ్ ఆరంభం వరకూ లాభపడిన ఈషేర్‌లో ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఏజీఎమ్ నిర్ణయాలు ఉండటమే దీనికి కారణం. సెన్సెక్స్ లాభాలను కోల్పోవడానికి ఈ షేరే కారణం.
► ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో విప్రో షేర్ 17 శాతం ఎగసి రూ.263 వద్ద ముగిసింది. ఈ షేర్‌తో పాలు ఐటీ షేర్లు కూడా లాభపడ్డాయి. మూడు ఐటీ షేర్లు–ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్‌లు ఆల్‌టైమ్ హైలను తాకాయి. దాదాపు వందకు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి.