
న్యూఢిల్లీ: యూరో పసిఫిక్ సెక్యూరిటీస్ నుంచి ఇండస్ టవర్స్‌లో 4.7 శాతం వాటాల కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు భారతి ఎయిర్‌టెల్ మంగళవారం వెల్లడించింది.
షేరు ఒక్కింటికి రూ. 187.88 రేటు చొప్పున తమ అనుబంధ సంస్థ నెటిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్ 12,71,05,179 షేర్లను కొనుగోలు చేసినట్లు వివరించింది. వొడాఫోన్ గ్రూప్‌లో యూరో పసిఫిక్ సెక్యూరిటీస్ భాగంగా ఉంది.
ఇండస్ టవర్స్ (గతంలో భారతి ఇన్‌ఫ్రాటెల్) సంస్థ వివిధ మొబైల్ ఫోన్ సర్వీస్ ఆపరేటర్ల కోసం టెలికం టవర్లు మొదలైన మౌలిక సదుపాయాలను నిర్వహిస్తోంది. 22 టెలికం సర్కిళ్లలో 1,84,748 టవర్లతో ఇండస్ టవర్స్ దేశీయంగా అతి పెద్ద టవర్ ఇన్‌ఫ్రా కంపెనీల్లో ఒకటి.