
ఫేస్‌బుక్ నుంచి ఎక్స్‌ప్రెస్ వై–ఫై
► భారతీ ఎయిర్‌టెల్‌తో జట్టు
► గ్రామీణ ప్రాంతాల్లో పబ్లిక్ హాట్‌స్పాట్స్ ఏర్పాటు
► ఉచిత ఫ్రీ–బేసిక్స్‌కు భిన్నంగా పెయిడ్ విధానంలో సేవలు
న్యూఢిల్లీ: సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ తాజాగా భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల యూజర్లకు ఇంటర్నెట్ అందుబాటులోకి తెచ్చే దిశగా ‘ఎక్స్‌ప్రెస్ వై–ఫై’ సర్వీసులు ఆవిష్కరించింది. గతంలో ప్రతిపాదించిన ఉచిత ఫ్రీ బేసిక్స్ ఇంటర్నెట్ సేవలకు భిన్నంగా దీన్ని పెయిడ్ విధానంలో అమలు చేయనుంది. ఇందుకోసం టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌తో చేతులు కలిపింది.
ఈ ఒప్పందం ప్రకారం ఎయిర్‌టెల్ రాబోయే కొన్ని నెలల్లో 20,000 పైచిలుకు వై–ఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేయనుంది. నిర్దిష్ట వెబ్‌సైట్స్‌కి మాత్రమే పరిమితమైన ఫ్రీ బేసిక్స్‌కు భిన్నంగా ఎక్స్‌ప్రెస్ వై–ఫైలో పోర్టల్స్‌పై ఎటువంటి పరిమితి ఉండదు. టెలికం ఆపరేటర్ల ద్వారా అందుబాటులో ఉండే పబ్లిక్ వై–ఫై హాట్‌స్పాట్స్‌ను ఉపయోగించుకునేందుకు యూజర్లు రోజువారీ, వారంవారీ, నెలవారీ డేటా ప్యాక్స్‌ను స్థానిక రిటైలర్స్ నుంచి కొనుగోలు చేయొచ్చు.
నాలుగు రాష్ట్రాల్లో..: ఫేస్‌బుక్ ఎక్స్‌ప్రెస్ వై–ఫై సర్వీసును ఉత్తరాఖండ్, గుజరాత్, రాజస్థాన్, మేఘాలయాలో 700 హాట్‌స్పాట్స్ ద్వారా అందిస్తారు. టారిఫ్‌లు, ప్లాన్ వేలిడిటీ అనేది ఆపరేటర్‌ను బట్టి ఆధారపడి ఉంటాయి. ఉత్తరాఖండ్‌లో ఎయిర్‌జల్దీ, రాజస్థాన్‌లో ఎల్‌ఎంఈఎస్, గుజరాత్‌లో టికోనా, మేఘాలయాలో షైల్‌ధర్ సంస్థలు ఐఎస్‌పీలుగా వ్యవహరిస్తాయి. ఎక్స్‌ప్రెస్ వై–ఫై ప్రస్తుతం కెన్యా, టాంజానియా, నైజీరియా, ఇండొనేషియా వంటి నాలుగు దేశాల్లో ప్రస్తుతం అమల్లో ఉంది.
దేశీయంగా నెట్ వినియోగం తక్కువే..
130 కోట్ల మంది జనాభా గల భారత్‌లో కేవలం 39 కోట్ల మంది మాత్రమే ఇంటర్నెట్‌కి అనుసంధానమై ఉన్నారని ఫేస్‌బుక్ ఆసియా పసిఫిక్ ప్రాంత కనెక్టివిటీ సొల్యూషన్స్ విభాగం హెడ్ మునీష్ సేథ్ తెలిపారు. ఈ నేపథ్యంలో దేశీయంగా మారుమూల ప్రాంతాలకు కూడా నెట్‌ను అం దుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో ఎక్స్‌ప్రెస్ వై–ఫై అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. మిగతా భాగస్వాములంతా కూడా కలిస్తే విస్తరించేందుకు వీలు కాగలదన్నారు.
ఈ సేవలకు సంబంధించి తాము ప్లాట్‌ఫామ్, సొల్యూషన్స్ మాత్రమే అందిస్తామని.. ఇందుకు గాను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లేదా టెలికం ఆపరేటర్, రిటైలర్ నుంచి ఎటువంటి చార్జీలు వసూలు చేయమని వివరించారు. డేటాకు సంబంధించిన చార్జీలు మొదలైనవి ఆపరేటర్ నిర్ణయిస్తారని సేథ్ తెలిపారు. ప్రస్తుతం ఫేస్‌బుక్ పలు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ఐఎస్‌పీ), 500 పైగా స్థానిక రిటైలర్లతో చేతులు కలిపినట్లు వివరించారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో కలిసి ఫేస్‌బుక్ 2015లో ఫ్రీ బేసిక్స్ పేరిట పరిమిత వెబ్‌సైట్స్‌తో ఉచిత ఇంటర్నెట్ సేవలు ప్రవేశపెట్టింది.