బార్సిలోనా: రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన టారిఫ్ ప్లాన్స్ దూకుడుగా ఉన్నాయని దేశీ దిగ్గజ మొబైల్ ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ పేర్కొంది. దీనికి స్పందనగా పరిశ్రమ మరిన్ని కాంపిటీటివ్ ప్లాన్స్‌తో, అదనపు డేటాతో జియోని ఎదుర్కొవలసి ఉందని తెలిపింది. ‘జియో ప్రకటించిన టారిఫ్‌లకు ప్రతిగా మేము యూజర్లకు ఎక్కువ ప్యాకేజీలు అందించాలి. అధిక డేటాను అఫర్ చేయాలి’ అని భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ పేర్కొన్నారు. ఆయన ఇక్కడ జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సులో మాట్లాడారు. జియో తన సర్వీసులకు ఏప్రిల్ 1 నుంచి చార్జీలను వసూలు చేయడం టెల్కోలకు శుభవార్తని తెలిపారు.
అయితే ఇంతటితోనే టారిఫ్‌ల యుద్ధం ముగియలేదన్నారు. ‘జియో తన రూ.303 టారిఫ్‌లో యూజర్లకు రోజుకు ఒక జీబీ డేటా ఇవ్వనుంది. ఇది చాలా తక్కువ ధర. ఉచిత సర్వీసులకు కన్నా ఇది నయం’ అని పేర్కొన్నారు. ఎయిర్‌టెల్ బ్యాలెన్స్ షీట్ చాలా పటిష్టంగా ఉందని, మార్కెట్‌లోని తీవ్రమైన పోటీ కారణంగా తాము నష్టాల్లోకి వెళతామని భావించడం లేదని తెలిపారు. 2018 మార్చి వరకు కంపెనీ ఆదాయంపై జియో ప్రభావం ఉండొచ్చని అంచనా వేశారు.