5జీ టెక్నాలజీ వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది అనే వార్తలను టెలికాం సంస్థల సంఘం సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) కొట్టి పారేసింది. 5జీ టెక్నాలజీ పూర్తిగా సురక్షితమని సీఓఏఐ స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాలన్ని తరువాతి తరం 5జీ టెక్నాలజీ సురక్షితమచి చెబుతున్నట్టు పేర్కొంది. 5జీ టెక్నాలజీ "గేమ్ ఛేంజర్" అని రుజువు చేస్తుందని తెలిపింది. ఈ టెక్నాలజీ వల్ల ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి ప్రయోజనం కలుగుతుందని నొక్కి చెప్పింది
ప్రముఖ టెలికాం సంస్థలైన రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌కు ఈ సంఘం ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టులో 5జీ టెక్నాలజీ విషయమై వేసిన కేసులో బాలీవుడ్ నటి జుహీ చావ్లాకు చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఓఏఐ ఈ ప్రకటన జారీ చేసింది. టెలికాం టవర్ల నుంచి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్‌కు సంబంధించి ప్రపంచంలో ఆమోదం పొందిన ప్రమాణాల కంటే మన దేశంలో విధించిన నిబందనలు చాలా కఠినమైనవని పేర్కొంది.
"భారతదేశంలో అనుమతించిన రేడియేషన్ ప్రపంచవ్యాప్తంగా అంగీకరించిన వాటిలో పదోవంతు కాబట్టి రేడియేషన్ వల్ల ప్రతికూల ప్రభావం పడుతుందన్న భయాలు అనవసరం. క్రొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పుడల్లా ఇలా జరుగుతుంది" అని సీఓఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ పీటీఐకి చెప్పారు. దేశంలో 5జీ వైర్‌లెస్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ నటి జూహి చావ్లా ఢిల్లీ హైకోర్టులో దావా వేసిన సంగతి తెలిసిందే. విచారణ సమయంలో హైకోర్టు నటిపై, ఇతర పిటిషనర్లపై రూ.20 లక్షల జరిమానా విధించింది. ఈ వ్యాజ్యం లోపభూయిష్టమైనదని, న్యాయప్రక్రియ దుర్వినియోగమైందని, కేవలం ప్రచారం పొందేందుకే ఈ కేసు పెట్టినట్టుగా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.
చదవండి: బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్
Comments
Please login to add a commentAdd a comment