న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ సేవల దేశీ దిగ్గజం టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 28.5 శాతం ఎగసి రూ. 9,008 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 7,008 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 18.5 శాతం పుంజుకుని రూ. 45,411 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 38,322 కోట్ల టర్నోవర్ నమోదైంది.
భాగస్వామ్యాలు..
క్యూ1లో యూఎస్‌కు చెందిన బయోఫార్మా కంపెనీ డిజైన్, ఆచరణ సేవలకుగాను టీసీఎస్‌ను భాగస్వామిగా ఎంపిక చేసుకుంది. జర్మనీలోని అతిపెద్ద వాణిజ్య బ్యాంకులలో ఒకటైన నార్డ్ ఎల్‌బీ ఐటీ ట్రాన్స్‌ఫార్మేషన్ సేవలకు వ్యూహాత్మక భాగస్వామిగా టీసీఎస్‌ను నియమించుకుంది. కమిన్స్ ఇంక్ గ్లోబల్ కాంటాక్ట్ సెంటర్ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రోగ్రామ్ కోసం టీసీఎస్ సేవలకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రావెల్ కంపెనీలలో ఒకటైన కార్నివాల్ కార్పొరేషన్ అప్లికేషన్ మేనేజ్‌మెంట్ సర్వీసులకు టీసీఎస్‌తో జట్టు కట్టింది. అంతేకాకుండా గ్లోబల్ హెచ్‌ఆర్ వ్యవస్థకు సంబంధించిన సిస్టమ్ ఇంటిగ్రేటర్ భాగస్వామిగానూ ఎంపిక చేసుకుంది.
క్యూ1 మైలురాళ్లు..
♦ నికరంగా 20,409 మంది ఉద్యోగులను నియమించుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 5,09,058కి చేరింది. వెరసి 5 లక్షల మంది ఉద్యోగుల మైలురాయిని తొలిసారి అధిగమించింది.
♦ ఒక త్రైమాసికంలో 6 బిలియన్ డాలర్ల(రూ. 44,700 కోట్లు) ఆదాయాన్ని తొలిసారి సాధించింది.
♦ 8.1 బిలియన్ డాలర్ల విలువైన(టీసీవీ) కాంట్రాక్టులను సంపాదించింది. నిర్వహణ మార్జిన్లు 2 శాతం బలపడి 25.5 శాతాన్ని తాకాయి. నికర మార్జిన్లు 19.8 శాతంగా నమోదయ్యాయి.
♦ షేరుకి రూ. 7 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. జూలై 16 రికార్డ్ డేట్.
♦ ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 8.6 శాతంగా నమోదైంది.
♦ ఉద్యోగుల్లో 70 శాతం మందికి వ్యాక్సినేషన్– సెప్టెంబర్‌కల్లా సిబ్బంది కుటుంబాలకూ వ్యాక్సిన్లు
♦ వార్షిక ప్రాతిపదికన వివిధ విభాగాలలో లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ 25.4 శాతం, రిటైల్, సీపీజీ 21.7 శాతం, బీఎఫ్‌ఎస్‌ఐ 19.3 శాతం, తయారీ 18.3 శాతం, టెక్నాలజీ 12.3 శాతం, కమ్యూనికేషన్స్, మీడియా 6.9 శాతం చొప్పున ఎగశాయి.
♦ ప్రాంతాలవారీగా.. ఉత్తర అమెరికా 15.8 శాతం, యూకే 16.3 శాతం, యూరోప్ 19.7 శాతం, లాటిన్ అమెరికా 16 శాతం, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా 25.2 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇక దేశీయ బిజినెస్ 25.3 శాతం, ఆసియా పసిఫిక్ 9.3 శాతం చొప్పున వృద్ధి చూపాయి. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే ♦ దేశీ ఆదాయం 14.1% క్షీణత చవిచూసింది.
మార్కెట్లు ముగిశాక ఫలితాలను ప్రకటించింది.
షేరు 0.7% క్షీణించి రూ. 3,253 వద్ద ముగిసింది.
Tcs : రూ.9వేల కోట్లు దాటిన ఆదాయం!
Published Fri, Jul 9 2021 12:34 AM | Last Updated on Fri, Jul 9 2021 12:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment