న్యూఢిల్లీ: మౌలిక రంగంలోని దిగ్గజ కంపెనీ ఎల్‌అండ్‌టీ గ్రూపు కార్యకలాపాలు జూన్ త్రైమాసికంలో గణనీయమైన ప్రభావానికి గురయ్యాయి. కన్సాలిడేటెడ్ లాభం ఏకంగా 68 శాతం పడిపోయి రూ.537 కోట్లకు పరిమితమైంది. ఆదాయం సైతం 27 శాతం తగ్గిపోయి రూ.22,037 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,698 కోట్లు, ఆదాయం రూ.30,271 కోట్లుగా ఉన్నాయి. మొత్తం వ్యయాలు కూడా రూ.27,616 కోట్ల నుంచి రూ.21,368 కోట్లకు పరిమితమయ్యాయి. ‘‘కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్ కారణంగా గ్రూపు కార్యకలాపాలు, ఆర్థిక ఫలితాలపై తీవ్రమైన ప్రభావం పడింది.
అందుబాటులో ఉన్న కొద్దిపాటి కార్మికులు, ఉద్యోగులతో కార్యకలాపాలను క్రమంగా, తగిన జాగ్రత్తల మధ్య ఆరంభించాము’’అని ఎల్‌అండ్‌టీ తెలిపింది. గ్రూపులో అధిక వ్యాపారాలపై కరోనా ప్రభావం ఉందని.. కస్టమర్లు, ఉద్యోగులు, సబ్ కాంట్రాక్టర్ల పరిధిలో పనిచేసే కార్మికులు, భాగస్వాములు, వెండర్ల ప్రయోజనాల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకున్నట్టు వివరించింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ రూ.23,574 కోట్ల విలువ చేసే నూతన ఆర్డర్లను సొంతం చేసుకుంది. ఇందులో రూ.8,872 కోట్ల మేర అంతర్జాతీయ ఆర్డర్లే. గ్రూపు కన్సాలిడేటెడ్ ఆర్డర్ల విలువ జూన్ ఆఖరుకు రూ.3,05,083 కోట్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment