ప్రజావేగు ఆరోపణల నేపథ్యంలో ఇన్ఫీని మరిన్ని కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఈ వివాదంతో నష్టపోయిన ఇన్వెస్టర్ల తరఫున క్లాస్ యాక్షన్ దావా వేసేందుకు సిద్ధమవుతున్నట్లు అమెరికాకు చెందిన న్యాయసేవల సంస్థ రోజెన్ లా ఫర్మ్ వెల్లడించింది. ‘ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించేలా ఇన్ఫోసిస్ చేసిన ప్రకటనల కారణంగా మదుపుదారులకు వాటిల్లిన నష్టాల గురించి విచారణ చేస్తున్నాం. పరిహారాన్ని రాబట్టేందుకు క్లాస్ యాక్షన్ దావా సిద్ధం చేస్తున్నాం‘ అని పేర్కొంది. ఐఎస్‌ఎస్ సెక్యురిటీస్ క్లాస్ యాక్షన్ సర్వీసెస్ ప్రకారం 2017లో అత్యధికంగా క్లాస్ యాక్షన్ దావాలను సెటిల్ చేసిన సంస్థల్లో రోజెన్ అగ్రస్థానంలో ఉంది.
క్లాస్ యాక్షన్ అంటే..: ఒక్కొక్క ప్రతివాదికి రావాల్సిన పరిహారం చాలా స్వల్పస్థాయిలో ఉండి, దావా వేసేంత స్థాయిలో ఆర్థిక వనరులు లేనప్పుడు అందరూ కలిసి వేసే కేసును క్లాస్ యాక్షన్ దావాగా పరిగణించవచ్చు. ఒక గ్రూపుగా ఏర్పడి కేసు వేయడం వల్ల లాయర్ల ఫీజుల భారం తగ్గించుకోవచ్చు. అదే సమయంలో కోర్టులకు కూడా ఒకే తరహా కేసులో వందలకొద్దీ క్లెయిమ్స్ విచారణ భారం తగ్గుతుంది. సాధారణంగా తప్పుడు ప్రకటనలు, వివక్ష, లోపభూయిష్టమైన ఉత్పత్తులు తదితర అంశాలపై ఆర్థిక సంస్థలు, తయారీదార్ల నుంచి ప్రభుత్వ సంస్థల దాకా దేనిపైనైనా ఈ దావాలకు ఆస్కారముంది. సాధారణంగా ఇలాంటి క్లాస్ యాక్షన్ కేసుల సెటిల్మెంట్ కోర్టుల వెలుపలే జరుగుతుంటాయి. పదేళ్ల క్రితం సత్యం కంప్యూటర్స్ స్కామ్ బైటపడినప్పుడు అమెరికాలో ఇన్వెస్టర్లు ఇలాంటి కేసు ద్వారానే నష్టాలకు కొంత పరిహారం పొందగలిగారు. కానీ భారత్‌లో అప్పట్లో ఇలాంటి విధానం లేకపోవడంతో ఇక్కడి ఇన్వెస్టర్లకు సాధ్యపడలేదు. సత్యం కుంభకోణం దరిమిలా ఆ తర్వాత భారత్‌లో కూడా ఇలాంటి క్లాస్ యాక్షన్ దావాలకు వీలు కల్పిస్తూ.. కంపెనీల చట్టంలో నిబంధనలు చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment