'సుధా మూర్తి' ఈ పేరుకి భారతదేశంలో పరిచయమే అవసరం లేదు, ఎందుకంటే ఒక రచయిత్రిగా, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా మాత్రమే కాకుండా పరోపకారిగా కూడా చాలా మందికి సుపరిచయమే. అయితే ఈమె ఇటీవల తన భర్త నారాయణ మూర్తితో ఏర్పడిన తొలి పరిచయం గురించి ఒక టీవీ షోలో వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇటీవల జరిగిన ఒక ప్రముఖ 'బాలీవుడ్ టాక్ షో'లో సుధా మార్తి పాల్గొన్నారు. ఇందులో బాలీవుడ్ నటి రవీనా టండన్, ప్రొడ్యూసర్ గుణీత్ మోంగా కూడా పాల్గొన్నారు. ఈ షోకి సంబంధించిన ఒక టీజర్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో నారాయణ మూర్తిని మొదటి సారి ఎప్పుడు కలిసారని వ్యాఖ్యాత కపిల్ శర్మ సుధా మూర్తిని అడిగారు.
ఈ సందర్భంలో సుధా మూర్తి తన స్నేహితురాలి ద్వారా నారాయణ మూర్తి పరిచయమయ్యారని చెప్పుకొచ్చారు. ప్రసన్న అనే స్నేహితురాలు రోజూ ఒక పుస్తకం తీసుకువచ్చేదని, అందులోని ఫస్ట్ పేజీలో నారాయణ మూర్తి పేరు మాత్రమే కాకుండా పక్కన పెషావర్, ఇస్తాంబుల్ వంటి ప్రదేశాల పేర్లు ఉండేవని చెప్పింది. ఇది చూసినప్పుడు నారాయణ మూర్తి బహుశా ఇంటర్నేషనల్ బస్ కండక్టర్ అయి ఉంటాడేమో అనుకున్నట్లు చెప్పింది.
ఒక రోజు నారాయణ మూర్తిని కలవడానికి వెళ్లాలని, కలవడానికి ముందు ఆయన సినిమా హీరోలా ఉంటాడని ఊహించినట్లు చెప్పింది. కానీ డోర్ ఓపెన్ చేయగానే ఎవరీ చిన్నపిల్లాడు? అనిపించిందని అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. ఇది విన్న అక్కడున్న వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు.
(ఇదీ చదవండి: 17 సార్లు ఫెయిల్.. ఇప్పుడు రూ. 40వేల కోట్ల సామ్రాజ్యం - ఇది కదా సక్సెస్ అంటే!)
సుధా మూర్తి 44 సంవత్సరాల కిందట నారాయణ మూర్తిని వివాహం చేసుకుంది. వీరికి అక్షతా మూర్తి, రోహన్ మూర్తి అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్షతా మూర్తి భర్త బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. సుధా మూర్తి గొప్ప మానవతా మూర్తి. ఈమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్ వంటి గొప్ప పురస్కారాలను అందించింది.
Comments
Please login to add a commentAdd a comment