అలర్ట్‌: ఐటీ దిగ్గజ సంస్థల్లో లక్షకు పైగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు | Software Jobs Information, Key Steps To Get Jobs In Telugu | Sakshi
Sakshi News home page

Software Jobs: సాఫ్ట్‌​వేర్‌ కొలువు సాధించేలా..! 

Published Wed, Aug 4 2021 12:23 PM | Last Updated on Wed, Aug 4 2021 2:01 PM

Software Jobs Information, Key Steps To Get Jobs In Telugu - Sakshi

35,000–ఇన్ఫోసిస్‌ సంస్థ ఈ ఏడాది చేపట్టనున్న నియామకాలు.. 40,000–టీసీఎస్‌ ఫ్రెషర్స్‌ రిక్రూట్‌మెంట్‌ చేస్తామని పేర్కొన్న సంఖ్య.. 22,000–హెచ్‌సీఎల్‌ సంస్థలో ఈ ఏడాది జరగనున్న ఐటీ నియామకాలు. 12,000–విప్రో సాఫ్ట్‌వేర్‌ సర్వీసుల్లో భర్తీ చేస్తామని ప్రకటించిన పోస్టుల సంఖ్య... ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ›ఏడాది టాప్‌ ఐటీ సంస్థల్లోనే లక్షా పదివేల వరకూ కొలువులు అందుబాటులోకి రానున్నాయి. ఇవే కాకుండా ఇతర సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, మధ్యతరహా ఐటీ సంస్థలు చేపట్టే నియామకాలను కూడా కలుపుకుంటే.. ఐటీ రంగంలో ఈ సంవత్సరం 1.6 లక్షల నుంచి 2 లక్షల వరకు కొత్త కొలువులు స్వాగతం పలికే అవకాశముంది. ఈ నేపథ్యంలో.. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్‌ తదితర ఐటీ సంస్థల్లో నియామక ప్రక్రియ.. విజయం సాధించేందుకు మార్గాలపై ప్రత్యేక కథనం..

టీసీఎస్‌.. టెక్నికల్‌ టు పర్సనల్‌
► అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న సాఫ్ట్‌వేర్‌ సంస్థ టీసీఎస్‌(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌). ఈ ఐటీ కంపెనీ.. టెక్నికల్‌ నైపుణ్యాలు మొదలు సాఫ్ట్‌ స్కిల్స్‌ వరకూ.. అన్నింటినీ పరిశీలించేలా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తోంది.
► టీసీఎస్‌ ఎంపిక ప్రక్రియలో నాలుగు రౌండ్లు ఉంటాయి. అవి.. అప్టిట్యూడ్‌ టెస్ట్‌; టెక్నికల్‌ ఇంటర్వ్యూ; మేనేజీరియల్‌ ఇంటర్వ్యూ; హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ.
► అప్టిట్యూడ్‌ టెస్ట్‌లో.. క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్, ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ ఎఫిషియన్సీ,కోడింగ్‌ టెస్ట్, ఈ–మెయిల్‌ రైటింగ్‌ తదితర అంశాలుంటాయి. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా రెండో రౌండ్‌.. టెక్నికల్‌ ఇంటర్వ్యూకు పిలుస్తారు. 
► టెక్నికల్‌ ఇంటర్వ్యూలో.. అభ్యర్థులు తమ రెజ్యుమేలో పేర్కొన్న అకడమిక్‌ నైపుణ్యాలు, చేపట్టిన ప్రాజెక్ట్‌ వర్క్స్‌పై ప్రశ్నలు అడుగుతారు. ఇందులోనూ టెక్నికల్‌ ఇంటర్వ్యూ టీంను మెప్పిస్తే తదుపరి దశలో మేనేజీరియల్‌ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. 
► మేనేజీరియల్‌ ఇంటర్వ్యూలో.. అభ్యర్థుల మానసిక సంసిద్ధత, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను పరిశీలిస్తారు. ఇందులోనూ విజయం సాధిస్తే.. చివరిగా హెచ్‌ఆర్‌ రౌండ్‌ ఇంటర్వ్యూకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఈ రౌండ్‌లో.. భవిష్యత్తు లక్ష్యాలు, కుటుంబ, వ్యక్తిగత నేపథ్యాలపై హెచ్‌ఆర్‌ ప్రతినిధులు ప్రశ్నలు అడుగుతారు. వీటన్నింటికీ  అభ్యర్థులు సంతృప్తికరంగా సమాధానాలిస్తే ఆఫర్‌ ఖరారైనట్లే!

ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్స్‌: టీసీఎస్‌ క్యాంపస్‌ నియామకాలతోపాటు ఆఫ్‌–క్యాంపస్‌ డ్రైవ్స్‌ను కూడా నిర్వహిస్తోంది. జాతీయ స్థాయిలో నేషనల్‌ క్వాలిఫయర్‌ టెస్ట్‌(ఎన్‌క్యూటీ) పేరుతో పరీక్ష నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు సంప్రదాయ డిగ్రీ కోర్సులైన బీఏ, బీకాం, బీఎస్‌సీ విద్యార్థులు కూడా హాజరుకావచ్చు. ఈ పరీక్ష మొత్తం అయిదు విభాగాల్లో ఉంటుంది. వెర్బల్‌ ఎబిలిటీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్, లాజికల్‌ రీజనింగ్, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌పై ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థుల్లోని విశ్లేషణ నైపుణ్యాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. ఎన్‌క్యూటీలో ప్రతిభ చూపిన విద్యార్థులకు.. తర్వాతి దశలో పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులోనూ విజయం సాధిస్తే కొలువు ఖాయం అవుతుంది. వీరికి కాగ్నిటివ్‌ బిజినెస్‌ ఆపరేషన్స్‌(సీబీఓ), బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌(బీఎఫ్‌ఎస్‌ఐ), లైఫ్‌ సైన్సెస్‌ తదితర విభాగాల్లో శిక్షణ ఇచ్చి.. విధులు కేటాయిస్తారు. 

ఇన్ఫోసిస్‌.. ఇలా
►  ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ ఫ్రెషర్స్‌ నియామకం కోసం మూడంచెల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తోంది. అవి.. అప్టిట్యూడ్‌ టెస్ట్, టెక్నికల్‌ ఇంటర్వ్యూ, హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ.
► అప్టిట్యూడ్‌ టెస్ట్‌లో.. లాజికల్‌ అండ్‌ అనలిటికల్‌ రీజనింగ్, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, వెర్బల్‌ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 
► అప్టిట్యూడ్‌ టెస్ట్‌లో విజయం సాధిస్తే.. టెక్నికల్‌ రౌండ్‌ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
► టెక్నికల్‌ రౌండ్‌ ఇంటర్వ్యూలో..ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలు, ఆపరేటింగ్‌ సిస్టమ్స్, కోడింగ్‌ స్కిల్స్, లేటెస్ట్‌ టెక్నాలజీస్‌పై అవగాహనను పరిశీలిస్తారు. ఇందులో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా.. హెచ్‌ఆర్‌ రౌండ్‌  ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. 
► హెచ్‌ఆర్‌ రౌండ్‌ ఇంటర్వ్యూలో..వ్యక్తిగత సామర్థ్యాలు, భవిష్యత్తు లక్ష్యాల గురించి ప్రశ్నలు అడుగుతారు.
► అభ్యర్థులు ఇచ్చిన సమాధానాలతో హెచ్‌ఆర్‌ ప్రతినిధులు సంతృప్తి చెందితే.. సదరు అభ్యర్థులకు ఆఫర్‌ లెటర్, అపాయింట్‌మెంట్‌ తేదీ ఖరారు చేస్తారు.

హెచ్‌సీఎల్‌.. నాలుగు రౌండ్లు
► హెచ్‌సీఎల్‌ ఎంపిక ప్రక్రియలో నాలుగు రౌండ్లు ఉంటాయి. అవి.. అప్టిట్యూడ్‌ టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్, టెక్నికల్‌ ఇంటర్వ్యూ,హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ.
► అప్టిట్యూడ్‌ టెస్ట్‌లో.. ప్రధానంగా అభ్యర్థుల్లోని మ్యాథమెటికల్‌ స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్, వెర్బల్‌ ఎబిలిటీ, టెక్నికల్‌ అప్టిట్యూడ్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 
► అప్టిట్యూడ్‌ టెస్ట్‌లో విజయం సాధిస్తే.. రెండో రౌండ్‌లో గ్రూప్‌ డిస్కషన్‌ నిర్వహిస్తారు. గ్రూప్‌ డిస్కషన్‌లో ఏదైనా సామాజిక, సాంకేతిక ప్రాధాన్యం కలిగిన అంశాలను ఇచ్చి.. వాటిపై చర్చించాలని పేర్కొంటారు. ఇందులో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా వారిని టెక్నికల్‌ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. 
►  టెక్నికల్‌ ఇంటర్వ్యూలో.. కోడింగ్‌కు సంబంధించిన ప్రశ్నలు, ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఇందులో విజయం సాధిస్తే చివరగా హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూకు హాజరవ్వాల్సి ఉంటుంది.
► హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూలో అభ్యర్థుల వ్యక్తిగత నేపథ్యంపై ఎక్కువగా ప్రశ్నలు ఉంటాయి. ఉదాహరణకు మీ గురించి చెప్పండి.. హెచ్‌సీఎల్‌లో ఎందుకు చేరాలనుకుంటున్నారు.. వంటి ప్రశ్నలు అడుగుతారు. హెచ్‌ఆర్‌ రౌండ్‌లోనూ నెగ్గితే ఆఫర్‌ సొంతమైనట్లే!

విప్రో.. మూడు దశలు
► విప్రో.. ఐటీ నియామకాలకు మూడంచెల ఎంపిక ప్రక్రియ చేపడుతోంది. అవి..అప్టిట్యూడ్‌ టెస్ట్, టెక్నికల్‌ ఇంటర్వ్యూ, హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ. 
► అప్టిట్యూడ్‌ టెస్ట్‌లో.. అనలిటికల్‌ ఎబిలిటీ, వెర్బల్‌ ఎబిలిటీ, టెక్నికల్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. టెక్నికల్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌లో.. పజిల్స్, కోడింగ్‌కు సంబంధించిన చిన్నపాటి వ్యాసాలు రాయాల్సి ఉంటుంది.
► అప్టిట్యూడ్‌ టెస్ట్‌లో విజయం సాధించిన వారిని టెక్నికల్‌ ఇంటర్వ్యూకు పిలుస్తారు.
► టెక్నికల్‌ ఇంటర్వ్యూలో..అభ్యర్థుల ప్రోగ్రామింగ్‌ లాంగ్వే జ్‌ స్కిల్స్, కోడింగ్‌ నైపుణ్యాలను పరిశీలిస్తారు. ఇందుకోసం కొన్నిసార్లు రాత పరీక్ష కూడా నిర్వహించే అవకాశముంది. అప్పటికప్పుడు ఏదైనా అంశాన్ని పేర్కొని దానిపై కోడింగ్‌ రాయమంటారు. ఈ టెక్నికల్‌ రౌండ్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. 
► హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూలో.. భవిష్యత్తు లక్ష్యాలు.. అకడమిక్‌గా సాధించిన విజయాలు.. తదితర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
►  హెచ్‌ఆర్‌ రౌండ్‌లోనూ విజయం సాధిస్తే విప్రో కొలువు ఖరారైనట్లే!

సంస్థ ఏదైనా.. కోరుకునే లక్షణాలివే
► సాఫ్ట్‌వేర్‌ సంస్థలు.. నియామక ప్రక్రియలో అభ్యర్థుల నుంచి ప్రధానంగా కొన్ని లక్షణాలను ఆశిస్తున్నాయి. అవి.. టెక్నికల్‌ స్కిల్స్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్, క్రిటికల్‌ థింకింగ్, క్రియేటివిటీ, డెసిషన్‌ మేకింగ్, పీపుల్‌ స్కిల్స్‌.
► టెక్నికల్‌ స్కిల్స్‌లో భాగంగా.. ప్రధానంగా కోడింగ్, ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ నైపుణ్యాలపై సంస్థలు ప్రత్యేక దృష్టిపెడుతున్నాయి. ఇవి ఉన్న వారికే నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తున్నాయి. 
► అభ్యర్థులు సమస్యల పట్ల స్పందించే తీరు, సానుకూల దృక్పథం, సంస్థలో దీర్ఘ కాలం పని చేసేందుకు సంసిద్ధత వంటి వాటి ఆధారంగా తుది ఎంపిక చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement