సాక్షి, విశాఖపట్నం: ఇన్ఫోసిస్ ప్రారంభోత్సవంలో భాగం అయినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. విశాఖపట్నం నగరానికి విశేషమైన సామర్ధ్యం ఉందని.. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై తరహాలో విశాఖపట్నం కూడా ఐటీ హబ్‌గా మారబోతోందని తెలిపారు. ఆ స్ధాయిలోనే విశాఖకు సహాకారం అందిస్తున్నామని తెలిపారు.
విశాఖపట్నం మధురవాడ ఐటీ హిల్ నెంబరు 2 వద్ద ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను సోమవారం సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం ఇన్ఫోసిస్ ప్రతినిధులను, సిబ్బందిని ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇన్ఫోసిస్ ప్రతినిధులు నిలంజన్ రాయ్(చీఫ్ పైనాన్షియల్ ఆఫీసర్), నీలాద్రిప్రసాద్ మిశ్రా(వైస్ ప్రెసిడెంట్), ఇతర ఇన్ఫోసిస్ ప్రతినిధులకు, మంత్రివర్గ సహచరులకు, ఇతర అతిధులకు అభినందలు తెలిపారు.
విశాఖలో ఇప్పటికే అత్యంత ప్రతిష్టాత్మక సంస్ధలు ఏర్పాటు అయ్యాయని సీఎం జగన్ పేర్కొన్నారు. 14 ఇంజనీరింగ్ కాలేజీలు, 8 యూనివర్సీటీలు, 4 మెడికల్ కాలేజీలు, 12 డిగ్రీ కాలేజీలతో విశాఖపట్నం ఎడ్యుకేషన్ హబ్‌గా తయారయిందన్నారు. ఇక్కడ నుంచి ఏడాదికి దాదాపు 12వేల నుంచి 15 వేల మంది ఇంజనీర్లు తమ డిగ్రీ పూర్తిచేసుకుని వస్తున్నారని తెలిపారు. వీటితో పాటు ఐఐఎం, నేషనల్ లా యూనివర్సిటీ వంటి అత్యంత ప్రతిష్టాత్మక సంస్ధలు కూడా విశాఖపట్నంలో ఉన్నాయని గుర్తు చేశారు.
విశాఖకు అన్ని అర్హతలు, సామర్థ్యాలు ఉంది
‘రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ తరహా మెట్రో నగరం ఆంధ్రప్రదేశ్‌లో లేదు. ఐటీ, ఐటీ సేవలకు సంబంధించిన పరిశ్రమలు గతంలో విశాఖపట్నంలో ఏర్పాటు కాలేదు. వాస్తవానికి ఆ కంపెనీల ఏర్పాటుకు కావాల్సిన అన్ని అర్హతలు, సామర్ధ్యం విశాఖలో ఉన్నప్పటికీ... ఈ కంపెనీలన్నీ అప్పటి రాజధాని హైదరాబాద్ నగరంలోనే ఏర్పాటు అయ్యాయి. అప్పట్లో విశాఖపట్నానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. అయినప్పటికీ ఏపీలో విశాఖపట్నం అతిపెద్ద నగరం. టయర్ వన్ సిటీగా ఎదగడానికి కావాల్సిన అన్ని అర్హతలు, సామర్ధ్యం ఈ నగరానికి ఉన్నాయి.
రెండేళ్లలోనే అంతర్జాతీయ విమానాశ్రయం
ఇది విశాఖపట్నం సామర్ధ్యం. ఇక్కడే ఐఓసీ, దాదాపు 20వేల నేవల్ అధికారుల కుటుంబాలతో కూడిన ఈస్టర్న్ నేవల్ కమాండ్ వంటి పబ్లిక్ సెక్టార్ సంస్ధలు కూడా ఉన్నాయి. తీరప్రాంత ఆధారిత మౌళిక సదుపాయాలు, విశాఖపట్నం, గంగవరంలలో రెండు బలమైన పోర్టులు కూడా ఉన్నాయి. వీటితో పాటు శ్రీకాకుళంలో కూడా మూడో పోర్టు వస్తుంది. కేవలం మరో రెండేళ్లలోనే ఇక్కడ అత్యంత సుందరమైన అంతర్జాతీయ పౌర విమానాశ్రయం అందుబాటులోకి రాబోతుంది.
నేను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతాను: సీఎం
మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. నేను కూడా త్వరలోనే విశాఖకు షిప్ట్ అవుతాను. మా అధికారులు కార్యాలయాలు, ఇతర అంశాలకు సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నారు. ముఖ్యమంత్రితో పాటు సీఎంఓ కార్యాలయ అధికారులు, ఇతర సిబ్బంది అంతా ఇక్కడికే వస్తారు. డిసెంబరులోపు విశాఖకు మారుతాం. నేను కూడా విశాఖలోనే నివాసం ఉంటాను.
రానున్న రోజుల్లో మరిన్ని ఐటీ కంపెనీలు
టయర్ వన్ నగరంగా ఎదగడానికి ఈ రకమైన తోడ్పాడు విశాఖనగరానికి అవసరం. ఆ రకమైన తోడ్పాటును ఇన్ఫోసిస్ అందించగలదని నేను బలంగా నమ్ముతున్నాను. 3.28 లక్షల మంది ఉద్యోగులు, 18.5 బిలియన్ డాలర్ల రెవెన్యూ సామర్ధ్యంతో ఉన్న ఇన్ఫోసిస్‌తో పాటు, టీసీఎస్, విప్రో వంటి సంస్ధలు ఏ నగరం యొక్క ఐటీ స్వరూపాన్ని, ముఖచిత్రాన్ని అయినా పూర్తిగా మార్చివేస్తాయి. ఇప్పుడు ఇన్ఫోసిస్ వస్తుంది. రానున్న రోజుల్లో మిగిలిన ఐటీ కంపెనీలు కూడా ఆ జాబితాలో చేరనున్నాయి. విశాఖలో ఆదానీ డేటాసెంటర్ కూడా రాబోతుంది.
ఐటీ రంగంలో మార్పులు
ఇంటర్నెట్ కేబుల్ మనకు ఎక్స్‌క్లూసివ్‌గా సింగ్‌పూర్ నుంచి వస్తుంది. రాబోయే రెండేళ్లలో డేటా సెంటర్ రానుంది. క్లౌడింగ్‌తో పాటు ఐటీ రంగంలో చాలా మార్పులు రానున్నాయి. ఇవన్నీ సాకారం కానున్నాయి. ఇప్పటికే ఇన్ఫోసిస్ వచ్చింది. నిలంజన్, నీలాద్రిప్రసాద్, సురేష్, రఘు వంటి ఐటీ నిపుణులతో మాట్లాడిన తర్వాత వీళ్లంతా కచ్చితంగా ఒకరోజు విశాఖ ఐటీలో అద్భుతాలు సృష్టిస్తారని బలంగా నమ్ముతున్నాను. నాకు ఆ నమ్మకం ఉంది. ఇవాళ 1000 మందితో ఇక్కడ ప్రారంభం అయిన ఇన్ఫోసిస్... రానున్న రోజుల్లో మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నాను.
ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటాం
నేను కచ్చితంగా చెప్పగలను విశాఖ కలలను సాకారం చేసే లక్ష్యంగా నిలుస్తుంది. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, ఇన్ఫోసిస్‌తో కలిసి విశాఖ ఐటీ రంగంలో బహుముఖ ప్రగతిని సాధిస్తుంది. అందరికీ హృదయపూర్వక అభినందనలు. మీకు మరొక్కసారి హామీ ఇస్తున్నా ఏ అవసరం ఉన్నా... మేం కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటాం. దీన్ని దృష్టిలో పెట్టుకొండి. మీకు ఏ అవసరం వచ్చినా మీకు అండగా నిలబడతాం అని సీఎం ప్రసంగం ముగించారు.
ఇది కూడా చదవండి: ఏపీలో పెట్టుబడుల పరుగులు..
Comments
Please login to add a commentAdd a comment