ఇన్ఫీ ఫలితాలు.. ఐఐపీపై దృష్టి
న్యూఢిల్లీ: బక్రీద్ సందర్భంగా సోమవారం(6న) స్టాక్ మార్కెట్లకు సెలవుకావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా, సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ శుక్రవారం(10న) జూలై-సెప్టెంబర్ కాలానికి(క్యూ2) పనితీరు వెల్లడించనుంది. తద్వారా దేశీ కంపెనీల క్యూ2 ఫలితాల సీజన్‌కు తెరలేవనుంది. ఇక అదే రోజు ఆగస్ట్ నెలకు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(ఐఐపీ) వెలువడనున్నాయి.
మరోవైపు ఆగస్ట్ నెలకు హెచ్‌ఎస్‌బీసీ సర్వీసెస్ పీఎంఐ వివరాలు మంగళవారం(7న) వెల్లడికానున్నాయి. ఈ అంశాలన్నీ ఈ వారం సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ఇన్ఫోసిస్ ఫలితాలు, ఐఐపీ తీరు మార్కె ట్ల నడకను నిర్దేశించగలవని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ అంచనా వేశారు.
ఎఫ్‌ఐఐలు, రూపాయి కీలకమే
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడుల తీరుతోపాటు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలను కూడా ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని అత్యధికశాతం మంది నిపుణులు పేర్కొన్నారు. ఇవికాకుండా అంతర్జాతీయ సంకేతాలు సైతం మార్కెట్ల ట్రెండ్‌ను ప్రభావితం చేయగలవని తెలిపారు. విదేశీ మార్కెట్ల తీరు, అంతర్జాతీయ సంకేతాలు, దేశీ కంపెనీల త్రైమాసిక ఫలితాలు వంటి అంశాలు రానున్న కాలంలో మార్కెట్ల దిశను నిర్దేశించగలవని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ వివరించారు.
కాగా, యూఎస్ ఉద్యోగ గణాంకాల ప్రభావం మంగళవారంనాటి ట్రేడింగ్‌పై ఉంటుందని పలువురు నిపుణులు పేర్కొన్నారు. 2008 జూలై తరువాత ఈ సెప్టెంబర్ నెలకు అమెరికాలో నిరుద్యోగిత బాగా తగ్గడంతో ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపై ఉంటుందని నిపుణులు తెలిపారు. 2,15,000 కొత్త ఉద్యోగాలను అంచనా వేయగా, 2,48,000 నమోదుకావడంతో నిరుద్యోగ రేటు 6.1% నుంచి 5.9%కు దిగింది. దీంతో గడిచిన శుక్రవారం(3న) అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు ఆర్జించాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలతో ఇతర కరెన్సీలతో మారకంలో డాలర్ బలపడింది. ఇది దేశీయంగా ఐటీ షేర్లకు ప్రోత్సాహాన్నిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.