Government teaching hospitals
-
చిన్న వయసులోనే బ్రెయిన్ స్ట్రోక్' ఘటనలు.. సరిగా నిద్రపోతున్నారా?
కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన 44 ఏళ్ల బసవయ్య విజయవాడ నగరపాలక సంస్థలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి. ఇతనికి మొన్న డిసెంబర్ 20న విధి నిర్వహణలో ఉండగా ఎడమవైపు చెయ్యి, కాలు చచ్చుబడిపోయాయి. దీంతో తోటి ఉద్యోగులు విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు. బ్రెయిన్ స్టోక్‌గా వైద్యులు నిర్థారించారు. గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి వెళ్లడం, సకాలంలో వైద్యులు మెరుగైన చికిత్స అందించడంతో ఐదున్నర గంటల వ్యవధిలో బసవయ్య తేరుకున్నాడు. విశాఖపట్నం నగరానికి చెందిన 35 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం ఇంట్లో ఉన్నట్టుండి స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా వైద్య పరీక్షల అనంతరం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనట్లుగా వైద్యులు గుర్తించారు. సాక్షి, అమరావతి: ..ఈ రెండు ఘటనల్లో తీవ్రమైన పనిఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు స్ట్రోక్‌కు దారితీసినట్లు వైద్యులు తెలిపారు. ఈ తరహా యంగ్ స్ట్రోక్ ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒకప్పుడు 50–60 ఏళ్లు పైబడిన వారు బీపీలు, సుగర్లు నియంత్రణలో లేకపోవడంతో స్ట్రోక్ గురయ్యేవారు. అయితే, ఇప్పుడు మార్పు వచ్చింది. ప్రస్తుతం నమోదవుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసుల్లో 20–30 శాతం బాధితుల వయస్సు 45 ఏళ్ల లోపే ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. అలాగే, రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో బ్రెయిన్ స్ట్రోక్ ఓపీలు ఏటా పెరుగుతూ వస్తున్నాయి. 2020–21లో 1,476, 2021–22లో 24,197, ప్రస్తుత సంవత్సరంలో జనవరి నెలాఖరు నాటికి 22,928 ఓపీలు నమోదయ్యాయి. ముప్పు తెచ్చిపెడుతున్న ఆధునిక జీవన శైలి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటివి మానవాళికి అనేక రకాల ముప్పును తెచ్చిపెడుతున్నాయి. ఇందులో బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఒకటిగా వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత రోజుల్లో చదువుకునే పిల్లల నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. దీనిని అధిగమించే చర్యలు చేపడుతున్న వారు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నారు. దీంతో చిన్న వయసులోనే సుగర్, బీపీలు, ఊబకాయం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాక.. బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బులు, కిడ్నీ, ఇతర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. యువతలో బ్రెయిన్ స్ట్రోక్‌కు వైద్యులు చెబుతున్న కారణాలు.. ► పొగతాగడం, మద్యం సేవించడం, గంజాయి, డ్రగ్స్ తీసుకోవడం. ► 15–24 ఏళ్ల వయస్సులోనే యువత మద్యం, ధూమపానానికి అలవాటు పడుతున్నారు. ఈ వయస్సులో స్మోకింగ్ అలవాటు చేసుకున్న వారికి పదేళ్లు గడిచేసరికి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనబడుతున్నట్లు తెలుస్తోంది. ధూమపానం, మద్యపానానికి బానిసలైన వారిలో 70–80 శాతం బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ► బీపీ, సుగర్ నియంత్రణలో లేకపోవడం.. ఊబకాయం ఉండటం. ప్రస్తుతం రాష్ట్రంలో 30 ఏళ్లు పైబడిన వారిలో 25 శాతం మంది బీపీ, సుగర్‌లతో బాధపడుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 ఆధారంగా రాష్ట్రంలో 36.3 శాతం మంది మహిళల్లో, 31.3 శాతం పురుషుల్లో ఊబకాయం ఉంది. ► మహిళలు నెలసరిని వాయిదా వేయడం, అధిక రక్తస్రావాన్ని నియంత్రించుకోవడం కోసం వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోకుండా మందులు వాడటం. ► కరోనా బారినపడి కోలుకున్న 5 శాతం మంది బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్నారు. జీవనశైలిలో మార్పు రావాలి ఇస్కిమిక్ స్ట్రోక్, హెమరేజ్ స్ట్రోక్.. ఇలా రెండు రకాలుగా బ్రెయిన్ స్ట్రోక్ ఉంటుంది. మెదడులోని రక్తనాళాల్లో రక్త ప్రసరణ సక్రమంగా లేకపోవడంవల్ల శరీరంలోని కొన్ని భాగాలు చచ్చుబడటాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. రక్తనాళాలు చిట్లినప్పుడు హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. హైబీపీ ఉన్న వారిలో హెమరేజ్ స్ట్రోక్ వస్తుంది. మా వద్దకు ఓపీ ఉన్న రోజుల్లో సగటున ఐదు కొత్త కేసులు వస్తున్నాయి. స్ట్రోక్ బాధితులను గోల్డెన్ అవర్‌లో బాధితులను ఆస్పత్రికి తీసుకుని వస్తే ప్రాణాపాయం నుంచి తప్పించడానికి ఆస్కారం ఉంటుంది. జీవనశైలిలో మార్పు చేసుకోవడంతో పాటు, బీపీ, సుగర్, ఊబకాయం నియంత్రించుకోవడంపై ప్రజల్లో సరైన అవగాహన పెరిగితే స్ట్రోక్ ఘటనలను అరికట్టవచ్చు. – డాక్టర్ దార వెంకట రమణయ్య, న్యూరాలజీ విభాగాధిపతి, విజయవాడ జీజీహెచ్ 25 శాతం కేసులకే సర్జరీ అవసరం బ్రెయిన్ స్ట్రోక్ ఘటనల్లో 25 శాతం మందికే సర్జరీ అవసరమవుతుంది. మిగిలిన 75 శాతం మెడికల్ మేనేజ్మెంట్తో నయమవుతుంది. కరోనా అనంతరం సర్జరీ ఘటనలు ఐదు శాతం మేర పెరిగాయి. కరోనా వచ్చిన వారిలో స్ట్రోక్ ఘటనలు కనిపిస్తున్నాయి. 25ఏళ్లలోపు వారు కూడా బ్రెయిన్ హెమరేజ్‌కు గురవుతున్నారు. ప్రస్తుతం అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. బాధితుడిని వీలైనంత త్వరగా ఆస్పత్రికి తరలించడమే కీలకంగా మారుతోంది. చాలా సందర్భాల్లో స్ట్రోక్‌కు ముందే లక్షణాలు బయటపడతాయి. ముఖం, చేతులు, కాళ్లు మొద్దుబారడం, కంటిచూపు మందగించడం జరుగుతుంది. ఇవి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే ప్రాథమిక దశలోనే సమస్యను గుర్తించడంతో పాటు నయం చేయడానికి వీలుంటుంది. – డాక్టర్ భవనం శ్రీనివాసరెడ్డి, న్యూరో సర్జన్, గుంటూరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. రోజుకు 45 నిమిషాలు నడవాలి, ఇతర వ్యాయామాలు చేయాలి.శరీర బరువును నియంత్రించుకోవడం, బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉంటే తరుచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.ఆహారంలో 25 శాతం పండ్లు, 30 శాతం కూరగాయలు, 25 శాతం పిండి పదార్థాలు, 20 శాతం ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్‌ను పూర్తిగా నియంత్రించాలి.తీవ్ర ఒత్తిడికి లోనవ్వకుండా ఉండాలి. తప్పనిసరిగా ఆరు గంటలు నిద్రపోవాలి. -
AP: ‘కార్పొరేట్’కు కన్నుకుట్టేలా..
ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 2017 నుంచి ఉన్నట్లుండి కండరాలు బిగుసుకుపోయే సమస్యతో బాధపడుతున్నాడు. ఒంగోలు, గుంటూరు, విజయవాడల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోవడంతో నాలుగేళ్లపాటు నరకయాతన అనుభవించాడు. వెళ్లిన ప్రతి ఆస్పత్రిలో సీటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎక్స్‌రే అంటూ శరీరంలోని ప్రతి అవయవాన్ని పరిశీలించారు. ఒకరు వెన్నెముకలో సమస్య ఉందని, మరొకరు నాడీవ్యవస్థలో సమస్య ఉందని.. అనేక రకాల మందులు రాసిచ్చి ఫీజులు గుంజారే తప్ప ఎక్కడా నయంకాలేదు. చివరి ప్రయత్నంగా 2021లో బాధితుడిని కుటుంబసభ్యులు గుంటూరు జీజీహెచ్‌కి తీసుకెళ్లారు. వైద్యపరీక్షల అనంతరం అతడు ‘స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ సుందరాచారి నిర్ధారించారు. మూడ్రోజుల చికిత్స తరువాత ఆ వ్యక్తి అందరిలాగే లేచి నడవడం ప్రారంభించాడు. కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన 44 ఏళ్ల బసవయ్య ఔట్సోర్సింగ్ ఉద్యోగి. గత నెల 20వ తేదీ ఉదయం విధినిర్వహణలో ఉండగా ఇతనికి ఎడమ చేయి, కాలు చచ్చుబడిపోయాయి. దీంతో తోటి ఉద్యోగులు హుటాహుటిన విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు. బ్రెయిన్‌స్ట్రోక్‌గా వైద్యులు నిర్ధారించారు. గంటన్నరలోనే వైద్యులు థ్రోంబలైజ్ ఇంజక్షన్ ఇచ్చారు. ఐదున్నర గంటల్లో బసవయ్య లేచి ఎవరి సాయంలేకుండా నడవగలిగాడు. సాక్షి, అమరావతి: ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యులకు అంతుపట్టని అరుదైన వ్యాధులకు ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో మంచి వైద్యం లభిస్తోంది. దీంతో పెద్దాస్పత్రులపై ప్రజల్లో నమ్మకం రోజురోజుకు పెరుగుతోంది. పెద్దాస్పత్రుల్లో సేవలు పొందుతున్న వారిసంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ వైద్య రంగంపై సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారిస్తోంది. ఈ క్రమంలో విలేజ్ క్లినిక్ నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని స్థాయిల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు లభిస్తున్నాయి. గణనీయంగా పెరిగిన సర్జరీలు టీడీపీ హయాంలో ప్రభుత్వాస్పత్రుల్లో ఎలుకలు కొరికి శిశువులు మృతిచెందడం, సెల్‌ఫోన్ టార్చ్లైట్ల వెలుతురులో ఆపరేషన్లు చేసిన ఘటనలు రాష్ట్ర ప్రజలు చూశారు. ఇప్పుడు అదే ఆస్పత్రుల్లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కన్నా మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు లభిస్తున్నాయి. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే బోధనాస్పత్రుల్లో గణనీయంగా సర్జరీల సంఖ్య పెరగడమే. 2018–19లో రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో 1.99 లక్షల మైనర్, 98 వేల మేజర్ సర్జరీలు నిర్వహించారు. అప్పట్లో ఏడాది కాలంలో జరిగిన సర్జరీల కంటే ఎక్కువ సర్జరీలను ప్రస్తుతం 9 నెలల్లోనే చేపట్టారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ నెలాఖరు నాటికి అన్ని బోధనాస్పత్రుల్లో 2,42,980 మైనర్, 1,18,482 మేజర్ సర్జరీలను చేశారు. ఈ లెక్కన పరిశీలిస్తే టీడీపీ హయాంలో రోజుకు సగటున 870 సర్జరీలు నిర్వహిస్తే, ప్రస్తుతం రోజుకు సగటున 1,338 సర్జరీలు చేపడుతున్నారు. రోజుకు 22వేలకు పైగా ఓపీలు ఇక ప్రస్తుతం బోధనాస్పత్రుల్లో రోజుకు 22 వేల మందికి పైగా అవుట్ పేషెంట్ (ఓపీ) సేవలు పొందుతున్నారు. అదే విధంగా 2,400 మంది వరకూ ఇన్ పేషెంట్ (ఐపీ) సేవలు అందుకుంటున్నారు. 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య రాష్ట్రవ్యాప్తంగా బోధనాస్పత్రుల్లో 60.99 లక్షలకు పైగా ఓపీలు, 6.25 లక్షలకు పైగా ఐపీలు నమోదయ్యాయి. అత్యధికంగా కర్నూల్ జీజీహెచ్‌లో 6.06 లక్షల మంది ఓపీ సేవలు పొందారు. ఆ తర్వాత విశాఖ కేజీహెచ్‌లో 5.34 లక్షలు, కాకినాడ జీజీహెచ్‌లలో 5.31 లక్షల ఓపీలు నమోదయ్యాయి. నాడు అవస్థలు.. నేడు అత్యున్నత ప్రమాణాలు టీడీపీ పాలనలో ప్రభుత్వాస్పత్రులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. అప్పట్లో బోధనాస్పత్రుల్లో మందులు, వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర వసతుల కొరత తీవ్రంగా వేధించేది. కానీ, 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం వైఎస్ జగన్ ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ సారించారు. ఈ క్రమంలో మానవ వనరుల కొరతకు చెక్‌పెడుతూ వైద్యశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 47 వేలకు పైగా పోస్టులు భర్తీచేపట్టారు. దీంతో 2019తో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధన, ఇతర ఆస్పత్రుల్లో వైద్యల సంఖ్య పెరిగింది. ఇక టీడీపీ ప్రభుత్వంలో ఎసెన్షియల్ డ్రగ్స్‌కు కూడా కొరత ఉండేది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం మందుల కొరతకు తావులేకుండా, డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలు కలిగిన మందులను 608 రకాల వరకూ బోధనాస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతోంది. ఇందులో 530కు పైగా రకాల మందులను సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ రూపంలో సరఫరా చేస్తోంది. మిగిలిన మందులను ఆస్పత్రుల్లో అవసరాలకు అనుగుణంగా స్థానికంగా కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు కూడా ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుచేశారు. ఆరోగ్యశ్రీలోనూ టీడీపీ హయాంలో కేవలం 1,059 రకాల వ్యాధులకు చికిత్స అందిస్తే.. ఇప్పుడు ఏకంగా 3,255 రకాలకు చికిత్స అందిస్తున్నారు. అంతేకాక.. నాడు–నేడు కింద రూ.16వేల కోట్లకు పైగా నిధులతో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతోపాటు, ప్రస్తుతం ఉన్న బోధనాస్పత్రులు, కళాశాలలను బలోపేతం చేస్తున్నారు. గడిచిన మూడున్నరేళ్లలో ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఇప్పటికే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 207 పీజీ సీట్లు పెరిగాయి. ఇవేకాక.. గత ఏడాది మరో 630 పీజీ సీట్ల పెంపునకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆమోదం తెలిపింది. -
అత్యవసర మందుల కొరతకు చెక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రులకు అత్యవసర మందుల సరఫరాలో కొత్త విధానాన్ని వైద్య, ఆరోగ్య శాఖ ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా మెడికల్ ఏజెన్సీలు, చెయిన్ ఫార్మసీల నుంచి ఏపీ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) టెండర్లను ఆహ్వానించింది. రాష్ట్రంలో డీఎంఈ పరిధిలో 32, వైద్య విధాన పరిషత్ పరిధిలో 13 జిల్లా ఆస్పత్రులున్నాయి. వీటిలో చికిత్సకు సాధారణంగా వినియోగించే మందులను సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి ఏపీఎంఎస్ఐడీసీ సరఫరా చేస్తోంది. స్పెషాలిటీ, సూపర్‌స్పెషాలిటీ చికిత్సల్లో వినియోగించే మందులు స్థానికంగా కొనుగోలు చేయడానికి మొత్తం మందుల బడ్జెట్లో డీఎంఈ ఆస్పత్రులకు 20 శాతం, జిల్లా ఆస్పత్రులకు 10 శాతం బడ్జెట్‌ను ఆయా ఆస్పత్రుల ఖాతాల్లో ఏపీఎంఎస్ఐడీసీ వేస్తుంది. ఈ నిధులతో స్థానిక అవసరాలకు అనుగుణంగా అత్యవసర మందులను ఆస్పత్రులు స్థానికంగానే కొనుగోలు చేస్తాయి. అయితే ఈ విధానంలో కొన్ని చోట్ల అధిక ధరలకు మందులు కొనుగోలు చేయడం, మందుల సరఫరాలో ఆలస్యం సహా పలు ఇబ్బందులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీ, చెయిన్ ఫార్మసీల ద్వారా డీ–సెంట్రలైజ్డ్ విధానంలో అత్యవసర మందుల సరఫరా చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బోధనా, జిల్లా ఆస్పత్రికి సమీపంలో మందుల దుకాణాలున్న వారి నుంచి టెండర్లు స్వీకరిస్తున్నారు. ఎమ్మార్పీపై ఎక్కువ డిస్కౌంట్‌తో మందులు సరఫరా చేసే సంస్థను ఎంపిక చేసి కాంట్రాక్ట్ అప్పజెప్పనున్నారు. నేరుగా చెల్లింపులు.. ఆస్పత్రి సూపరింటెండెంట్లు ఇండెంట్ పెట్టిన ఎంత సమయంలోగా మందులు సరఫరా చేయాలన్నదానిపై నిబంధనలు రూపొందించారు. చాలా అత్యవసరమైన మందులను ఆరు గంటల్లోగా ఫార్మసీ సంస్థ సరఫరా చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ మెడిసిన్ అయితే 24 గంటల్లో, బల్క్ మెడిసిన్‌ను వారంలోగా సరఫరా చేయాలని గడువు విధించారు. సరఫరా చేసిన మందులకు బిల్లులను ఏపీఎంఎస్‌ఐడీసీనే నేరుగా చెల్లిస్తుంది. ఈ విధానం వల్ల మందుల సరఫరాలో కాలయాపన తగ్గడంతో పాటు, వినియోగంపై స్పష్టత రావడంతో పాటు, ఆడిటింగ్‌కు ఆస్కారం ఉంటుంది. కొరతకు తావివ్వకూడదనే.. అత్యవసర మందుల సరఫరాకు టెండర్లు పిలిచాం. వచ్చే వారంలో ఫైనల్ చేస్తాం. ఆస్పత్రుల సూపరింటెండెంట్లు మొబైల్ యాప్ ద్వారా ఆర్డర్లను ఇచ్చే విధానాన్ని తీసుకొస్తాం. ఆర్డర్ ఇచ్చిన వెంటనే మందులు ఆస్పత్రులకు సరఫరా అవుతాయి. మందుల కొరతకు తావుండకూడదని నూతన విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. – మురళీధర్‌రెడ్డి, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ, వైస్ చైర్మన్ -
అమర్నాథ్ యాత్రికులకు మెడికల్ సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: అమర్నాథ్ వెళ్లే యాత్రికులకు అవసరమైన మెడికల్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించి, మెడికల్ సర్టిíఫికెట్లు జారీ చేయాలని ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు డీఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమర్నాథ్ 2022 యాత్ర జూన్ 30 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు ఉంటుంది. యాత్రకు వెళ్లేందుకు నిర్దేశించిన మెడికల్ బోర్డు నుంచి తప్పనిసరిగా ఆరోగ్య ధ్రువీకరణ పత్రం పొందాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, వయసును ధ్రువీకరించే ఇతర సర్టిఫికెట్లతో దగ్గర్లోని ప్రభుత్వ బోధనాసుపత్రికి యాత్రికులు వెళ్లాలి. అక్కడి రిసెప్షన్లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత వరుస క్రమంలో వైద్య పరీక్షలు నిర్వహించే తేదీని నిర్ణయిస్తారు. కార్డియాలజీ, ఆర్థోపెడిక్, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ వైద్యులతో కూడిన మెడికల్ బోర్డు దరఖాస్తు చేసుకున్న వారి వైద్య పరీక్షల ఫలితాల ఆధారంగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తుంది. (క్లిక్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మెడికల్ సర్టిఫికెట్లు..) -
అనాథ శవాలు అమ్మబడును!
హైదరాబాద్: ప్రభుత్వ బోధనాస్పత్రులకు ఆర్థిక పరిపుష్టి కల్పించడంతోపాటు అక్కడి విద్యార్థులకు ప్రాక్టికల్ విద్యను అందించేందుకు అనాథ శవాలను అమ్మాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది! దీనికోసం ఇప్పటికే కెడావర్ సర్టిఫికేషన్ కమిటీని ఏర్పాటు చేంది. అనాథ శవాలను అమ్మేందుకు అవసరమైన నియమనిబంధనలను పారదర్శకంగా రూపొందించే పని ఈ కమిటీకి అప్పగించింది. అనాథ శవాల అమ్మకాలపై ప్రభుత్వ ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి. తెలంగాణలో సుమారు 25 వరకు ప్రైవేటు, ఐదు ప్రభుత్వ బోధనాస్పత్రులు ఉన్నాయి. వైద్య విద్యార్థులకు ముఖ్యంగా అనాటమీ, ఫోరెన్సిక్ విభాగం విద్యార్థులకు మానవ శరీరంపై అవగాహన కల్పించేందుకు రసాయనాలు పూసిన మానవ మృతదేహాలను వినియోగించేవారు. అయితే పలు అక్రమాలు, అవకతవకలు జరిగి అప్పటి ప్రభుత్వానికి చెడ్డపేరు రావడంతో మానవ మృతదేహాల అమ్మకాలు నిలిపివేశారు. దీంతో ప్రస్తుత ప్రభుత్వం అనాథ శవాల అమ్మకానికి పారదర్శకమైన నిబంధనలు రూపొందించేందుకు సిద్ధమైంది. అనాథ మృతదేహాలను ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అమ్మి, వచ్చిన సొమ్ముతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరింత మెరుగైన వైద్యసేవలు, వైద్య విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించాలని నిర్ణయించింది. ఇవీ నిబంధనలు.... నాన్ మెడికో లీగల్ కేసులకు చెందిన అనాథ మృతదేహాలను మాత్రమే మెడికల్ కాలేజీలకు విక్రయించాలని కెడావర్ సర్టిఫికేషన్ కమిటీ సూచించినట్లు తెలిసింది. మార్చురీకి వచ్చిన వెంటనే అనాథ మృతదేహానికి ఫొటో తీసి అన్ని పోలీస్స్టేషన్లను పంపిస్తారు. 72 గంటలు తర్వాత అనాథ మృతదేహంగా నిర్ధారిస్తారు. మృతదేహం చెడిపోకుండా రసాయనాలతో పూత (ఎంబాంబింగ్) పూస్తారు. నెలరోజులు తర్వాత ఆయా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన కెడావర్ సర్టిఫికేషన్ కమిటీ మరోమారు నిర్ధారించుకున్న తర్వాత విక్రయిస్తారు. దీంతో మార్చురీల్లో అనాథ శవాలు కుళ్లి దుర్వాసన వెలువడే అవకాశం ఉండదని కమి టీ అభిప్రాయపడింది. అయితే, అనాథ శవాలను విక్రయించే అంశంపై పోలీస్ శాఖ అంత సుముఖంగా లేదు. ప్రస్తుతం పోలీస్ ఉన్నతాధికారులు ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. అవయవాలూ అమ్మకానికి..! ప్రైవేటు మెడికల్ కాలేజీలకు మృతదేహాం రూ.60 వేలకు విక్రయించాలని కెడావర్ సర్టిఫికేషన్ కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది. మానవ మృతదేహంలోని ఏ అవయవం కావాలన్నా అందించాలని సిఫారసు చేసింది. ఒక్కో అవయవానికి రూ.5 వేలు ధరను నిర్ణయించారు. మృతదేహాలు విక్రయించగా వచ్చిన సొమ్మును ఆస్పత్రి అభివృద్ధి నిధికి జమ చేసి, ఆస్పత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాలని కమిటీ సూచించింది.