హైదరాబాద్: ప్రభుత్వ బోధనాస్పత్రులకు ఆర్థిక పరిపుష్టి కల్పించడంతోపాటు అక్కడి విద్యార్థులకు ప్రాక్టికల్ విద్యను అందించేందుకు అనాథ శవాలను అమ్మాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది! దీనికోసం ఇప్పటికే కెడావర్ సర్టిఫికేషన్ కమిటీని ఏర్పాటు చేంది. అనాథ శవాలను అమ్మేందుకు అవసరమైన నియమనిబంధనలను పారదర్శకంగా రూపొందించే పని ఈ కమిటీకి అప్పగించింది. అనాథ శవాల అమ్మకాలపై ప్రభుత్వ ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి.
తెలంగాణలో సుమారు 25 వరకు ప్రైవేటు, ఐదు ప్రభుత్వ బోధనాస్పత్రులు ఉన్నాయి.
వైద్య విద్యార్థులకు ముఖ్యంగా అనాటమీ, ఫోరెన్సిక్ విభాగం విద్యార్థులకు మానవ శరీరంపై అవగాహన కల్పించేందుకు రసాయనాలు పూసిన మానవ మృతదేహాలను వినియోగించేవారు. అయితే పలు అక్రమాలు, అవకతవకలు జరిగి అప్పటి ప్రభుత్వానికి చెడ్డపేరు రావడంతో మానవ మృతదేహాల అమ్మకాలు నిలిపివేశారు. దీంతో ప్రస్తుత ప్రభుత్వం అనాథ శవాల అమ్మకానికి పారదర్శకమైన నిబంధనలు రూపొందించేందుకు సిద్ధమైంది. అనాథ మృతదేహాలను ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అమ్మి, వచ్చిన సొమ్ముతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరింత మెరుగైన వైద్యసేవలు, వైద్య విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించాలని నిర్ణయించింది.
ఇవీ నిబంధనలు....
నాన్ మెడికో లీగల్ కేసులకు చెందిన అనాథ మృతదేహాలను మాత్రమే మెడికల్ కాలేజీలకు విక్రయించాలని కెడావర్ సర్టిఫికేషన్ కమిటీ సూచించినట్లు తెలిసింది. మార్చురీకి వచ్చిన వెంటనే అనాథ మృతదేహానికి ఫొటో తీసి అన్ని పోలీస్‌స్టేషన్‌లను పంపిస్తారు. 72 గంటలు తర్వాత అనాథ మృతదేహంగా నిర్ధారిస్తారు. మృతదేహం చెడిపోకుండా రసాయనాలతో పూత (ఎంబాంబింగ్) పూస్తారు.
నెలరోజులు తర్వాత ఆయా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన కెడావర్ సర్టిఫికేషన్ కమిటీ మరోమారు నిర్ధారించుకున్న తర్వాత విక్రయిస్తారు. దీంతో మార్చురీల్లో అనాథ శవాలు కుళ్లి దుర్వాసన వెలువడే అవకాశం ఉండదని కమి టీ అభిప్రాయపడింది. అయితే, అనాథ శవాలను విక్రయించే అంశంపై పోలీస్ శాఖ అంత సుముఖంగా లేదు. ప్రస్తుతం పోలీస్ ఉన్నతాధికారులు ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు.
అవయవాలూ అమ్మకానికి..!
ప్రైవేటు మెడికల్ కాలేజీలకు మృతదేహాం రూ.60 వేలకు విక్రయించాలని కెడావర్ సర్టిఫికేషన్ కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది. మానవ మృతదేహంలోని ఏ అవయవం కావాలన్నా అందించాలని సిఫారసు చేసింది. ఒక్కో అవయవానికి రూ.5 వేలు ధరను నిర్ణయించారు. మృతదేహాలు విక్రయించగా వచ్చిన సొమ్మును ఆస్పత్రి అభివృద్ధి నిధికి జమ చేసి, ఆస్పత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాలని కమిటీ సూచించింది.
అనాథ శవాలు అమ్మబడును!
Published Thu, Aug 13 2015 3:46 AM | Last Updated on Sun, Sep 3 2017 7:19 AM
Advertisement
Advertisement