Orphan corpses
-
అనాథ శవాలకు ఆత్మ బంధువులు
సాక్షి, నెల్లూరు/బారకాసు: నెల్లూరు నగర పరిధిలోని రైల్వే ట్రాక్‌పై ఛిద్రమైన తల.. కాళ్లు, చేతులు వేర్వేరుగా పడి ఉన్నాయి. చుట్టూ ఈగలు ముసురుతుండగా.. ఆ శవం దుర్వాసన వెదజల్లుతోంది. పోలీసులు సైతం ముక్కుమూసుకుని నిలబడగా.. పెద్దోడు, చిన్నోడు అనే వ్యక్తులు చకచకా వచ్చి శరీర భాగాలను సేకరించారు. వాటన్నిటినీ ఓ దుప్పట్లో కట్టుకుని వాహనంలోకి ఎక్కించారు. అక్కడి నుంచి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత ఛిద్రమైన శవ భాగాలను శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు జరిపారు. కట్టె కాలుతుండగా ఎగిసిపడే చితి మంటలు.. వారి ఔదార్యానికి సలాం చేస్తాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. వేలాది మృతదేహాలకు పెద్దోడు, చిన్నోడు అసామాన్య సేవలందిస్తున్నారు. రైలు బోగీలకు మంటలంటుకున్న వేళ 2011లో నెల్లూరు రైల్వేస్టేషన్లో తమిళనాడు ఎక్స్‌ప్రెస్ బోగీల్లో మంటలు చెలరేగి ఘోర ప్రమాదం జరిగింది. చాలామంది ప్రయాణికులు అగ్నికీలల్లో చిక్కుకుని గుర్తు పట్టలేనంతగా కాలిపోయారు. ఆ సమయంలో చిన్నోడు, పెద్దో డు కృషి అంతా ఇంతా కాదు. వీరిద్దరి సహకారంతోనే మంటల్లో కాలిపోయిన వారి మృతదే హాలను బోగీల్లోంచి వెలికితీసి రక్త సంబంధీకు లకు అప్పగించారు. కరోనా విజృంభించిన సమ యంలోనూ పెద్దోడు, చిన్నోడు ప్రాణాలకు తెగించి మృతదేహాలకు అంత్యక్రియలు చేయించారు. ఇదీ పెద్దోడు కథ.. విశాఖపట్టణానికి చెందిన బత్తిన గురుమూర్తి (పెద్దోడు) 30 ఏళ్ల క్రితం కుటుంబ కలహాల కారణంగా సొంతూరిని వదిలేసి నెల్లూరు చేరుకున్నాడు. ప్రధాన రైల్వేస్టేషన్లో ఫుట్‌పాత్‌నే నివాసంగా మార్చుకుని కడుపు నింపుకునేందుకు చేతనైన పనిచేస్తూ జీవనం సాగిస్తుండగా.. ఓ రోజు రాత్రి రైలు పట్టాలపై శవం ఉందన్న సమాచారం రైల్వే పోలీసులకు అందింది. అర్ధరాత్రి వేళ శవాన్ని ఎవరు తీస్తారని ఎదురుచూస్తున్న సమయంలో వారికి గురుమూర్తి కనిపించాడు. అతడిని నిద్రలేపిన పోలీసులు శవాన్ని తీసుకొచ్చేందుకు రావాలని కోరారు. పెద్దోడు కాదనకుండా శవం ఉన్న ప్రాంతానికి వెళ్లి.. అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహం భాగాలను ఓ సంచిలో వేసుకుని చెక్కబండిపై నెట్టుకుంటూ పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. దీంతో పోలీసులు గురుమూర్తికి రూ.300 ఇచ్చారు. ఆ నగదుతో 4 రోజులపాటు కడుపునింపుకున్న పెద్దోడు మరోసారి కూడా అదే తరహాలో అనాథ మృతదేహాన్ని తరలించాడు. ఇలా మొదలైన ఆయన జీవన ప్రయాణం 30 ఏళ్లుగా అనాథ శవాలకు ఆత్మబంధువుగా.. పోలీసులకు సహాయకారిగా మారాడు. నెల్లూరు నగర పరిసరాల్లో ఎక్కడ ప్రమాదవశాత్తు లేదా ఇతరత్రా కారణాలతో ఎవరైనా మృతి చెందితే పోలీసుల నుంచి ఫోన్‌కాల్ వచ్చేది పెద్దోడికే. చిన్నోడు ఎవరంటే.. నెల్లూరులోని కొత్తూరుకు చెందిన సురేష్‌కుమార్ (చిన్నోడు) కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటి నుంచి వచ్చేశాడు. ప్రధాన రైల్వేస్టేషన్ ఎదుట ఫుట్‌పాత్‌నే నివాసంగా మార్చుకున్నాడు. యాచిస్తూ కడుపు నింపుకునే సురేష్‌కు గురుమూర్తితో స్నేహం ఏర్పడింది. అప్పటినుంచి ఎక్కడ మృతదేహం ఉన్నా పోలీసుల నుంచి పిలుపు రాగానే ఇద్దరూ కలసి వెళ్తున్నారు. అలా చేయడంలోనే తృప్తి అది మంచో చెడో మాకు తెలియదు. శవాలు కనిపిస్తే సాయం చేయాలనిపిస్తుంది. పోలీసులిచ్చే డబ్బు కోసం కాదు. మాకు అందులోనే తృప్తి ఉంటోంది కాబట్టే ఆ పనికి ఒప్పుకుని చేస్తున్నాం. – గురుమూర్తి (పెద్దోడు) అప్పుడప్పుడూ బాధేస్తుంది ఏదైనా ప్రమాదంలో ఎవరైనా చనిపోతే వారి పరిస్థితిని చూసి బాధ కలుగుతుంది. వారి శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా పడి ఉంటాయి. కొన్నిసార్లు కుక్కలు సైతం పీక్కు తింటుంటాయి. కుళ్లి పోయిన శవాలనూ చూస్తుంటాం. ఇలాంటప్పుడు మాకు బాధ కలుగుతుంది. – సురేష్‌కుమార్ (చిన్నోడు) -
ఎన్నో అనాథ శవాలకు అంత్యక్రియలు.. నేడు అనాథ శవంలా మార్చురీలో
విశాఖపట్నం: జీవితం అంతుచిక్కని మలుపుల వింత ప్రయాణం. ఏ పయనం ఎక్కడ మొదలవుతుందో.. ఎప్పుడు ఎక్కడ ఎలా ముగిసిపోతుందో అంచనా వేయడం అసాధ్యం. కొందరికి బతుకు వేడుకైతే.. మరికొందరికి వేదన. కొందరి ప్రస్థానం చరిత్రలో నిలిచిపోతే.. మరికొందరి బతుకంతా అజ్ఞాతమే.. ఆ అనాథ యువకుడి జీవితం రెండో కోవకే చెందుతుంది. శ్మశానమే సర్వస్వమైన అతడిని.. అక్కడకు చేరువులోనే సంచరించిన మృత్యువు తిరిగిరాని లోకాలకు తీసుకుపోయింది. అతను ఎన్నో అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. నేడు ఆ యవకుడి మృతదేహం కేజీహెచ్ మార్చురీలో అనాథ శవంలా ఉంది. కాన్వెంట్ జంక్షన్ సమీపంలోని హిందూ శ్మశానవాటికలో పోలిపల్లి పైడిరాజు(35) 15 ఏళ్లుగా సేవలందిస్తున్నాడు. నగరానికి చెందిన వాడే అయినా.. ఆలనాపాలనా చూసేవారెవరూ లేకపోవడంతో అక్కడా ఇక్కడా కాలం గడిపి చివరికి శ్మశానానికి చేరుకున్నాడు. పైడిరాజు చిన్న వయసులోనే తల్లిదండ్రులిద్దరూ మృతి చెందారు. అన్నయ్య ఉన్నా.. అతడికి దూరంగా ఉంటున్నాడు. శ్మశానంలో పని చేస్తున్న మరికొందరితో కలిసి ఉంటున్నాడు. పైడిరాజు సేవ విలువకట్టలేనిది. అనాథలు.. అభాగ్యులే కాదు. డబ్బున్న వారెందరికో తనే తలకొరివి పెట్టాడు. కుమారులు, కుమార్తెలు విదేశాల్లో ఉండి.. ఇక్కడకు రాలేని పరిస్థితిలో ఎందరో తల్లులు.. తండ్రులకు తనే కుమారుడిగా తలకొరివి పెట్టిన రోజులెన్నో. గతేడాది సురేష్ అనే కూలీ అనారోగ్యానికి గురయ్యాడు. పనిచేసే ఓపిక నశించడంతో.. గత్యంతరం లేక యాచక వృత్తిలో పడ్డాడు. సురేష్ కు ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందాడు. అనాథ శవంగా మిగిలిపోయిన సురేకు అతని కుమారుడి చేతుల మీదుగా పైడిరాజు అంత్యక్రియలు జరిపించి మానవత్వం చాటుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది అభాగ్యులు.. అనాథలకు అన్నీ తానై అంతిమ సంస్కరణలు నిర్వహించాడు. ఎంతో మందికి పాడి కట్టాడు. నా అనే వారు లేక చనిపోయిన వారిని ఊరేగిస్తున్న క్రమంలో విసిరిన డబ్బులకు పైడిరాజు అలవాటు పడ్డాడు. ఆ వచ్చే డబ్బులతో పూట గడిచేది. అలా శ్మశానవాటికకు చేరువయ్యాడు. ఆదివారం రోడ్డు ప్రమాదానికి గురై.. అర్ధాంతరంగా తనువు చాలించాడు. -
అనాథ శవాలు అమ్మబడును!
హైదరాబాద్: ప్రభుత్వ బోధనాస్పత్రులకు ఆర్థిక పరిపుష్టి కల్పించడంతోపాటు అక్కడి విద్యార్థులకు ప్రాక్టికల్ విద్యను అందించేందుకు అనాథ శవాలను అమ్మాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది! దీనికోసం ఇప్పటికే కెడావర్ సర్టిఫికేషన్ కమిటీని ఏర్పాటు చేంది. అనాథ శవాలను అమ్మేందుకు అవసరమైన నియమనిబంధనలను పారదర్శకంగా రూపొందించే పని ఈ కమిటీకి అప్పగించింది. అనాథ శవాల అమ్మకాలపై ప్రభుత్వ ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి. తెలంగాణలో సుమారు 25 వరకు ప్రైవేటు, ఐదు ప్రభుత్వ బోధనాస్పత్రులు ఉన్నాయి. వైద్య విద్యార్థులకు ముఖ్యంగా అనాటమీ, ఫోరెన్సిక్ విభాగం విద్యార్థులకు మానవ శరీరంపై అవగాహన కల్పించేందుకు రసాయనాలు పూసిన మానవ మృతదేహాలను వినియోగించేవారు. అయితే పలు అక్రమాలు, అవకతవకలు జరిగి అప్పటి ప్రభుత్వానికి చెడ్డపేరు రావడంతో మానవ మృతదేహాల అమ్మకాలు నిలిపివేశారు. దీంతో ప్రస్తుత ప్రభుత్వం అనాథ శవాల అమ్మకానికి పారదర్శకమైన నిబంధనలు రూపొందించేందుకు సిద్ధమైంది. అనాథ మృతదేహాలను ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అమ్మి, వచ్చిన సొమ్ముతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరింత మెరుగైన వైద్యసేవలు, వైద్య విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించాలని నిర్ణయించింది. ఇవీ నిబంధనలు.... నాన్ మెడికో లీగల్ కేసులకు చెందిన అనాథ మృతదేహాలను మాత్రమే మెడికల్ కాలేజీలకు విక్రయించాలని కెడావర్ సర్టిఫికేషన్ కమిటీ సూచించినట్లు తెలిసింది. మార్చురీకి వచ్చిన వెంటనే అనాథ మృతదేహానికి ఫొటో తీసి అన్ని పోలీస్స్టేషన్లను పంపిస్తారు. 72 గంటలు తర్వాత అనాథ మృతదేహంగా నిర్ధారిస్తారు. మృతదేహం చెడిపోకుండా రసాయనాలతో పూత (ఎంబాంబింగ్) పూస్తారు. నెలరోజులు తర్వాత ఆయా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన కెడావర్ సర్టిఫికేషన్ కమిటీ మరోమారు నిర్ధారించుకున్న తర్వాత విక్రయిస్తారు. దీంతో మార్చురీల్లో అనాథ శవాలు కుళ్లి దుర్వాసన వెలువడే అవకాశం ఉండదని కమి టీ అభిప్రాయపడింది. అయితే, అనాథ శవాలను విక్రయించే అంశంపై పోలీస్ శాఖ అంత సుముఖంగా లేదు. ప్రస్తుతం పోలీస్ ఉన్నతాధికారులు ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. అవయవాలూ అమ్మకానికి..! ప్రైవేటు మెడికల్ కాలేజీలకు మృతదేహాం రూ.60 వేలకు విక్రయించాలని కెడావర్ సర్టిఫికేషన్ కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది. మానవ మృతదేహంలోని ఏ అవయవం కావాలన్నా అందించాలని సిఫారసు చేసింది. ఒక్కో అవయవానికి రూ.5 వేలు ధరను నిర్ణయించారు. మృతదేహాలు విక్రయించగా వచ్చిన సొమ్మును ఆస్పత్రి అభివృద్ధి నిధికి జమ చేసి, ఆస్పత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాలని కమిటీ సూచించింది.