న్యూఢిల్లీ: కోల్‌కతా యువవైద్యురాలిపై హత్యాచార ఘటన తర్వాత.. దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన బాట పట్టారు. తమపై దాడుల్ని అరికట్టాలంటూ నిరసనలతో రోడ్డెక్కారు. దేశవ్యాప్తంగా ఓపీ సేవలు నిలిపేసి 24 గంటల సమ్మె చేపట్టారు. ఈ నేపథ్యంలో డాక్టర్ల భద్రత కోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
రెసిడెంట్ డాక్టర్స్ అసోషియేషన్ ఫెడరేషన్,ఇండియన్ మెడికల్ అసోషియేషన్, ఢిల్లీ రెసిడెంట్ డాక్టర్స్ అసోషియేషన్ ప్రతినిధులు, కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అధికారుల్ని కలిశారు. ఈ నేపథ్యంలోనే ఈ భద్రతా హామీ ప్రకటన వెలువడింది. ‘‘వైద్య రంగానికి చెందిన ప్రతినిధులు మమ్మల్ని కలిశారు. తమపై జరుగుతున్న దాడులపై వాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. భద్రత, రక్షణ కల్పన ప్రధానాంశాలుగా ప్రస్తావించారు. కేంద్రం ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించదు. ఇందుకోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వైద్య వృత్తిలో ఉన్న వాళ్ల భద్రత కోసం ఎలాంటి ప్రమాణాలు పాటించాలి? అనేది ఆ కమిటీ మాకు సూచిస్తుంది. దానిని బట్టి విధివిధానాలను రూపొందిస్తాం. ఇప్పటికే దేశంలో 26 రాష్ట్రాలు వైద్య సిబ్బంది రక్షణ చట్టాల్ని రూపొందించినట్లు మా దృష్టికి వచ్చింది. డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది భద్రత కోసం అన్ని విధాల కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం’’ అని తన ప్రకటనలో ఆరోగ్య మంతత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో..
ఒకవైపు దేశంలో డెంగీ, మలేరియా కేసులు పెరిగిపోతున్నాయని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిరసనలకు దిగిన వైద్యులు తమ విధులకు హాజరు కావాలని తన ప్రకటనలో విజ్ఞప్తిచేసింది.
వారం కిందట పశ్చిమ బెంగాల్ కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ ఆస్పత్రిలో యువ వైద్యురాలిని అత్యంత కిరాతంగా లైంగిక దాడి జరిపిన హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. వైద్య రంగ సిబ్బంది నేరుగా నిరసనలు తెలుపుతుండగా.. ప్రముఖులు తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్టుల ద్వారా ఘటనను ఖండిస్తూ వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment