న్యూఢిల్లీ: భారత్‌లో మరోసారి కొత్త వేరియెంట్ రూపేణా కరోనా విజృంభించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల కనిపించింది. మరోవైపు ఫ్లూ కేసులు గణనీయంగా నమోదు అవుతున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. హఠాత్తుగా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నందున.. అప్రమత్తంగా ఉండాలని, నియంత్రణ మీద దృష్టిసారించాలని ఆ లేఖలో పేర్కొంది.
మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు బుధవారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖలు రాశారు. టెస్టుల సంఖ్యను పెంచాలని, చికిత్స, ట్రాకింగ్‌తో పాటు వ్యాక్సినేషన్ పైనా దృష్టిసారించాలని ఆరోగ్య శాఖ లేఖల్లో ఆయా రాష్ట్రాలను కోరింది. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితుల దృష్ట్యా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, కాబట్టి నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించింది ఆరోగ్య శాఖ. ఈ పర్యవేక్షణ కేత్ర స్థాయి (గ్రామాలు, మండలాలు, జిల్లాలు) నుంచే కొనసాగాలని, కోవిడ్-19 నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకే కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.
ఇదిలా ఉంటే.. గత శనివారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ సైతం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు. కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని కోరారాయన.
చివరగా.. ఒక్కరోజులో దేశవ్యాప్తంగా నవంబర్ 12వ తేదీన 734 కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత.. ఇప్పుడు నాలుగు నెలల తర్వాత బుధవారం 700కి పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేల(4,623) పైకి చేరింది. యాక్టివ్ కేసుల శాతం 0.01 శాతంగా ప్రస్తుతానికి ఉండగా, రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment