ఇడియెట్ సిండ్రోమ్
గూగుల్ చేసి చూడకు. రాసిచ్చిన మందులు వాడు’ అని డాక్టర్ పేషెంట్‌తో చెప్పాల్సి వస్తోంది. కారణం -ప్రిస్కిప్షన్ తీసుకుని బయటకు వచ్చిన వెంటనే ఆ మందులను గూగుల్ చేసి వాటి గుణాలు, సైడ్ ఎఫెక్ట్‌లు, వాటిని ఏయే జబ్బులకు వాడతారు అన్నీ పేషెంట్ తెలుసుకోవడమే. తెలుసుకున్న తర్వాత ఎన్నో డౌటానుమానాలు తెచ్చుకొని కొన్ని మందులు వాడకపోవడం, కొన్ని డోస్ తగ్గించమనడం ఇలా చేస్తూ ఆరోగ్యానికి హాని చేసుకుంటున్నారని డాక్టర్లు అంటున్నారు. ఇలా చేసే స్వభావానికి ‘ఇడియట్ సిండ్రోమ్’ అనే పేరు కూడా పెట్టారు.
కొన్ని నెలల క్రితం ఒక యువతి కిడ్నీలు ఫెయిలయ్యే స్థితిలో హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి వచ్చింది. పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమెకు మందులు పని చేయని స్థితిని గమనించారు. కారణం ఆమె యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పినప్పుడల్లా తండ్రి ఇంటర్నెట్‌లో చూసి మందులు తెచ్చి వాడటమే. అతను డాక్టర్‌ని కలవాలనుకోలేదు. డాక్టర్ కంటే గూగుల్‌ని నమ్మాడు. ఇలా చేయడం వల్ల ప్రాణాంతకమైతే తిరిగి డాక్టరే రక్షించాల్సి వచ్చింది గూగుల్ కాదు.
డాక్టర్‌కు తెలుసు
డాక్టర్‌లు తమ డాక్టర్ పట్టా కోసం ఐదేళ్లు చదువుతారు. ఆ తర్వాత తర్ఫీదు అవుతారు. ఆ తర్వాత ప్రాక్టీసు మొదలెడతారు. దేహ గుణాలు, మందు గుణాలు పేషెంట్‌ను బట్టి జబ్బును బట్టి తమ అనుభవం కొద్దీ రాస్తారు. పేషెంట్‌ను కాపాడటమే డాక్టర్ లక్ష్యం. గతంలో డాక్టర్ రాసింది పేషెంట్లు నమ్మకంగా ఫాలో అయ్యేవారు. మహా అయితే మందుల షాపువాణ్ణి ఈ మందులు మంచివేనా అని అడుగుతారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. విస్తృతంగా వచ్చిన ఇంటర్నెట్ వల్ల ప్రతి దాన్ని తెలుసుకోవాలనే ఉబలాటం, ప్రతి దాన్నీ సందేహించే స్వభావం ఏర్పడ్డాయి. డాక్టర్ రాసిన మందులను తమ ఇష్టానుసారం మార్చు కుంటున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ చదివి బెంబేలు పడి కొన్ని వాడటమే లేదు. పైగా మందుచీటిని తిరిగి తీసుకొచ్చి ప్రశ్నలతో వేధిస్తున్నారు. పేషెంట్ల ఇలాంటి రుగ్మతకు డాక్టర్లు పెట్టిన పేరే ‘ఇడియట్ సిండ్రోమ్’!
శంక వద్దంటున్నారు
ఇటీవల సీఎస్ మంజునాథ్ అనే వైద్యుడు ‘మీ గూగుల్ పరిజ్ఞానంతో అయోమయానికి గురై... నా మెడికల్ డిగ్రీని శంకించకండి’ అంటూ బోర్డు పెట్టుకున్న దృశ్యం వైరల్ అయ్యింది. ఆయన దగ్గరే కాదు... ఈ తరహా బోర్డులు మరెన్నో ఆసుపత్రుల్లో కనిపిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో వంటలూ, వార్పులూ, కామెడీ ఎంత చూసినా పర్లేదు. కానీ వ్యాధులూ, వైద్యాలు చూస్తూ తమ జబ్బులతో తామే పేషెంట్లు చెలగాటాలాడుతున్నారని డాక్టర్ల ఆవేదన. ‘ఈ మందును ఎక్కువ వాడితే సైడ్‌ఎఫెక్ట్స్ వస్తాయట’ అంటూ డాక్టర్లకే వైద్యం నేర్పుతున్నారు.
‘పానీపూరీ, ఫాస్ట్‌ఫుడ్డూ తినేప్పుడు ఇలాగే సైడ్‌ఎఫెక్ట్స్ గురించి ఆలోచిస్తున్నారా’ అంటూ డాక్టర్లు చీవాట్లు పెడుతున్న సందర్భాలూ ఉంటున్నాయి. నిజానికి ‘పేషెంట్’ అనే మాటకు ‘రోగి’ అన్న పదం అంత గౌరవప్రదంగా లేదంటూ ‘బాధితుడు’ అని వాడటం పరిపాటి అయ్యింది. ఇడియెట్ సిండ్రోమ్ వల్ల పేషెంట్ల చేతిలో డాక్టర్లు బాధితులవుతున్నారనేది వైద్యుల ఆవేదన.
నెట్ జ్ఞానం సరికాదు...
‘ఇడియట్ సిండ్రోమ్’తో రోగులు వైద్యుల్ని ప్రశ్నించడం, సొంతవైద్యం చేసుకోవడం సరికాదు. ఇంటర్‌నెట్ సమాచారంతో వ్యాధి నిర్ధారణ సమంజసం కాదు. నెట్ చూసి మందులు వాడితే ఒక్కోసారి ప్రాణాలమీదికి రావచ్చు. వైద్యాన్ని వైద్యుడు తన పరిజ్ఞానంతో, అనుభవంతో, నైపుణ్యంతో వ్యాధి నిర్ధారణ చేసి, ఏయే మందులు ఏయే మోతాదులో వాడాలో నిర్ణయిస్తాడు. గూగుల్ సమాచారంతో ఎవరికి వారు నిర్ధారణలూ, మందుల నిర్ణయాలూ సరికాదని తెలుసుకోవాలి.- డాక్టర్ పావనీ ప్రియాంక కార్యదర్శి, ఐఎంఏ, తెనాలి
డాక్టర్ షాపింగ్
వాస్తవానికి వ్యాధి ఏమిటనేది అనుభవంతో కూడిన వైద్యులు, ఎన్నో కోణాల నుంచి పరిశోధన, ఎన్నో పరీక్షలు చేశాక నిర్థారణ చేస్తారు. తర్వాత తగిన మోతాదులో మందులిస్తారు. అప్పుడు ‘ఈ ఫలానా ఇంజెక్షనే ఎందుకు? దీనికి ప్రత్యామ్నాయంగా ట్యాబ్లెట్ ఉందిగా’ అంటూ అడుగుతున్న పేషెంట్లు... అంతటితో ఆగకుండా... ఆ డాక్టర్‌ను వదిలి మరో డాక్టర్ దగ్గరికి మరో ఒపినీయన్, ఇంకో ఒపీనియన్ అంటూ తిరుగుతున్నారు. ఇలా తిరగడాన్నే వైద్య పరిభాషలో ‘డాక్టర్ షాపింగ్’ అంటారు. దీని తర్వాత సొంతంగా మందుల్ని కొని వాడుతూ ప్రాణాల మీదికి తెచ్చుకున్న దాఖలాలూ ఉన్నాయి. దీనికి పరాకాష్ట ఇటీవల ఓ భర్త ఇంటర్‌నెట్ చూస్తూ పురుడు పోస్తూ తన భార్య మరణానికి కారణమయ్యాడు. అందుకే ‘ఇడియట్ సిండ్రోమ్’ ధోరణి వద్దంటున్నారు.
– బి.ఎల్. నారాయణ, సాక్షి, తెనాలి.
Comments
Please login to add a commentAdd a comment