ఏదైనా అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లినప్పుడు వైద్యులు రకరకాల మందులు, యాంటీబయాటిక్స్ రాసిస్తుంటారు. అయితే ఆ యాంటీబయాటిక్స్ ఎందుకు రాశారు.. ఆవశ్యకత ఏంటన్నది సామాన్యులకు తెలియదు. డాక్టరు చెప్పారు కదా చాలామంది వాడేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా వైద్యులకు పలు కీలక సూచనలు చేసింది.
కారణం రాయాల్సిందే..
రోగులకు యాంటీబయాటిక్స్ సూచించడానికి గల కారణాన్ని, ఆవశ్యకతను ప్రిస్క్రిప్షన్‌లో పేర్కొనడం తప్పనిసరి చేయాలని వైద్య కళాశాలలు, వైద్య సంఘాలలోని డాక్టర్లకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అత్యవసరంగా విజ్ఞప్తి చేసింది. అలాగే ఫార్మసిస్ట్‌లు కూడా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, అర్హత కలిగిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ విక్రయింవద్దని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ గోయెల్ కోరారు.
వైద్య కళాశాలలు, మెడికల్ అసోసియేషన్ వైద్యులందరినీ ఉద్దేశించి రాసిన జనవరి 1 నాటి లేఖలో యాంటీమైక్రోబయాల్స్ దుర్వినియోగం, మితిమీరిన వాడకం డ్రగ్-రెసిస్టెంట్ పాథోజెన్స్ అభివృద్ధికి దోహదపడుతుందని డాక్టర్ అతుల్ గోయెల్ ఉద్ఘాటించారు. యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) అనేది ప్రపంచ ప్రజారోగ్యానికి పెద్ద ముప్పుగా పరిణమించిందన్నారు. దీనివల్ల 2019లో మాత్రమే ప్రపంచవ్యాప్తంగా సుమారు 12.7 లక్షల మరణాలు సంభవించాయన్నారు. ఇవికాక అదనంగా 49.5 లక్షల మరణాలు డ్రగ్-రెసిస్టెంట్ ఇన్‌ఫెక్షన్‌లతో సంబంధం కలిగి ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment