మహారాష్ట్రలోని పూణెలో ఆరు జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారినపడినవారిలో ఇద్దరు గర్భవతులున్నారు. జికా వైరస్ కేసులు వెలుగు చూసిన నేపధ్యంలో రాష్ట్ర ఆరోగ్యవిభాగం అప్రమత్తమయ్యింది. పూణె మున్సిపల్ అధికారులు వైరస్ నివారణకు చర్యలు ప్రారంభించారు. జికా వైరస్ వ్యాప్తికి కారణమైన దోమలను తరిమికొట్టేందుకు నగరంలో విస్తృతంగా ఫాగింగ్ చేస్తున్నారు.
రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం అరంద్వానేలోని 46 ఏళ్ల డాక్టర్ జికా వైరస్ బారిపడ్డారు. ఇది రాష్ట్రంలో జికా వైరస్ తొలికేసుగా గుర్తించారు. అనంతరం ఆ వైద్యుని కుమార్తె(15)కు వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. వీరిద్దిరితోపాటు ముండ్వాకు చెందిన ఇద్దరి రిపోర్టులు పాజిటివ్‌గా వచ్చాయి.
ఈ నాలుగు కేసులు నమోదైన దరిమిలా అరంద్వానేకు చెందిన ఇద్దరు గర్భిణులకు జికా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. అయితే జికా వైరస్ సోకిన వీరందరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. కాగా వైరస్ సోకిన ఎడెస్ దోమ కాటు కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకినప్పుడు బాధితునిలో డెంగ్యూ లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్‌ను తొలిసారిగా 1947లో ఉగాండాలో కనుగొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment