భారత్‌లో మరోమారు కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, ఆదివారం కొత్తగా మరో 335 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,701కి పెరిగింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా తాజాగా ఐదుగురు మృతి చెందారు.
కరోనాతో కన్నుమూసినవారిలో నలుగురు కేరళకు చెందినవారు కాగా, ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. కరోనా కొత్త సబ్-వేరియంట్ జేఎన్.1 కేసులు కేరళలో నమోదయ్యాయి. దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.50 కోట్లు. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.46 కోట్లకు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం. కోవిడ్ -19 కారణంగా ఇప్పటివరకు 5,33,316 మంది మరణించారు. కోవిడ్-19 మరణాల రేటు 1.19 శాతం. డిసెంబర్ 8న కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని కరకుళంలో పాజిటివ్ కేసు కనుగొన్నామని ఐసీఎంఆర్‌డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్ల్ మీడియాకు తెలిపారు.
కాగా రాష్ట్రంలో బయటపడిన కోవిడ్ సబ్-వేరియంట్ జేఎన్.1 విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అన్నారు. కొత్త వేరియంట్ గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సింగపూర్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేసిన భారతీయ ప్రయాణికురాలిలో నెలరోజుల క్రితమే సబ్-వేరియంట్‌ని గుర్తించారని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.
ఇది కూడా చదవండి: ఈ ఏటి మేటి మహిళలు వీరే!
Comments
Please login to add a commentAdd a comment