ఒక కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు ఒకే వృత్తిని ఎంచుకోవడమే కష్టం. అలాంటిది ఒక కుటుంబంలో మొత్తం 140 మందికి పైగా డాక్టర్లు ఉన్నారు. ఇలా ఎక్కడోగానీ జరగదు. తరతరాలు ఓకే వృత్తిని కుటుంబ వారసత్వంగా కొనసాగిస్తూ.. ప్రతి తరంలో ఒక వ్యక్తి దాన్ని అనుసరించడం విశేషం. ఇలా ఐదు తరాలు వైద్య వృత్తినే అనుసరించారు. ఆ ఇంటికి వచ్చిన కోడలు కూడా డాక్టరే అయ్యి ఉండాలట. అంతేగాదు ఐదు తరాలుగా ప్రతి ఒక్క సభ్యుడు డాక్టర్‌గా ఉన్న ఏకైక కుటుంబంగా అరుదైన రికార్డుని దక్కించుకుంది. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగిందంటే..
డిల్లీకి చెందిన సబర్వాల్ కుటుంబం ఈ ఘనతను దక్కించుకుంది. ఇదంతా వారి ముత్తాత లాలా జీవన్మల్ నుంచి మొదలయ్యిందని డాక్టర్ రవీంద్ర సబర్వాల్ చెబుతున్నారు. లాహోర్‌లో స్టేషన్ మాస్టర్‌గా పనిచేస్తున్న లాలా జీవన్ముల్ ఒకరోజు మహాత్మా గాంధీ ఆరోగ్యం, విద్య ప్రాముఖ్యత గురించి మాట్లాడటం విన్నాడట. ఇక అప్పుడే ఆయన ఆస్పత్రిని నిర్మించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడట. అంతేగాదు తన నలుగురు కుమారులు బోధిరాజ్, త్రిలోక్ నాథ్, రాజేంద్ర నాథ్, మహేంద్ర నాథ్ లను మెడిసిన్ చదివించాలని భావించాడట.
అలా వారి కుటుంబంలో 1902లో తొలి డాక్టర్‌గా బోధిరాజ్ ఈ వృత్తిని చేపట్టారు. అదే ఏడాది పాకిస్తాన్‌లోని జలాల్‌పూర్ జట్టన్‌లో జీవన్ ఆసుపత్రిని నిర్మించారు. ఆయన అక్కడ వైద్యుడిగా సేవలందించారు. అప్పటి నుంచి ఈ వృత్తిని కుటుంబంలోని తదుపరి తరం చేపట్టాలని, అలాగే వైద్య విద్యనభ్యసించిన వధువునే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే విభజన సమయంలో లాహోర్ నుంచి ఢిల్లీకి తరలి వెళ్లాల్సి వచ్చింది ఈ కుటుంబం.
ప్రస్తుతం ఢిల్లీలో ఆ కుటుంబానికి మొత్తం ఐదు ఆస్పత్రులు ఉన్నాయి. అంతేగాదు కరోల్ బాగ్, ఆశ్రమం, వసంత్ విహార్‌లో వాటికి సంబంధించిన వివిధ శాఖలు కూడా ఉన్నాయి. ఇలా ప్రతి తరం డాక్టర్ కావడంతో ఆస్పత్రి కారిడార్ కూడా పెరుగుతూ వచ్చింది. అంతేగాదు ఆ కుటుబంలోని తొలి డాక్టర్ భోధిరాజ్ హయాం నుంచి.. తర్వాతి తరం మెడిసిన్ నాల్లోవ సంవత్సరం చదువుతుండగానే.. ఒక సరికొత్త స్టెతస్కోప్‌ను అందజేయడం ఆచారంగా పాటిస్తారట. దీన్ని వాళ్లు ఆశీర్వాదంగా భావిస్తారట. ఈ మేరకు నేత్ర నిపుణుడు డాక్టర్ వికేష్ సబర్వాల్ మాట్లాడుతూ..డాక్టర్ బోధిరాజ్ కుటుంబ సభ్యులందర్నీ వైద్యులుగా తీర్చిదిద్దేలా గట్టిగా కృషి చేశారని చెప్పారు.
తమకు అరటిచెట్టుకు ఇంజెక్షన్లు ఇవ్వడం నుంచి ప్రాక్టీస్ చేయించినట్లు తెలిపారు. ఆఖరికి డిన్నర్ టేబుల్ సంభాషణల్లో కూడా ఆస్పత్రి గురించే మాట్లాడటం, చర్చలు జరుగుతాయని అన్నారు. అలాగే తమ పిల్లలు ఆపరేషన్ థియేటర్ లోపలే హోంవర్క్‌లు చేస్తారని గర్వంగా చెప్పారు. ప్రమాద బాధితులు ఆస్పత్రికి వచ్చినట్లు తెలియగానే తమ కుటుంబం అప్రమత్తమైపోతుందని చెబుతున్నారు.
ఎవ్వరూ వ్యతిరేకించ లేదా..?
కుటుంబంలో ప్రతి ఒక్కరినీ డాక్టర్‌గా మార్చే నినాదాన్ని ఎవ్వరు వ్యతిరేకించి లేదా అంటే..? వారి ఆలోచనని మార్చడంలో కుటుంబం పూర్తిగా విజయం సాధించిందని అంటారు ఆ కుటుంబ సభ్యులు. ఎవ్వరైనా తాము వేరే కెరీర్‌ని ఎంచుకుంటాం అనగానే కుటుంబ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తారట. అదికూడా ఆస్పత్రిలోనే సమావేశమై నిర్ణయాన్ని మార్చుకునేలా చేస్తామని చెబుతోంది ఆ కుటుంబం. ఇక కుమారుల్లో ఒకరు బయోకెమిస్ట్ చేసిన భార్యను వివాహం చేసుకుంటే..ఆమెను పదేపదే మెడిసిన్ చదవమని చెప్పడంతో..ప్రస్తుతం ఆమె అమెరికాలో డాక్టర్‌గా స్థిరపడిందని చెబుతున్నారు నాలుగోతరం కోడలు డాక్టర్ గైనకాలజిస్ట్ శీతల్.
ఇక ఆ కుటుంబంలోని ఆరవతరం సమర్వీర్ అనే 11 ఏళ్ల బాలుడు కూడా తనని తాను డాక్టర్ సమర్వీర్‌గా పరిచయం చేసుకోవడం విశేషం. అయితే తమ కుటుంబంలోని ఆరవ తరం దియా సబర్వాల్ అనే 21 ఏళ్ల అమ్మాయి తమ కుటుంబ వారసత్వ వృత్తికి విరుద్ధమైన రంగాన్ని ఎంచుకుని ఇంగ్లీష్, కంప్యూటర్ సైన్స్‌లలో డబుల్ డిగ్రీని పూర్తి చేసిందని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. అలాగే 16 ఏళ్ల ఆర్యన్ కూడా ఇలానే వేరే రంగం(క్రికెట్) అంటే మక్కువ..కానీ నానమ్మ కుటుంబ వారసత్వం వృత్తినే ఎంచుకోమని బలవంతం చేస్తోందని చెబుతున్నాడు. ఇలా ఒక నినాదంతో కుటుంబం అంతా ఒక తాటిపై నిలబడి ఆ వృత్తినే చేపట్టడం అంత ఈజీ కాదు కదా..!.
(చదవండి: తొలిసారిగా వృద్ధుడికి ట్రిపుల్-ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్..!)
Comments
Please login to add a commentAdd a comment