
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ముంబైలోని డాక్టర్ దంపతులు మార్కస్ రాన్నీ, రైనా.. కొవిడ్-19 నుంచి కోలుకున్న వారి నుంచి మందులు సేకరిస్తున్నారు. ఆ సేకరించిన మందులను అవసరమైన రోగులకు అందిస్తున్నారు. ఈ డాక్టర్స్ జంట మే 1న మెడ్స్ ఫర్ మోర్ అనే సంస్థను ప్రాంరంభించింది. పది రోజుల క్రితం ప్రారంభమైన ఈ సంస్థ 10 రోజుల్లో 20 కిలోగ్రాముల కోవిడ్ మందులను కోలుకున్న వారి నుంచి సేకరించింది.
‘‘మా వద్ద పని చేసే వైద్య సిబ్బంది కుటుంబ సభ్యుల్లో ఒకరు కరోనా బారిన పడ్డారు. ఆ సమయంలో మందులు కావలసి వచ్చింది. అయితే కోలుకున్న వారి వద్ద కరోనా మందులు మిగిలి వృధా అయ్యే అవకాశం ఉంది. ఆ ఆలోచనతో ఇరుగుపొరుగు వారి సహాయంతో కోవిడ్ మందులు సేకరించడానికి ఈ మిషన్‌ను ప్రారంభించాం. కరోనా బారిన పడిన పేదలకు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలకు ఈ ఔషధాలను విరాళంగా అందిస్తాం.’’ అని డాక్టర్ దంపతులు పేర్కొన్నారు.
కోవిడ్ -19 రోగులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తున్న యాంటీ బయాటిక్స్, ఫాబిఫ్లు, పెయిన్ కిల్లర్, స్టెరాయిడ్లు, ఇన్హేలర్లు, విటమిన్లు, యాంటాసిడ్లు వంటి అన్ని రకాల ఔషధాలను మెడ్స్ ఫర్ మోర్ సేకరిస్తుంది. వాటితో పాటు పల్స్ ఆక్సిమీటర్లు, థర్మామీటర్లు వంటి ప్రాథమిక ఔషధ పరికరాలను కూడా సేకరిస్తుంది.
(చదవండి: కేంద్రం టీకాలను దుర్వినియోగం చేస్తోంది: సిసోడియా)
Comments
Please login to add a commentAdd a comment