నిజంగానే మైదాపిండి మంచిదికాదా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..! | Sakshi
Sakshi News home page

నిజంగానే మైదాపిండి మంచిదికాదా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..!

Published Fri, Apr 19 2024 6:33 PM

Maida Is It Really Good for Our Health - Sakshi

పరోటాలు దగ్గర నుంచి పిజ్జా, బర్గర్‌, కేక్స్‌, గులాబ్‌ జామున్‌, జిలేబీ వంటి పలు రకాల స్వీట్లను మైదాతోనే తయారు చేస్తారు. ఆఖరికి సాయంత్రం వేళ్ల టీ తాగుతూ తినే బిస్కెట్లు, సమోసాల్లో కూడా మైదా ఉంటుంది. రోగులకు ఇచ్చే బ్రెడ్‌లలో కూడా మైదా ఉంటుంది. అంటే మన నిత్య జీవితంలో ఏదో రకంగా తెలియకుండానే మైదాను తీసుకుంటున్నాం. అలాంటిది మరీ మైదా మంచిదికాదని చాలామంది చెబుతున్నారు. ఇది ఎంత వరకు నిజం? వైద్యులు ఏమంటున్నారు ? ఎవరెవరు తినకూడదు అంటే..

మైదాని ఎలా తయారు చేస్తారంటే..
బియ్యంలో మూడు దశలు ఉంటాయి. ఊక, బ్రాన్, బియ్యం. ఊకను తొలగించాక పైపొర (బ్రాన్)తో ఉండే బియ్యాన్ని బ్రౌన్ రైస్ అని పిలుస్తారు. ఈ పైపొరను కూడా తొలిగిస్తే పాలిష్డ్ రైస్ అని అంటారు. అలాగే గోదుమల విషయానికొస్తే పైపొట్టు (ఊక), పైపొర(బ్రాన్)తో కూడిన గోదుమ, పాలిష్డ్ గోదుమ అనే మూడు దశలు ఉంటాయి. ఊకను తొలగించి బ్రాన్‌తో కూడిన ధాన్యాన్ని గోదుమలుగా పిలుస్తారు. గోదుమ నుంచి బ్రాన్‌ను కూడా తీసేసి బాగా మెత్తగా పిండిలా చేస్తే దాన్నే మైదా అని అంటారు. విదేశాల్లో దీన్నే ఆల్ పర్పస్ ఫ్లోర్ అని పిలుస్తారనిని న్యూట్రీషియన్లు వివరించారు.

గోధమ రవ్వకు, మైదాకు తేడా ఏంటంటే..
బ్రాన్‌ను తొలగించిన గోదుమ నుంచే రవ్వ తయారవుతుంది. కాకపోతే మైదాలా దీన్ని బాగా మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేస్తారు. కాబట్టి, ఈ రెండింటికీ పెద్ద తేడా లేదు. రెండూ పైపొర తీసేసిన గోదుమ నుంచే తయారవుతాయి. అందువల్ల మైదాను ఎక్కువగా తినడం కచ్చితంగా ఆరోగ్యానికి మంచిది కాదు. అలా అని చెప్పి మైదా విషయంలో అతిగా భయపడాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. 

తెలుపు రంగుకి కారణం..
మైదాకు తెలుపు రంగు రావడం కోసం బ్లీచ్‌ను వాడతారు. బ్లీచ్ చుట్టూ చాలా వివాదాలు ఉన్నాయి. బ్లీచ్ అనేది ఆక్సీకరణ (ఆక్సిడేషన్) ప్రక్రియ. ఈ ప్రక్రియ గురించి మనం స్కూల్లోనే నేర్చుకున్నాం. ఈ ప్రక్రియ ద్వారా గోదుమల నుంచి బ్రౌన్ రంగును తొలగించవచ్చు. బ్లీచ్ ప్రక్రియలో బ్లీచింగ్ ఏజెంట్లుగా క్లోరిన్, బెంజాయిల్ పెరాక్సైడ్ వంటి రసాయనాలను వాడతారు. ఈ రసాయనాలను ఎంత మోతాదులో వాడాలనే అంశంపై కొన్ని పరిమితులు ఉన్నాయి. సరైన పరిమాణంలో ఈ రసాయనాలను వాడాలి. బ్లీచింగ్ ప్రక్రియ అంతా పూర్తిచేసుకొని వినియోగానికి అందుబాటులోకి వచ్చిన మైదాలో ఎలాంటి రసాయనాలు ఉండవని ఆహార నిపుణులు చెబుతున్నారు

మైదా వల్ల షుగర్‌ వస్తుందా..
మైదాను బ్లీచింగ్ చేసినప్పుడు, అలోక్సాన్ అనే రసాయనం కలుస్తుంది. ఈ రసాయనం వల్ల డయాబెటిస్ వస్తుందని చెబుతారు.  నిజానికి అలోక్సాన్ విషయానికొస్తే, మైదా బ్లీచింగ్ ప్రక్రియలో అదనంగా దీన్ని కలపరు. ఆక్సీకరణ ప్రక్రియలో భాగంగా బై ప్రోడక్ట్‌గా అలోక్సాన్ ఉత్పత్తి అవుతుంది. మైదాలో చాలా స్వల్ప పరిమాణంలో అలోక్సాన్ ఉంటుంది. పరిశోధనల్లో భాగంగా ఎలుకల్లో ఈ అలోక్సాన్ రసాయనాన్ని వాడి కృత్రిమంగా మధుమేహాన్ని ప్రేరేపిస్తారు. దీని కారణంగా మనకు కూడా షుగర్ వస్తుందేమో అని భయపడతారు. కానీ, అధ్యయనాల్లో వాడే అలోక్సాన్, మైదాలో ఉండే అలోక్సాన్ కంటే 25 వేల రెట్లు శక్తిమంతమైనదని గ్రహించాలి. అందువల్ల ఈ రెండింటిని పోల్చకూడదు. 

మైదాలో ఏముంటాయంటే..
‘గోదుమ నుంచి తయారు చేసిన మైదాలో పిండిపదార్థం అధికంగా ఉంటుంది. ఉదాహరణకు, 100 గ్రాముల మైదాలో 351 కేలరీలు ఉంటాయి. 10.3 గ్రాముల ప్రొటీన్, 0.7 గ్రాముల కొవ్వు, 2.76 గ్రాముల ఫైబర్, 74.27 గ్రాముల స్టార్చ్ ఉంటుందని చెబుతున్నారు న్యూటిషియన్లు. 

(చదవండి: అరవింద్‌ కేజ్రీవాల్‌ మామిడి పండ్ల డైట్‌..షుగర్‌ పేషెంట్లకు మంచిదేనా..?)

Advertisement
Advertisement