టెన్షన్‌.. టెన్షన్‌! | Aggravated mental stress | Sakshi
Sakshi News home page

టెన్షన్‌.. టెన్షన్‌!

Published Mon, Jun 10 2024 5:40 AM | Last Updated on Mon, Jun 10 2024 5:40 AM

Aggravated mental stress

తీవ్రమవుతున్న మానసిక ఒత్తిళ్లు 

ఒత్తిడితో డిప్రెషన్, ఆందోళన  

వైద్యుల వద్దకు వస్తున్న  కేసుల్లో ఇలాంటివే ఎక్కువ 

యోగా, ధ్యానం, నడక  తప్పదంటున్న వైద్యులు  

సకాలంలో ఆహార తినడం ప్రధానం  

కంటినిండా నిద్ర కూడాముఖ్యమే

కర్నూలు (హాస్పిటల్‌): వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక టెన్షన్‌ ఉంటోంది. పిల్లలకు చదువుపై టెన్షన్‌. ఇన్‌టైమ్‌లో హోమ్‌ వర్క్‌ చేయడం, చెప్పిన పాఠాలు అర్థం చేసుకోవడం, హోమ్‌వర్క్‌ చేయకపోతే టీచర్‌ కొడుతుందేమోనని భయం వారిది. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం యువత టెన్షన్‌. ఉద్యోగం వస్తేనే అమ్మాయిని ఇస్తారనేది ఇంకో టెన్షన్‌. ఇలా ఉద్యోగం లేక, పెళ్లి కాని యువత చాలామందే ఉన్నారు. 

తీరా ఉద్యోగం వచ్చాక ఆయా సంస్థలు, ఉన్నతాధికారులు ఇచ్చే లక్ష్యాలు నెరవేర్చాలంటే మరో టెన్షన్‌. వీకెండ్‌ వస్తే ఇంట్లో భార్యాపిల్లల ఇష్టాలు తీర్చేందుకు అవసరమైన డబ్బు లేదనేది మరికొందరి టెన్షన్‌. పిల్లలు పెద్దయ్యాక వారికి వివాహాలు చేయడం మరో టెన్షన్‌. 

దీంతోపాటు ఇంట్లో పెద్దల ఆరోగ్య విషయాలు, వారి ఆలనాపాలనా చూసేవారు కరువు కావడం, అందరూ ఉన్నా అనాథలు కావడం ఇంకో టెన్షన్‌. ఇలా ఎవరి స్థాయిలో వారికి టెన్షన్‌ ఉంటోంది. ఈ క్రమంలో టెన్షన్‌తో పాటు ఆందోళన, డిప్రెషన్‌ వస్తున్నాయి. వీటిని తగ్గించుకునేందుకు ఇటీవల మానసిక వైద్యుల వద్దకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 

ఓపీ పెరుగుతోంది 
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మానసిక వ్యాధుల విభాగం ఓపీకి ప్రతిరోజూ 75 నుంచి 90 మంది వరకు రోగులు వస్తుండగా.. అందులో 40 శాతం కొత్తవారు ఉండటం గమనార్హం. వీరిలో 40 నుంచి 50 శాతం వరకు ఆందోళన, కుంగుబాటు(డిప్రెషన్‌)కు గురై చికిత్స కోసం వస్తున్న వారే ఉంటున్నారు. వీరు గాక నగరంలోని ప్రైవేటు మానసిక వైద్యుల వద్దకు, జనరల్‌ మెడిసిన్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుల వద్దకు సైతం ప్రతిరోజూ 220 నుంచి 250 మంది దాకా రోగులు చికిత్స కోసం వస్తున్నారు. 

ఇందులో జనరల్‌ మెడిసిన్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుల వద్దకు సైకోసొమాటిక్‌ (శారీరక, మానసిక) జబ్బులతో బాధపడే వారే ఎక్కువ. దీంతోపాటు 30 శాతం మద్యం, సిగరెట్‌ అలవాట్లు, 20 నుంచి 30 శాతం మంది తీవ్రమైన మానసిక సమస్యలు (స్క్రిజోఫీనియా, మానియా, డిల్యూషన్‌ డిజార్డర్లు, బైపోలార్, సివియర్‌ డిప్రెషన్‌)తో వస్తున్నారు. వృద్ధుల్లో 5 శాతం మంది నిద్రలేమి, మతిమరుపు సమస్యలతో వస్తున్నారు. 

చిన్నపిల్లల్లోనూ  5శాతం మంది మానసిక సమస్యలతో చికిత్స కోసం వస్తున్నారు. 2021లో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మానసిక జబ్బుల విభాగానికి ఓపీ 15,942, ఇన్‌పేషెంట్లుగా 92 మంది చికిత్స పొందగా.. 2022లో ఈ సంఖ్య ఓపీలో 19,475కి, ఇన్‌పేòÙంట్లు 175కి, 2023లో ఓపీ 20,323, ఇన్‌పేòÙంట్ల సంఖ్య 245కు పెరిగింది. 

నిద్ర లేకపోవడంతోనే సమస్యలు 
కొంతమంది కొద్దిపాటి సమయం లభించినా కూర్చున్న చోటే ఒక కునుకు తీస్తారు. మరికొందరు అర్ధరాత్రి దాటినా కళ్లు తెరుచుకుని అటూఇటూ చూస్తూనే ఉంటారు. ఇంకొందరు నిద్రపట్టక నిశాచర జీవుల్లా రాత్రిళ్లు ఊరంతా చుట్టేస్తుంటారు. పట్టణాల్లో అధికంగా రాత్రివేళ టీ స్టాల్స్‌ వద్ద ఇలాంటి వారే మనకు కనిపిస్తుంటారు.

 ఎప్పుడో తెల్లవారుజామున మూడు, నాలుగు సమయంలో వీరు ఇళ్లకు చేరుకుని నిద్రించి, మరునాడు ఉదయం 10 గంటల వరకు లేవడం లేదు. దీనికి మానసిక ఒత్తిళ్లు, డిప్రెషన్, ఆందోళనతో పాటు శారీరక వ్యాయామం లేకపోవడం, అధికంగా ఆహారం తీసుకోవడం, ఎక్కువగా మొబైల్‌ ఫోన్, టీవీ, కంప్యూటర్‌ స్క్రీన్‌లకు అతుక్కుపోవడమే కారణమని వైద్యులు చెబుతున్నారు. 

నిద్రలేమి కారణంగా మరుసటిరోజు శరీరం ఉత్సాహంగా గడిపేందుకు సహకరించడం లేదు. నిరుత్సాహం, నిస్సత్తువ ఆవహిస్తున్నట్టు ఉంటుంది. ఫలితంగా వీరికి గ్యాస్‌ట్రబుల్, గుండె దడ, ఊబకాయం, మలబద్దకం, బీపీ, షుగర్‌ వంటి ఆరోగ్య సమస్యలు కొత్తగా తలెత్తుతాయి. 

మానసిక ఆరోగ్యానికి సూత్రాలు 
» ఇష్టమైన పనులు చేయాలి 
»   బాధలు, కష్టాలను కుటుంబసభ్యులు, సన్నిహితులతో పంచుకోవాలి 
»   భావోద్వేగాలను అదుపులో ఉంచుకోకూడదు 
»   ఉదయాన్నే వాకింగ్‌ చేయడం, ధ్యానం, యోగా చేయాలి. దీనివల్ల డిప్రెషన్, మానసిక ఒత్తిడి అదుపులోకి వస్తాయి. 
»    వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్ర, సినిమాలు, షాపింగ్‌కు వెళ్లాలి. 
»   అందుబాటులో ఉంటే రోజులో ఒక్కసారైనా కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయాలి.  

చిన్నపిల్లల్లో మానసిక సమస్యలు 
»తెలివి తక్కువ, బుద్దిమాంద్యంతో కూడిన మానసిక వ్యాధులు 
» చదువుపై ఏకాగ్రత లేకపోవడం, ఎక్కువగా బయట తిరగటం, బంధువులతో కలవలేకపోవడం, తనలోకంలో తానుండటం 
» చదువులో వెనుకబడటం, చెడు సహవాసాలు, చెడు అలవాట్లకు గురవడం  నిద్రలో మల, మూత్ర విసర్జనాలు చేయడం 
 తినకూడని పదార్థాలు తినడం (ఉదా: మట్టి, సున్నం మొదలైనవి)

మానసిక వ్యాధుల లక్షణాలు
» ఆందోళన, భయం, గుండెదడ, అధికంగా చెమట పట్టడం, కాళ్లు, చేతులు వణకడం 
» గుండె ఆగినట్లు అనిపించడడం, ఛాతినొప్పి, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటం, భయం, ఆందోళన 
» అనవసర ఆలోచనలు మళ్లీ మళ్లీ రావడం, అనవసర పనులు మళ్లీ మళ్లీ చేయడం, చేతులు అదే పనిగా కడగటం 
» అకస్మాత్తుగా మాట రాకపోవడం, కాళ్లు చేతులు పడిపోవడం, మూర్ఛలాగా రావడం 
» విచారంగా, పనిలో ఉత్సాహం లేకపోవడం 
» ఆకలి, నిద్ర లేకపోవుట, ఆత్మహత్య చేసుకోవాలనిపించడం 
» మతిమరుపు, జ్ఞాపకశక్తి తగ్గటం, ప్రవర్తనలో మార్పు, సంధి ప్రేలాపనలు 
» అధికంగా ఆల్కహాల్, మాదకద్రవ్యాల అలవాటు  
» మూర్ఛ వ్యాధితో వచ్చే మానసిక, దీర్ఘకాక వ్యాధులతో బాధలు, పక్షవాతం తర్వాత వచ్చే మార్పులు 
» తనలో తాను నవ్వుకోవటం, మాట్లాడుకోవడం, చెవిలో మాటలు వినబడటం, ఇతరులను అనుమానించడం, భర్తలేక భార్య శీలాన్ని శంకించడం 
» ఎక్కువగా మాట్లాడటం, తిరుగుట, అతి ఆనందం, అతి ధైర్యం లేదా అతికోపం, అతిగా డబ్బు ఖర్చు చేయడం 
» పూనకాలు రావటం, తనకు తాను గుర్తుకు లేకుండా తిరుగుట 
» ముసలితనంలో వచ్చే అనారోగ్య సమస్యలు 
» అనవసరంగా భయాలు, అనుమానాలు పెంచుకోవడం 
» అకస్మాత్తుగా గతంలో జరిగిన ఘటనలు మరిచిపోవడం 
»  బహిష్టు ముందు, తర్వాత వచ్చే మానసిక మార్పులు 
» కాన్పు ముందు, తర్వాత వచ్చే మానసిక మార్పులు 
»ఆకలి లేకపోవడం, నాజూకుతనానికై తినకపోవడం, అదుపు లేకుండా తినడం 
»కలత నిద్ర, నిద్ర పట్టకపోవడం, నిద్రలో నడవటం, మాట్లాడటం, మూత్రవిసర్జన చేయడం, భయంకర కలవరింతలు, అతి నిద్ర, నిద్రలో పళ్లు కొరకడం 
» నిగ్రహ శక్తి కోల్పోవడం, జూదానికి బానిసవటం, పరుల వస్తువులను అపహరించడం, అదే పనిగా షాపింగ్‌ చేయడం 

మానసిక రోగుల సంఖ్య పెరిగింది
కొంతకాలంగా మానసిక వ్యాధుల విభాగానికి  బాధితులు ఎక్కువగా వస్తున్నారు. ఈ సంఖ్య ఏటా పెరుగుతోంది. ముఖ్యంగా కోవిడ్‌–19 పరిస్థితుల అనంతరం మానసిక వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెరిగింది. తీవ్ర మానసిక ఒత్తిడి వల్ల, జన్యుపరంగా, వ్యక్తిగత సమస్యల వల్ల, సమాజంలో పలు కారణాల వల్ల స్క్రిజోఫీనియా, ఆందోళన, డిప్రెషన్‌ వంటి సమస్యలు వస్తాయి. 

ప్రస్తుతం అన్నిరకాల మానసిక సమస్యలకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స అందిస్తున్నాం. అవసరమైన మందులు ఉచితంగా అందజేస్తున్నాం.   – డాక్టర్‌ గంగాధర్‌నాయక్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, మానసిక వ్యాధుల విభాగం, జీజీహెచ్, కర్నూలు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement