జీతానికి అదనంగా 100% ప్రోత్సాహకం దిశగా సర్కారు చర్యలు
గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తే 125%
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూత్రప్రాయ నిర్ణయం
జిల్లా ప్రాంతాల్లోనే సూపర్ స్పెషాలిటీ సేవలకు దోహదం.. త్వరలో ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాలకే పరిమితమవుతున్న డాక్టర్లను పల్లెలకు పంపించే దిశగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లో పనిచేసేందుకు ముందుకు వచ్చే డాక్టర్లకు రెట్టింపు వేతనాలు ఇవ్వాలని నిర్ణయించారు. దీనివల్ల వైద్యులు గ్రామాల వైపు ఆకర్షితులవుతారని, తద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ) మొదలు సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లి పనిచేస్తే వేతనానికి రెట్టింపు (100 శాతం) ప్రోత్సాహకం, గిరిజన ప్రాంతాల్లోకి వెళ్లి పనిచేస్తే 125 శాతం ప్రోత్సాహకం ఇవ్వాలని అధికారులకు మంత్రి చెప్పినట్లు తెలిసింది. మెడికల్‌కాలేజీలు, జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీ, పీహెచ్‌సీలలో వైద్య సేవలు అందించే డాక్టర్లు అందరికీ ఈ ప్రోత్సాహకాన్ని వర్తింపజేస్తారు. వీటికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు ఇవ్వనున్నారు.
ఒడిశా మోడల్
పల్లెల్లో పనిచేసే డాక్టర్ల కంటే హైదరాబాద్‌లో పనిచేసే వారికి హెచ్‌ఆర్‌ఏ (ఇంటి అద్దె అలవెన్సు) ఎక్కువ వస్తుంది. అంతేకాదు నగరంలో ఉంటూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసేవారూ ఉన్నారు. కొందరు సొంత ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇలా అదనంగా ఆదాయం సమకూర్చుకుంటున్నారు. పిల్లల చదువుల కోసం మరికొంత మంది నగరానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా అనేక కారణాలతో గ్రామాలకు, గిరిజన ప్రాంతాలకు వెళ్లడానికి డాక్టర్లు ఇష్టపడడం లేదు.
ఈ నేపథ్యంలో మంత్రి పలుమార్లు వైద్యాధికారులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో అమలవుతున్న ప్రోత్సాహక పథకంపై వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ), వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ తదితరులతో అధ్యయనం చేయించారు.
ఒడిశాలో రాష్ట్ర రాజధాని నుంచి ప్రతి 50 కిలోమీటర్ల దూరానికి ఒక స్లాబ్ నిర్ణయించి, బేసిక్ పేపై 25 నుంచి 150 శాతం వరకూ ప్రోత్సాహకం ఇస్తున్నారు. దీంతో డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనిపై అధికారులు మంత్రికి నివేదిక ఇచ్చారు. దీంతో ఇదే పద్ధతిని రాష్ట్రంలోనూ అమలు చేయాలని మంత్రి నిర్ణయించారు.
జిల్లాలకు వెళితే క్వార్టర్లు కూడా..
జిల్లాలకు వెళ్లే డాక్టర్లకు ఆయా ఆసుపత్రుల్లో క్వార్టర్లు నిర్మించాలని కూడా నిర్ణయించారు. ప్రస్తుతం జిల్లాల్లోని మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆసుపత్రుల్లోని డాక్టర్లకే క్వార్టర్లు ఉన్నాయి. అయితే కొత్తగా సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లకు కూడా క్వార్టర్లు నిర్మించాలని మంత్రి అధికారులకు సూచించారు.
పీహెచ్‌సీల్లోని డాక్టర్లు గ్రామాల్లో కాకుండా సమీపంలో ఉన్న మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలకు వెళ్లి రావొచ్చు కాబట్టి వారికి క్వార్టర్లు అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చారు. అయితే క్వార్టర్లు నిర్మించి ఇవ్వడం వల్ల డాక్టర్లు నిరంతరం అక్కడే ఉండే అవకాశం ఉంటుంది. డాక్టర్ అందుబాటులో లేడనే అభిప్రాయం కూడా ఉండదని మంత్రి భావిస్తున్నారు. ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీల్లో పనిచేసేది స్పెషాలిటీ డాక్టర్లు కాబట్టి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి.
వీరికి ప్రోత్సాహకాలు ఇచ్చి పల్లెలకు పంపడం వల్ల అక్కడే స్పెషాలిటీ సేవలన్నీ అందుబాటులోకి వస్తాయి. ఈ నేపథ్యంలో జిల్లాల్లో డాక్టర్లను పూర్తి స్థాయిలో నియమించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని భావిస్తున్నారు. దీనివల్ల 75% వైద్య సేవలు జిల్లాలకే పరిమితం అవుతాయని, హైదరాబాద్‌పై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment