ఆ వ్యక్తి గుండె కొట్టుకోవడం అపేసింది.. ఇంకేముంది చనిపోయాడని అనుకున్నారందరూ. ఎలక్ట్రిక్ షాకిస్తే (డిఫిబ్రిలేషన్) గుండె మళ్లీ కొట్టుకుంటుందేమో అని ఆశించారు. వైద్యుల సాయంతో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 17 షాకులిచ్చారు. అయినా... ఫలితం లేకపోయింది. ఇక లాభం లేదనుకున్న వైద్యులు.. అంతా అయిపోయిందని బంధువులకు చెప్పాలని అనుకుంటున్న సమయంలో జరిగిందో అద్భుతం! పదిహేడు వరుస షాకులకూ స్పందించని ఆ గుండె మళ్లీ లబ్ డబ్ అనడం ప్రారంభించింది! ఏమా అద్భుతం.. ఎక్కడ జరిగింది? కారణాలేమిటో తెలిశాయా? ఇవేనా మీ అనుమానాలు. తీర్చుకోవాలంటే చదివేయండి మరి!!!
గత ఏడాది జూన్‌లో యూకేలో జరిగిందీ ఘటన. ముప్ఫై ఒక్క ఏళ్ల పిన్న వయసులో బెన్ విల్సన్ రెండుసార్లు కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె పనిచేయకుండా ఉండే పరిస్థితిని అనుభవించాడు. మొదటిసారి గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు వైద్యులు అతడిని రక్షించేందుకు ప్రయత్నించారు. వరుసగా 11 షాకులిచ్చారు. ఇందుకు దాదాపు 40 నిమిషాల సమయం పట్టింది. హమ్మయ్యా బతికిపోయాడులే అనుకునేంతలోపే... విల్సన్‌కు రెండోసారి కార్డియాక్ అరెస్ట్ అయ్యింది. వైద్యులు మళ్లీ డీఫిబ్రిలేటర్‌తో షాకులివ్వడం మొదలుపెట్టారు. పదంటే పది నిమిషాల్లో ఏకంగా ఆరు షాకులిచ్చారు. అప్పటిగానీ విల్సన్ గుండె సాధారణ స్థితికి రాలేదు.!!
అంతేనా.. విల్సన్‌కు బాగైందా? అంటే అక్కడే ఇంకో ట్విస్టు ఉంది. పదిహేడు షాకులు తిన్న గుండె బాగా బలహీనంగా ఉండింది. పైగా గుండె పనిచేస్తోంది కానీ... మెదడుకు రక్తప్రసరణ జరగడం లేదు. పోనీ చికిత్స చేద్దామా అంటే తట్టుకునేంత శక్తి గుండెకు ఉందో లేదో తెలియని పరిస్థితి. ఈ దశలో వైద్యులు ఇంకో కీలక నిర్ణయం తీసుకున్నారు. విల్సన్‌ను కోమాలోనే ఉంచేద్దామని తీర్మానించారు. కోమాలోనే మెదడుకు ఆక్సిజన్ సక్రమంగా అందేలా చేశారు. ఇలా ఐదు వారాలపాటు చికిత్స అందించిన తరువాత కానీ విల్సన్ మామూలు మనిషి కాలేకపోయాడు.
ఆ తర్వాత నెమ్మమదిగా నడవడం, మాట్లాడే సామర్థ్యాన్ని తిరిగి పొందాడు. ప్రస్తుతం అతను కొద్దిపాటి జ్ఞాపకశక్తి సమస్యలను తప్పించి చాలావరకు అతని ఆరోగ్యం మెరుగుపడింది. ఈ మేరకు అతడి భార్య రెబెక్కా హోమ్స్ మాట్లాడుతూ .. ఆ సమయంలో తాను విల్సన్ పక్కనే ఉండిపోయానని, "డ్రీమ్ ఎ లిటిల్ డ్రీమ్ ఆఫ్ మి" అనే మా పాటను పాడుతూ ఉన్నానని నాటి విషాదకర ఘటనను గుర్తు చేసుకుంది. తన దిండుపై తాను ఉపయోగించే స్ప్రేని కొట్టి..అతడు తన కోసం కొన్న టెడ్డీని అతడి పక్కనే ఉంచి వెనక్కి వచ్చేయి విల్సన్ అంటూ అతడివైపే చూస్తూ ఉండిపోయానని చెప్పుకొచ్చింది. తన ప్రేమే అతడిని ఈ విపత్కర పరిస్థితి నుంచి ప్రాణాలతో బయటపడేలా చేపిందని ఆనందంగా చెబుతోంది. అతను తనను ఎంతగానో ప్రేమించేవాడిని, ఈ కష్టకాలంలో అతడి పక్కనే ఉండి ఆ ప్రేమనంత తాను తిరిగి అతడికి అందించానని ఉద్వేగంగా చెప్పింది రెబెక్కా. ఏదీఏమైన ఈ ఘటన మెడికల్ మిరాకిల్ అని చెప్పొచ్చు.
(చదవండి: ప్రపంచంలో అత్యధికంగా ఇష్టపడే మాంసం ఏదో తెలుసా! భారత్‌లో ఏది ఇష్టపడతారంటే..)
Comments
Please login to add a commentAdd a comment