
సాక్షి, అమరావతి: ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన వ్యక్తులు సైతం గుండెపోటు (హార్ట్ ఎటాక్), గుండె స్తంభించిపోవడం (కార్డియాక్ అరెస్ట్) వంటి సమస్యలకు గురై మరణించటం చూస్తుంటాం. ఇలాంటి సందర్భాల్లో కుటుంబ సభ్యులు లేదా చుట్టుపక్కల వారు అవగాహనతో మెలిగి.. సీపీఆర్ చేస్తే ప్రాణాపాయ పరిస్థితులను అధిగమించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
సీపీఆర్ ఇలా..
గుండెపోటుకు గురైన లేదా అకస్మాత్తుగా కుప్పకూలి గుండె ఆగిపోయిన (కార్డియాక్ అరెస్ట్ అయిన) వ్యక్తికి కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేయడం ద్వారా గుండెను మళ్లీ స్పందించేలా చేయవచ్చు. వ్యక్తి స్పృహ తప్పి పడిపోయిన 3–4 నిమిషాల్లో సీపీఆర్ చేయడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడటానికి 60నుంచి 70 శాతం అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సీపీఆర్ ప్రక్రియలో భాగంగా గుండెమీద చేతులతో లయబద్ధంగా వెంటవెంటనే తగినంత ఒత్తిడితో నొక్కాలి. తద్వారా గుండె కండరాలన్నిటినీ ఉత్తేజితం చేసి మెదడుకు అవసరమైన రక్తం మళ్లీ అందేలా చేయవచ్చు. ఓ వైపు సీపీఆర్ చేస్తూనే 108కు ఫోన్‌చేసి అంబులెన్స్‌ను రప్పించి ప్రాథమిక చికిత్స అందిస్తూ ఆస్పత్రికి తరలిస్తే బాధితులు బతకడానికి అవకాశాలు ఉంటాయి.
ఏఈడీ అందుబాటులో ఉంచుకోవాలి
విదేశాల్లో జిమ్‌లు, పెద్దపెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లలో ‘ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్’ (ఏఈడీ) అనే చిన్నపాటి పరికరాలు అందబాటులో ఉంటాయి. వీటిద్వారా గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, ఇతర గుండె సమస్యలకు గురైన వ్యక్తులకు ఏఈడీ ద్వారా షాక్ ఇస్తారు. ఇలా చేస్తే వెంటనే గుండెపోటు, కార్డియాక్ అరెస్టు నుంచి కోలుకునే అవకాశం 60నుంచి 65 శాతం ఉంటుంది. మన దగ్గర కూడా ఈ పరికరాలను అందుబాటులో ఉంచితే చాలామందిని రక్షించడానికి వీలవుతుంది.
కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు
తల తిరగటం, అలసటగా అనిపించడం, గుండెల్లో దడ, ఛాతినొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్పృహ కోల్పోవడం.
వైద్య పరీక్షలు చేయించుకోవాలి
40 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరు బీపీ, షుగర్ వంటి పరీక్షలతో పాటు కొలెస్ట్రాల్, గుండె పనితీరుకు సంబంధించిన పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. కుటుంబంలో పూర్వీకులు ఎక్కువగా గుండెపోటుతో మరణించిన దాఖలాలు ఉంటే అలాంటి వారు జాగ్రత్త పడాలి. రెండేళ్లకు ఒకసారి ఈసీజీ, ఎకో, ట్రెడ్‌మిల్ లేదా స్ట్రెస్ టెస్ట్‌లు చేయిచుకోవాలి.
– డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, గుండె, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడు, కర్నూలు జీజీహెచ్
Comments
Please login to add a commentAdd a comment